Home బిజినెస్ జీవిత కాల కనిష్ఠానికి రూపాయి

జీవిత కాల కనిష్ఠానికి రూపాయి

Rupee depreciated from the dollar to a lifetime loss of 69.62

డాలర్‌తో పోలిస్తే 1 శాతానికి పైగా పతనం
69.62కు రూపాయి మారకం విలువ
భారత్‌పై టర్కీ కరెన్సీ లిరా పతనం ప్రభావం 

ముంబై : రూపాయికి సోమవారం క్లిష్టమైన రోజు అనే చెప్పాలి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్టం 69.62కు పడిపోయింది. వర్ధమాన దేశాల మార్కెట్లలో కరెన్సీల పతనం ప్రభావం దేశీయంగా కనిపించింది. టర్కీ కరెన్సీ లైరా మారకపు విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 7.24ను తాకింది. దీంతో వర్ధమాన దేశాలపై ప్రతికూల ప్రభావం పడింది. శుక్రవారం రూపాయి 68.84 వద్ద ఉంది. అయితే సోమవారం రూ.1.08 (1.57 శాతం) పతనమై 69.91 వద్ద ముగిసింది. ఈ ఏడాది డాలరుతో మారకంలో రూపాయి విలువ 7 శాతం పతనమైంది. జులైలో అమెరికాచైనా వాణిజ్య యుద్ధం ఆసియా కరెన్సీని దారుణంగా దెబ్బతీసింది.

బలపడిన డాలర్
టర్కిష్ లైరా విలువ 8 శాతం పతనం కావడంతో ప్రపంచ దేశాల మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో అమెరికా డాలర్ మరింత బలపడింది. ‘రూపాయి ప్రధానంగా టర్కీ కరెన్సీ పతనం వల్లే క్షీణించింది’ అని ప్రభుత్వరంగ బ్యాంక్ అధికారి ఒకరు అన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు ఆశించినంతగా లేకపోవడం, చమురు ధరలు పెరగడం వంటివి కూడా రూపాయిపై ప్రభావం చూపాయని అన్నారు. నికరంగా రూ.972 కోట్ల విలువచేసే షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు.

అమెరికా టారిఫ్‌ల పెంపుతోనే ఇదంతా..
అమెరికా అన్ని దేశాల దిగుమతులపై సుంకాలను పెంచుతూ వస్తోంది. ఇప్పటికే చైనా, యూరోపియన్ దేశాలతో వాణిజ్య వివాదాలకు తెరతీసిన అమెరికా ప్రభుత్వం గత వారం టర్కీ దిగుమతులపైనా దృష్టి పెట్టింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపునకు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో టర్కీ కరెన్సీ లైరా మారకపు విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 7.24ను తాకింది. నెల రోజుల క్రితం లైరా విలువ 4.84 స్థాయిలో నమోదైంది. అంతలోనే భారీ పతనం చూసింది. దీంతో టర్కీ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ఫలితంగా డాలరు బలపడగా, ట్రెజరీ ఈల్డ్ నీరసించాయి. టర్కీ ప్రెసిడెంట్ టయ్యిప్ ఎర్డోగన్ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలు పెంచడం, అమెరికా ప్రభుత్వంతో వ్యతిరేకత ఏర్పడటం వంటి ప్రతికూల అంశాలు ఇందుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు.

స్టాక్ మార్కెట్లు పతనం
అమెరికా, యూరప్, ఆసియా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. డాలరుతో మారకంలో టర్కీ కరెన్సీ లైరా కుప్పకూలడంతో యూరో కూడా ఏడాది కనిష్టానికి చేరింది. శుక్రవారం అమెరికా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

1 డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79 పైసలు పడిపోయి జీవితకాల కనిష్టం 69.92కు చేరింది. సోమవారం దేశీయ, ఇతర దేశాల ఈక్విటీ మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి.
2 విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరిగింది. దీంతో రూపాయి సెంటిమెంట్‌పై ప్రభా వం పడిందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు.
3 రూపాయి మరింతగా పతనమైతే రిజర్వు బ్యాంక్ జోక్యం చేసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
4 టర్కిష్ లైరా పతనంతో వర్ధమాన దేశాల మార్కెట్ల కరెన్సీ కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో అమెరికా డాలర్, యెన్ వంటి సురక్షిత కరెన్సీల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు.
5 గతవారం అమెరికా టర్కీ దిగుమతులపై సుంకాలను పెంచింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టర్కీ కరెన్సీ లైరా మారకపు విలువ ఒక్కసారిగా కుప్పకూలి 7.24ను తాకింది. నెల రోజుల క్రితం లైరా విలువ 4.84 స్థాయిలో నమోదైంది. అంతలోనే భారీ పతనం చూసింది.
6 ఇటీవల రైటర్స్ పోల్‌లో 40 విదేశీ మారక విశ్లేషకులు రూపాయిపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో రూపాయి 68.22 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
7 అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, పెట్టుబడులు తరలిపోవడం వంటి రూపాయిపై ప్రభావం చూపుతాయి. దీంతో కరెంట్ ఖాతా లోటు మరింత పెరగవచ్చు.