Home తాజా వార్తలు అంతర్జాతీయ వర్సిటీల స్థాయికి అనురాగ్ యూనివర్సిటీ ఎదగాలి

అంతర్జాతీయ వర్సిటీల స్థాయికి అనురాగ్ యూనివర్సిటీ ఎదగాలి

Sabitha inaugurated Anurag University at ghatkesar

 

హైదరాబాద్ : అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయికి అనురాగ్ యూనివర్సిటీ ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. విద్యార్థులకు కార్పోరేట్, ఎంఎన్‌సి కంపెనీలలో ఉద్యోగాలు లభించేలా ప్రమాణాలతో కూడిన విద్యా బోధన చేయాలని పేర్కొన్నారు. సోమవారం ఘట్‌కేసర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో పోటీతత్వంతో విద్యా ప్రమాణాలు పెంచి నాణ్యమైన విద్యను అందించే ఉద్యేశ్యంతో సిఎం కెసిఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చాయని అన్నారు.

అందులో అనురాగ్ యూనివర్సిటీ ఒకటని పేర్కొన్నారు. కఠినమైన ప్రమాణాలు పాటించినందుకు అనురాగ్‌కు యూనివర్సిటీ హోదా లభించిందని తెలిపారు. సెయింట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా ప్రభావం వల్ల విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇప్పుడు క్వారంటైల్‌లో విద్య కాదని క్వారంటీమ్‌గా విద్యా బోధన చేయాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు ఎప్పటి కప్పుడు మార్పులు చేస్తూ నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు.

అనురాగ్ యూనివర్సిటీ ఛైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాట్లాడుతూ 1990 సంవత్సరంలో స్థాపించబడిన గాయత్రీ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1998లో లలిత డిగ్రీ కాలేజీ, 2002లో సివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, 2005లో లలితా ఫార్మసీ కాలేజీ స్థాపించామని అన్నారు. 2010లో ఇవన్నీ కలిపి అనురాగ్ గ్రూప్ అఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌గా రూపాంతరం చెందిందని చెప్పారు. ప్రస్తుతం అనురాగ్ గ్రూప్ అఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎన్‌బిఎ, నాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో స్థానం సంపాదించిందన్నారు. టైమ్స్ అఫ్ ఇండియా ర్యాంకింగ్స్ – 2020 లో, తెలంగాణలో 5వ ర్యాంకు, దేశ వ్యాప్తంగా 23 వ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు.

తమ విద్యాసంస్థల్లో ప్రమాణాలతో కూడిన విద్యా బోధన చేస్తూ భవిష్యత్తులో సాంఘిక, వ్యవసాయ, న్యాయ, వైద్య విద్యలలో కోర్సులు ప్రవేశ పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అనురాగ్ యూనివర్సిటీలో 14 డిగ్రీ, 13 పిజి, 9 పిహెచ్‌డి ప్రోగ్రాములు నిర్వహిస్తున్నామన్నారు. అదనంగా ఇంజనీరింగ్ విభాగంలో కంప్యూటర్ సైన్స్‌లో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ 5 కొత్త కోర్సులు, బిబిఎలో డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ప్రత్యేకతలతో కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి హాస్టల్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వర్సిటీ ఛాన్స్‌లర్ యు.బి. దేశాయ్ మాట్లాడుతూ, అనురాగ్ విద్యాసంస్థ యూనివర్సిటీగా రూపాంతరం చెందినందుకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.

అనురాగ్ ఉన్నత విద్యాలయంగా ఎదగాలి : సిఎం కెసిఆర్ సందేశం
అనురాగ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తమ అధికారిక సందేశాన్ని పంపించారు. “దేశంలో మానవ వనరుల అభివృద్ధి కోసం నాణ్యమైన విద్య ప్రముఖమైనది, ప్రపంచ స్థాయి పోటీని, సాంకేతికతను పెంచడానికి ప్రైవేట్ సంస్ధల భాగస్వామ్యం ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయం ఒక మంచి ఉన్నత విద్యాలయంగా ఎదిగి విద్యా వవస్థలో ఒక నూతన ఒరవడిని సృష్టించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐటి మంత్రి కె.టి.రామారావు వీడియో సందేశం పంపించారు. అనురాగ్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ అధికంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా విద్యా బోధన చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీకి శుభాకాంక్షలు తెలిపారు.