Friday, April 19, 2024

తొలి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

తొలి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది
ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
స్పుత్నిక్5గా నామకరణం
పుతిన్ కుమార్తెకు తొలి టీకా

Russia Register World's first Corona Vaccine

మాస్కో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొనిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రకటించారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని మాస్కోలోని గమలేయ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను సమర్థవంతంగా నిరోధించే వ్యాధినిరోధకతను కలిగి ఉందని వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ పుతిన్ చెప్పారు. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి మైఖేల్ మురష్కాను కోరారు. ఈ నెలలోనే వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని చెప్పారు. కొద్ది వారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తిని చేపట్టి లక్షలాది డోస్‌లను సరఫరా చేస్తామని పుతిన్ ప్రకటించారు. కాగా రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ‘స్పుత్నిక్ 5’గా వ్యవహరిస్తారు. కాగా తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఈ వ్యాక్సిన్‌ను వేయించినట్లు పుతిన్ చెప్పారు. వ్యాక్సిన్‌ను అందించిన తర్వాత ఆమెలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీస్ దీటుగా పెరిగాయని ఆయన చెప్పారు. ‘తొలి సారి ఆమెపై టీకా ప్రయోగించాక శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. మరుసటి రోజు 37 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది.

అంతే..ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. రెండోసారి వ్యాక్సిన్‌ను ఇచ్చినప్పుడు కూడా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగి తర్వాత తగ్గింది. ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె శరీరంలో యాంటీ బాడీస్ సమృద్ధిగా తయారయ్యాయి’ అని చెప్పారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. కాగా తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేపడతామని చెప్పారు. కాగా, దేశంలో రెండు చోట్ల్ల గమేలియా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బిన్నోఫార్మ్ కంపెనీల్లో ఈ వాక్సిన్ ఉత్పత్తిని చేపడతాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మురష్కో చెప్పారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా 7.35 లక్షల మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.1.2 కోట్ల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో వైపు అమెరికా, బ్రిటన్‌తో పాటుగా పలు దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి.

Russia Register World’s first Corona Vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News