Thursday, April 25, 2024

సొంత గూటికి సచిన్ పైలట్?

- Advertisement -
- Advertisement -

సొంత గూటికి సచిన్ పైలట్?
రాహుల్, ప్రియాంకలతో కీలక భేటీ
అధిష్టానం క్షమిస్తే సయోధ్యకు గెహ్లాట్ సిద్ధం
14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు
విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా వోటింగ్?

న్యూఢిల్లీ: ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న కీలక సమయంలో కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు సచిన్ పైలట్ సోమవారం నాడిక్కడ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో భేటీ కావడం ప్రాధ్యాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి సచిన్ పైలట్, ఆయన మద్దతుదారులైన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారన్న ఊహాగానాలకు ఈ భేటీ ఊతమిచ్చింది. రాహుల్ గాంధీ నివాసంలో మధ్నాహ్నం దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగిందని, భేటీ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పైలట్ గత కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన తిరిగి పార్టీలోకి రావడానికి సంబంధించిన కార్యాచరణ రూపొందుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాజస్థాన్‌కు సంబంధించి పైలట్ లేవనెత్తిన అంశాలనన్నిటీ పరిష్కరించడానికి పార్టీ అగ్రనాయకత్వం సుముఖత వ్యక్తం చేసిందని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం విశ్వాస తీర్మానంపై వోటింగ్‌ను ప్రవేశపెట్టిన పక్షంలో అందుకు అనుకూలంగా పైలట్, ఆయన అనుచర ఎమ్మెల్యేలు వోటు వేయాలన్న ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో పార్టీ అగ్రనాయకత్వం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్, మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పిసిసి అధ్యక్ష పదవి నుంచి పార్టీ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుకు సంబంధించి రాజస్థాన్ పోలీసులకు చెందిన ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజి) వీరిపై దేశద్రోహం ఆరోపణలతో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా ఈ ఆరోపణలను గెహ్లాట్ ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించింది. పార్టీ అగ్రనాయకత్వం క్షమిస్తే పైలట్‌తోపాటు ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలను పార్టీలోకి తిరిగి ఆహ్వానించడానికి తనకు అభ్యంతరం లేదని ఆదివారం జైసల్మేర్‌లోని ఒక రిసార్ట్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గెహ్లాట్ పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో తెలియచేశారు. తామంతా ప్రజాస్వామ్య యోధులమని, ఈ యుద్ధంలో తాము గెలిచి మూడున్నరేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల యుద్ధంలో కూడా విజయం సాధిస్తామని గెహ్లాట్ ప్రకటించారు. ఇప్పటి వరకు చూపించిన ఐక్యతను అసెంబ్లీ సమావేశాల్లోనూ చూపించాలని కూడా ఆయన ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

Sachin Pilot meet with Rahul and Priyanka Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News