Monday, August 19, 2019
Home తాజా వార్తలు ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు

ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు

Sachin-Tendulkar

లండన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ పురస్కారాలు, అవార్డులు అందుకున్న సచిన్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అసాధారణ ప్రతిభను కనబరిచిన క్రికెటర్లకు ఈ అవార్డు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. తాజాగా భారత భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెందూల్కర్‌కి ఈ అరుదైన గౌరవం దక్కింది. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బౌలర్ అలన్ డోనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ క్యాథిరిన్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది. ఈ విషయాన్ని ఐసిసి శుక్రవారం స్వయంగా వెల్లడించింది. కాగా, లండన్‌లో నిర్వహించిన ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో సచిన్ పాల్గొని మాట్లాడారు.

తనకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ అని ఐసిసి కొనియాడింది. ‘లెజెండ్ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం’ అని ఐసిసి ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్దనే సచిన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియో సైతం ఐసిసి విడుదల చేసింది. కాగా, ఐసిసి హాల్ ఫేమ్‌లో చోటు సంపాదించిన ఆరో భారత క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. ఇంతకుముందు బిషన్ సింగ్ బేడి, సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ ఈ ఘనత సాధించారు.

Sachin Tendulkar inducted into ICC Hall of Fame