Saturday, April 20, 2024

వినాశనం

- Advertisement -
- Advertisement -

Russian bombardment of Ukrainian cities

మానవ మహావిషాదం

ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా బాంబుల వర్షం. 70 శాతం పట్టణాలను స్వాధీనం చేసుకున్నాం: రష్యా మరియుపోల్ పోర్ట్ సిటీని చుట్టుముట్టిన బలగాలు ఖేర్సన్ సిటీ హస్తగతం? ఖార్కివ్‌పై భీకర దాడులు: పరుగులు పెడుతున్న పౌరులు రష్యా వైపూ భారీగా నష్టాలు రష్యా మేజర్ జనరల్ హతం? 10 లక్షల మందికి పైగా ఉక్రెయిన్లు వలసవెళ్లారు: ఐరాస

కీవ్: ఉక్రెయిన్ యుద్ధం ఎనిమిదో రోజు కూడా రష్యా సైన్యాలు ఆ దేశ ప్రధాన నగరాలపై పట్టు సాధించే క్రమంలో భీకర స్థాయిలో దూసుకు వెళ్తున్నాయి. రష్యా రక్షణ శాఖ కథనాల ప్రకారం ఉక్రెయిన్ ప్రధాన పట్టణాల్లో 70 శాతంపైగా రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. ఒక వైపు భూభాగం, మరో వైపు గగనతలం.. రెండు మార్గాల్లో గురువారం ఉదయంనుంచి ఉక్రెయిన్ పోర్టు నగరాల ఏరియాల్లో దాడులను ఉద్ధృతం చేసింది. అజోవ్ సముద్ర తీర నగరమైన మరియుపోల్ నగరాన్ని రష్యా సైన్యాలు చుట్టుముట్టాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నల్లసముద్రప్రాంతంలోని మరో పోర్టు సిటీ ఖేర్సన్ పరిస్థితి ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు. ఖేర్సన్ నగరంను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ బలగాలు చెబుతుండగా అమెరికా రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఆ వార్తలను కొట్టిపారేశారు. ఖేర్సన్ నగరంలో ఇంకా తీవ్ర పోరు కొనసాగుతోందనేది తమ అభిప్రాయమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు.

పోరు ఇంకా కొనసాగుతున్నందున ఖేర్సన్ లో పరిస్థితి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం ఎపి వార్తాసంస్థకు తెలిపింది. అయితే రష్యా సేనలు నగరంలోకి ప్రవేశించాయని, నగర పరిపాలనా భవనంలోకి వచ్చాయని ఖేర్సన్ నగర మేయర్ ఇగోర్ కోలిఖయేవ్ చెప్పారు. పౌరులపై కాల్పులు జరపవద్దని. వీధుల్లోని మృత దేహాలను సేకరించడానికి తమ సిబ్బందిని అనుమతించాలని తాను వారిని కోరానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నగరంపై నిర్విరామంగా దాడులు కొనసాగుతున్నాయని, వీధులు, ఇళ్లు, అపార్ట్‌మెట్లనుంచి గాయపడిన వారినితరలించడానికి కూడా తమకు అవకాశమివ్వడం లేదని మరియుపోల్ నగర మేయర్ వాదిమ్ బోయ్‌చెంకో ఇంటర్‌ఫాక్స్ వార్తాసంస్థకు చెప్పారు. ఉక్రెయిన్‌లో తీవ్ర దాడులకు తెగబడుతున్న రష్యా కొంత పట్టు సాధిస్తున్నప్పటికీ భారీ స్థాయిలో సైనిక, ఆయుధ నష్టాలను చవిచూస్తోందని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రతిఘటనల్లో ఇప్పటివరకు 9 వేల మంది రష్యన్ సైనికులు మృతిచెందినట్లు తెలిపింది. అంతేకాకుండా 217 యుద్ధ ట్యాంకులు, 900 సాయుధ శకటాలు, 374 యుద్ధ వాహనాలు, 90 ఫిరంగులు, 30 విమానాలు, 31 హెలికాప్టర్లు, వందల సంఖ్యలో ఇంధన ట్యాంకులు, భారీ మొత్తంలో యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

పౌరుల తరలింపునకు అంగీకారం

ఇదిలా ఉండగా, గురువారం జరిగిన రెండో విడత చర్చల్లో సైనిక దాడులు జరుగుతున్న ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించడానికి రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించాయి.

వారం రోజుల్లో పదిలక్షలకు పైగా వలసలు

ఇదిలా ఉండగా రష్యా దాడులు మొదలైన తొలి ఏడు రోజుల్లో ఉక్రెయిన్‌నుంచి పది లక్షలకంటే ఎక్కువ పౌరులు పొరుగు దేశాలకు తరలి వెళ్లారని ఐరాస శరణార్థుల ఏజన్సీ(యుఎన్‌హెచ్‌సిఆర్) చీఫ్ ఫిలిప్పో గ్రాండీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంక్షోభానికి తక్షణమే ముగింపు పలకకపోతే.. లక్షలాది మంది ఉక్రెయిన్‌ను వీడతారని ఆయన చెప్పారు.ప్రస్తుతం 40 లక్షల మంది ఉక్రెనియన్ శరణార్థులకు రక్షణ, తక్షణ సహాయం అవసరమని యుఎన్‌హెచ్‌సిఆర్ అంచనా వేసింది.

ఖార్కివ్‌పై భీకర దాడులు.. జనం పరుగులు

దాదాపు 15 లక్షల జనాభా కలిగిన ఖార్కివ్ నగరాన్ని వీడి జనం పెద్ద ఎత్తున పొరుగు దేశాలకు పారి పోతున్నారు. ఎడతెగకుండా కురుస్తున భాంబుల, శతఘ్ని గోళాలను తప్పించుకుని సిటీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న వందలాది మంది గమస్థానమేదో తెలియకుండానే కనిపించిన రైళ్లలోకి చొరబడుతున్నారు. మరో వైపు కీవ్ నగరం వైపు దాదాపు 65 కిలోమీటర్ల పొడవునా ముందుకు దూసుకు వస్తున్న రష్యా బలగాలకు అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతోంది. రెండు రోజుల క్రితమే దేశ రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బలగాలు ఇప్పటికీ ఇంకా చాలా దూరం లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

రష్యా మేజర్ జనరల్ హతం?

కాగా ఎనిమిదో రోజు యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రష్యామేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీ హతమైనట్లు బెలారస్ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై రష్యన్ అధికారులు స్పందించాల్సి ఉంది. అలాగే తమ గగనతలంలోకి వచ్చిన అత్యంత శక్తివంతమైన రష్యా యుద్ధ విమానం సుఖోయ్( ఎస్‌యు30 ఫైటర్ జెట్)ని ఒక్క దెబ్బకు తమ బలగాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్ బలగాల కమాండర్ ఇన్ చీఫ్ వాలేరి జాలుజ్నియి ఒక ప్రకటనలో తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News