Home తాజా వార్తలు సద్దుల బతుకమ్మ

సద్దుల బతుకమ్మ

Saddula Bathukamma

 

9వ రోజు, ఆఖరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ను ఆరాధిస్తారు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో ‘సద్దుల బతుకమ్మ’ పండుగను జరుపుకుంటారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా ‘గౌరమ్మ’ను పసుపుతో తయారు చేస్తారు. ఆ గౌరమ్మను పూజించిన తర్వాత.. ఆ పసుపును తీసి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు. అమ్మవారికి ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఆడవాళ్లంతా చేరి ఐక్యతతో ప్రేమను కలపి చుట్టు నిలబడి పాటలు పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. ఇక చీకటి పడుతుంది అనగా.. ఆడపడుచులు ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న చెరువుకు ఊరేగింపుగా బయలుదేరుతారు. అక్కడ మెల్లగా బతుకమ్మల పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత మలీద అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు.

మలీద

కావాల్సినవి : చపాతి పిండి తగినంత, జీడిపప్పు, బాదం 100 గ్రాములు, తురిమిన బెల్లం 200 గ్రాములు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరికాయ, నెయ్యి రెండు స్పూన్లు, యాలకులు 3, సోంపు ఒక టీ స్పూన్
తయారీ : చపాతీ పిండి తీసుకుని చపాతీలు వత్తుకోవాలి. వత్తుకున్న చపాతీల మీద నెయ్యిని రాసుకోవాలి. అలాగే నెయ్యి రాస్తు నాలుగైదు మడతలు పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ ముద్ద చేసుకుని చపాతీలుగా వత్తుకొని పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టుకుని ఆ చపాతీలను కాల్చుకుని హాట్ బాక్స్‌లో ఉంచాలి. ఎందుకంటే చల్లగా అయితే ఉండలుగా చుట్టుకోడానికి రాదు. ఎండు కొబ్బరికాయ, యాలకులు, సోంపు, జీడిపప్పు, బాదం వేసి మిక్సీ పట్టాలి. అలాగే చపాతీలను కూడా ముక్కలుగా చేసి మిక్సీకి పట్టాలి. అందులో తురిమి పెట్టుకున్న బెల్లం కూడా ఆ చపాతీలతో కలిపి మళ్ళీ మిక్సీకి పట్టాలి. ఆ మివ్రమాన్ని ముందు పొడిగా చేసుకున్న మిశ్రమంలో కలుపుకుని నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకోవాలి. అంతే మలీద లడ్డూలు రెడీ.

బతుకమ్మ పాటలు

బతుకమ్మ సింగార వైభోగం

మొగలిరేకుల జడను ఉయ్యాలో
సోకుగా అల్లికమ్మ ఉయ్యాలో
సిగపైన పెట్టిరి ఉయ్యాలో
మల్లె, మరువం దండ ఉయ్యాలో
కనకాంబరాలూ ఉయ్యాలో
పాపిట సిందూరమై ఉయ్యాలో
నొసట పెట్టిరి చిన్నారి ఉయ్యాలో
మందారం మొగ్గను ఉయ్యాలో
పోకబంతులు గున్నాలై ఉయ్యాలో
చిట్టి చామంతులు ఉయ్యాలో
కంఠ హారమైనావి ఉయ్యాలో
కలువపూలు నీకు ఉయ్యాలో
దండ కడియాలై ఉయ్యాలో
రుద్రాచ్చ పూలు ఉయ్యాలో
చేతికి గాజులై ఉయ్యాలో
ముద్దబంతి పూలన్నీ ఉయ్యాలో
నడుముకి వడ్డాణం ఉయ్యాలో
అల్లిన బొడ్డుమల్లెలు ఉయ్యాలో
కాళ్లకు పట్టీలై ఉయ్యాలో
పారిజాత పూలు ఉయ్యాలో

Saddula Bathukamma Festival Celebrations