Friday, April 19, 2024

మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం: దిమిత్రి రోగోజిన్‌

- Advertisement -
- Advertisement -

Dimitry

మాస్కో: రష్యా ‘విక్టరీ డే’ వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్‌, రష్యా దేశాల ముఖ్య నేతల వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌ చీఫ్‌ దిమిత్రి రోగోజిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గనుక నిజంగా అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దిమిత్రి రోగోజిన్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. శత్రువు (పశ్చిమ దేశాలు)ను ఓడించడమే పుతిన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. నాటో తమపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోందని మండిపడ్డారు.

బహిరంగంగా అంగీకరించకపోయినప్పటికీ పశ్చిమ దేశాలు పరోక్షంగా రష్యాపై యుద్ధం సాగిస్తున్నాయని ఆరోపించారు. శత్రువుపై అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం తమకు ఉన్నప్పటికీ,  ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అణు యుద్ధం ప్రపంచ పరిణామాలతోపాటు మన భూగోళం స్థితిగతులనే మార్చేస్తుందని, అందుకే అది తమకు ఇష్టం లేదని వెల్లడిం చారు. బలవంతుడైన శత్రువును ఆర్థిక, సైనికపరమైన మార్గాల ద్వారా, సంప్రదాయ యుద్ధరీతులతోనే ఓడిస్తామని దిమిత్రి రోగోజిన్‌ పేర్కొన్నారు.
1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న ‘విక్టరీ డే’ జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. మే 9 రష్యా విక్టరీ డేను ఉద్దేశించి…ఈసారి ఉక్రెయిన్ దాని మిత్రదేశాలు గెలుస్తాయన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News