Home తాజా వార్తలు అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Forest Martyrs

 

రాజేంద్రనగర్ : అటవీ లేకుంటే మనం లేము. మనమంతా బాగుండాలని అత్యధికంగా అడవులను పరిరక్షించాలనే కర్తవ్య నిర్వాహణలో ఎందరో తెలంగాణ అటవీ సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేశారని రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, లా మరియు దేవాదాయ శాఖల మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి గుర్తు చేశారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు తెలంగాణలో 100 ఏళ్ల క్రితం నాటి అటవీ సంపధను వృద్ధి చేసుకోవడానికి అటవీశాఖలోని క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రధాన ప్రాంగాణంలో నిర్వహించిన తెలంగాణ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ నిర్వాహణలో నక్సలైట్ల, స్మగ్లర్ల చేతిలో, వన్యమృగాల దాడిలో మరణించిన అటవీ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ అండగా ఉంటుందని తెలిపారు.

గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతాలతో పాటు పట్టణ, గ్రామీణ, బస్తీలలో, కాలనీలు, ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు ఇలా అనేక రకాలుగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా 174 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. అందులో 50 శాతం బాగా పెరుగుతున్నాయని, దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చట్టాల ద్వారా నాటిన మొక్కల్లో 85 శాతం వరకు రక్షించబడేలా పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకువచ్చి ప్రజా ప్రతినిధులు, అధికారులను బాగస్వాములను చేశారని గుర్తు చేశారు. దీంతో రానున్న రోజుల్లో 100 నుంచి 200 ఏళ్ళ క్రితం ఎలాంటి అటవీ వాతావరణం ఉందో తెలంగాణాలో అలాంటి అటవీ కల రానుందని స్పష్టం చేశారు. అందుకోసం క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కంప పథకం ద్వారా రూ.3110 కోట్ల నిధులు రాష్ట్రాలనికి మంజూరు చేసిన విషయాన్ని మంత్రి ఈసందర్భంగా వెల్లడించారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా గల శాఖ పోలీస్ శాఖ అయితే రెండో స్థానం అటవీశాఖదే అని చెప్పారు. ప్రస్తుతం 4500 మంది అధికారులు అటవీశాఖలో ఉన్నారని, ఆ సంఖ 5500 తీసుకువచ్చేలా ఉద్యోగ నియామకాలు జరుగాల్సి ఉందని తెలిపారు. అమరులైన సిబ్బంది మీ కుటుంబాల త్యాగాలు ఎన్నటికి మరిచిపోమని, అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్ఫగుచ్ఛాలు ఉంచిన మంత్రి అధికారులతో కలసి ఘనంగా నివాళులు అర్పించారు.

ముఖ్యమంత్రి ఆశయాలకు అణుగుణంగా అటవీశాఖ పనితీరు : రాష్ట్ర అటవీశాఖ అధిపతి ఆర్.శోభ
అటవీ ఉద్యోగులుగా విధి నిర్వహణలో 1984 నుంచి 2013 వరకు 21 మంది అటవీ అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన అధికాణి(అధిపతి) ఆర్.శోభ ఐఎఫ్‌ఎస్ గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, పరికరాల సమకూరణ సత్ఫలితాల దిశగా విధి నిర్వాహణలో ఉద్యోగులకు రక్షణగా మారిందని గుర్తు చేశారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణకు హరితహారం విజయవంతం చేయడంతో పాటు ‘ జంగల్ బచావో జంగల్ బడావో’నినాధాంతో అటవీశాఖలో పని చేస్తున్న సిబ్బంది క్షేత్రస్థాయి నుంచి విధి నిర్వహణలో తమ పాత్ర మరింత మెరుగ్గా నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.

1737లో అంటే 300 ఏళ్లక్రితం ఇదే సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లో అటవీ చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తున్న అక్కిడ ప్రజలు చేసిన ప్రాణ త్యాగాలకు గుర్తుగానే నేడు దేశవ్యాప్తంగా అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖను అటవీ, వన్యప్రాణి సంపధల పరిరక్షణకు మరింత శక్తివంతం చేయడానికి కృషి జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో పిసిసిఎఫ్ ( రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) పి.రఘువీర్, చీఫ్‌వైల్డ్ లైఫ్ వార్డెన్ మునీంద్ర, పీసీసీఎఫ్(అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, పీసీసీఎఫ్ పృథ్వీరాజ్,అడిషనల్ పీసీసీఎఫ్‌లు డోబ్రియల్, లోకేష్ జైశ్వాల్, డాక్టర్ జి. చంద్రశేఖర్‌రెడ్డి,,ఫర్గెయిన్,డా.సిదానంద్ కుక్రేటీ, జూపార్కు క్యూరేటర్ యన్.క్షితిజ, అటవీశాఖ మాజీ అధికారులు బుచ్చిరాంరెడ్డి, బిఎస్‌ఎస్.రెడ్డి, తిరుపతయ్య, జగన్మోహన్‌రావు, ఓంకార్‌సింగ్ తో పాటు జూపార్కు అసిస్టెంట్ క్యూరేటర్లు జి.జ్ఞానేశ్వర్, భవానీశంకర్, ఎ. సతీష్‌బాబు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సందేశం వినిపించిన : అడిషనల్ పిసిసిఎఫ్ డాక్టర్ జి.చంధ్రశేఖర్‌రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంపిన సందేశాన్ని అటవీశాఖ అధనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి చదివి వినిపించారు. ఆ సారాంశం కింది విధంగా ఉంది. అడవులు ప్రకృతి ప్రసాధించిన అమూల్యమైన సంపద. అడవులు సంమృద్ధిగా ఉంటే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో పర్యావరణ సమతుల్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుచున్నది. రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమము ద్వారా గత 5 సంవత్సరాలుగా కోట్లాది మొక్కలు నాటి సంరిక్షిచడం జరుగుచున్నది.

భావి తరాల పౌరులకు ఇది మనమిచ్చే అమూల్య కానుక, వారసత్వ సంపద కన్న ఇది మిన్న. అటవీ సంరక్షణ విధుల్లో అటవీ సిబ్బంది అసమాన దైర్య సాహసాలతో , తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తమ కర్తవ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది అటవీ అధికారులు భూ ఆక్రమణదారుల దాడుల్లో, స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయి అమరులైనారు. ఈ ధన్య జీవులను పేరు పేరున స్మరించుకొందాము. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా, భూమిపై ప్రాణ కోటి మనుగడకు ఆధారమైన అడవుల సంరక్షణకు ఆత్మార్పణం చేసిన అమరులకు నా హృదయపూర్వక శ్రద్ధాంజలి. విధి నిర్వహణలో వీరు చూపిన అంకిత భావం ఆదర్శంగా తీసుకొని “ జంగల్ బచావో జంగల్ బడావో ” నినాదంతో కృషి చేయాలని అటవీ అధికారులు అందరినీ కోరుతున్నాను.
ఇట్లు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం

 

Sacrifice of Forest Martyrs are unforgettable