Friday, April 26, 2024

ఇదేమి న్యాయం?

- Advertisement -
- Advertisement -

S.A. Bobde's controversial verdict

 

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆ యువతిని పెళ్లి చేసుకోడానికి సిద్ధపడితే ఆమెకు న్యాయం జరిగినట్టేనా, ఆమె ఇష్టానిష్టాలతో పని లేదా? రేప్ చేసిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయడమనేది విజ్ఞత గల ఎవరికైనా అక్రమం అనిపిస్తుంది. కాటేసిన పాముకే కట్టబెట్టడమనిపిస్తుంది. కాని మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డేకి మాత్రం అలా అనిపించలేదు. చెరిచిన వాడు ఆ బాధిత మహిళ మెడ లో తాళి కట్టేస్తే సమస్య పరిష్కారమైపోతుందని ఆయన భావిస్తున్నారు. అత్యాచారం, లైంగిక వేధింపులు అంటే మహిళ సమ్మతి లేకుండా చేసే దౌర్జన్యపూరిత నేరాలు, అటువంటి దారుణానికి పాల్పడే వ్యక్తికే ఆ మహిళను ఇచ్చి పెళ్లి చేయడమంటే జీవితాంతపు అనునిత్య నరకంలోకి ఆమెను తోసివేయడం కాదా? దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఇటువంటి పరిష్కారాలను సూచిస్తే తనను ప్రేమించడానికి ఇష్టపడని యువతిపై అత్యాచారం చేయడం ద్వారా ఆమెను శాశ్వతంగా తన దానిని చేసుకోడానికి దేశంలోని యువకులు తెగబడరా, ఇది అంతింతని చెప్పడానికి వీల్లేని సామాజిక అరాచకానికి, మహిళా లోకపు మరో మెట్టు బానిసత్వానికి దారి తీయదా? మహారాష్ట్ర విద్యుదుత్పత్తి కంపెనీలో పని చేస్తున్న మొహిత్ సుభాష్ చవాన్ అనే వ్యక్తి మైనారిటీ తీరని పదహారేళ్ల పాఠశాల విద్యార్థినిని హింసించి రేప్ చేసిన కేసులో తనను అరెస్టు నుంచి తప్పించాలంటూ నిందితుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా సిజెఐ బాబ్డే వారిద్దరికీ పెళ్లి జరిపించడం ద్వారా కేసుకు ముగింపు చెప్పాలని సంకల్పించారు.

అరెస్టు చేస్తే నిందితుడు ఉద్యోగం కోల్పోతాడని అతడి తరపు న్యాయవాది వాదించగా ‘ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడితే సాయం చేయగలం, లేకపోతే అతడు ఉద్యోగం కోల్పోయి జైలుకు వెళ్లవలసి ఉంటుంది, అతడు ఆమెపై అత్యాచారం చేశాడు’ అని జస్టిస్ బాబ్డే అనడం గమనార్హం. తనకు పెళ్లైనందున ఆ అమ్మాయిని చేసుకోలేనని నిందితుడు స్పష్టం చేసిన తర్వాత నెల రోజుల పాటు అరెస్టు చేయకుండా అతడికి ధర్మాసనం రక్షణ కల్పించింది. ఆలోగా సాధారణ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ విధంగా ఒక రేపిస్టుకు కఠినంగా శిక్ష పడేలా చేయవలసిన అత్యున్నత న్యాయస్థానం అతడు అరెస్టు నుంచి తప్పించుకోడానికి మార్గం కల్పించింది. కేసు విచారణ సమయంలో నిందితుడిని పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నించిన ప్రధాన న్యాయమూర్తి నీకిష్టమైతేనే చెప్పు, తర్వాత మేము బలవంతం చేసి ఒప్పించామనవద్దు అని కూడా అనడం గమనార్హం.

పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో బాధిత మహిళలు రాజీపడి తమపై అత్యాచారం చేసిన వ్యక్తులనే పెళ్లి చేసుకొనేలా చేసే అవకాశం బొత్తిగా లేదు. ఈ విషయం తెలిసి కూడా భారత ప్రధాన న్యాయమూర్తి ఖాప్ పంచాయతీల స్థాయి పరిష్కారాన్ని సూచించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ కేసులో ఈ విధంగా వ్యవహరించిన రోజునే (మార్చి 1, 2021) జస్టిస్ బాబ్డే మరో కేసులో భర్త బలవంతంగా భార్యను అనుభవించడం వైవాహిక అత్యాచారం అనడం తగునా అంటూ వ్యాఖ్యానించారన్న వార్త గమనించదగినది. భర్త మొరటువాడే కావచ్చు, చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న భార్యను లైంగికంగా అనుభవించడాన్ని అత్యాచారమని ఎలా అంటాం అని జస్టిస్ బాబ్డే అభిప్రాయపడడం నిజంగానే ఆశ్చర్యకరం, అభ్యంతరకరం. దేశంలో పురుష దురహంకారం పేట్రేగిపోయి మహిళలపై దౌర్జన్యాలు రెచ్చిపోయి వారు తరచూ హత్యలకు గురి కావడమో, ఆత్మహత్యలు చేసుకోడమో జరుగుతున్న నేపథ్యంలో మహిళల హక్కులను కాపాడడానికి దీక్ష వహించవలసిన న్యాయ స్థానాలు ఇటువంటి పరిష్కార మార్గాలను చూపించడం దురదృష్టకరం.

మహిళ పురుషుడితో సమానమైన హక్కులను అనుభవించేలా చూడవలసిన వ్యవస్థలే గత కాలపు మగ రాజ్యాన్ని ఇంకా పొడిగిం చడానికి దుస్సాహసించడం దారుణం. జస్టిస్ బాబ్డే వైఖరిని గమనించిన దేశంలోని మహిళా ఉద్యమ సంస్థలు ఆయన రాజీనామాను డిమాండ్ చేశాయి. అత్యాచార బాధితులు రోబోలు కారని వారి ఆలోచనలను, అభిప్రాయాలను వేరెవరో రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం తగదని ప్రముఖ వామపక్ష ఉద్యమకారిణి బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ఈ రేప్ కేసులో చేసిన వ్యాఖ్యలను జస్టిస్ బాబ్డే ఉపసంహరించుకోవాలని, అరెస్టు నుంచి నిందితుడికిచ్చిన రక్షణను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం నుంచే మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే ఇటువంటి పరిష్కార మార్గాలు వెలువడితే దేశంలోని కింది న్యాయస్థానాలు అత్యాచార బాధిత మహిళల విషయంలో ఇంకెంత అమానవీయ సూచనలు చేస్తాయో, తీర్పులు ఇస్తాయో ఊహించవచ్చు. అటువంటి పరిస్థితి మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే చూసే స్థితికి ఈ దేశాన్ని మరింతగా దిగజారుస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News