Home జాతీయ వార్తలు ‘రాముడికి భారీ విగ్రహం’పై సాధువుల అభ్యంతరం!

‘రాముడికి భారీ విగ్రహం’పై సాధువుల అభ్యంతరం!

Sadhus reject proposal of Ram Statue

వారణాసి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని శ్రీరాముడి కోసం నిర్మిస్తామన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్ణయం హిందూ ఆధ్యాత్మిక సమాజంలో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మించిన ఎత్తుతో శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మిస్తా మంటూ నరేంద్రమోడి ప్రభుత్వం, యోగి ప్రభుత్వం రాముడిని అవమానిస్తున్నాయని’ వారణాసిలో మూడురోజుల పరమ ధర్మ సదస్సులో పాల్గొం టున్న రాజకీయేతర సాధువులు, ఆధ్మాత్మిక గురువులు విమర్శిస్తున్నారు. అయోధ్యలో గత ఆదివారం విశ్వ హిందూ పరిషద్ ధర్మ సభ నిర్వహిం చిన రోజునే వారణాసిలో పరమ ధర్మ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న వందలాది మంది సాధువులు అయోధ్యలో జరిగిన విహెచ్‌పి సభను అధర్మ సభ’గా అభివర్ణించారు. న్యాయస్థానాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అధర్మం కాక మరేమిటని సాధువులు ప్రశ్నించారు. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు త్వరితగతిన విచారణ చేపట్టకపోవడాన్ని అయోధ్య సభలో పలువురు వక్తలు తప్పుపట్టిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. వారణాసి సదస్సులో పాల్గొన్న సాధువులు భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో శ్రీరాముడికి పోలిక పెట్టేందుకు బిజెపి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను నిరసించారు. 221 మీటర్ల ఎత్తయిన శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన భగవంతుడిని అవమానించడమే. అటువంటి ఎత్తయిన ప్రదేశంలో ఉండే విగ్రహానికి హిందువులు ఎలా పూజలు చేయగలరు? భగవంతుడి విగ్రహం గుడిలో ఉండాలి తప్ప ఆరుబయట కాదు, అని వారణాసికి చెందిన ప్రసిద్ధ సాధువు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. ఈ సదస్సును జ్యోతిర్మఠ శంకరాచార్య స్వరూపానంద సరస్వతి నిర్వహించారు. యుపిలోని బిజెపి ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను శ్రీరాముడితో పోల్చడానికి ప్రయత్నిస్తోంది. పటేల్ కొన్ని సంస్థానాలను విలీనం చేసి ఉండవచ్చు కాని శ్రీరాముడు అఖండ జగత్తుకే ఆరాధ్య దేవుడు, అని ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన నాలుగు మఠాలలో ఒకటైన జ్యోతిర్మఠాధిపతి వ్యాఖ్యానించారు.

ఇటీవలే మోడి ప్రభుత్వం గుజరాత్‌లోని నర్మద నది ఒడ్డున 182 మీటర్ల ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ మధ్యే పటేల్ విగ్రహాన్ని సందర్శించిన యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రాముడికి అంత కంటే ఎత్తయిన విగ్రహాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. రాముడి విగ్రహం ఎత్తు గురించి ఆదిత్యనాథ్ ప్రకటించనప్పటికీ ఆయన మంత్రివర్గ సహచరుడు, ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తాము ప్రతిష్టించబోయే శ్రీరాముడి విగ్రహం 221 మీటర్ల ఎత్తు ఉంటుందని వెల్లడించారు. 20 మీటర్ల ఎత్తయిన ఛత్రం, 50 మీటర్ల పీఠంతో కలిపి విగ్రహం ఎత్తు 221 మీటర్లు ఉంటుందని ఆయన చెప్పారు.
దీనిపై జ్యోతిర్మఠం శంకరాచార్య స్పందిస్తూ శ్రీరాముడు రాజకీయ నాయకుడు కాదని వ్యాఖ్యానించారు. హిందువులకు రాముడి విగ్రహం అక్కర్లేదు. హిందూ మతం గురించి ఆదిత్యనాథ్‌కు అర్థమవుతుందో లేదో మాకు తెలియదు. ఎత్తయిన రాముడి విగ్రహ ప్రతిష్టాపన హిందూ వ్యతిరేకం ఎందుకు అవుతుందో మాత్రం ఆయన అర్థం చేసుకుంటే మంచిది. మోడి, యోగి ప్రభుత్వాలు హిందు మతాన్ని మతోన్మాద శక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తు న్నారు, అని శంకరాచార్య ఆక్షేపించారు. కాషాయ వస్త్రాలను ధరించే యోగి ఆదిత్యనాథ్ గోరక్‌పూర్‌లోని గోరక్‌నాథ్ ఆలయానికి మహంతుగా కూడా ఉన్నారు. వారణాసిలో సమావేశమైన సాధువులు శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఆదిత్యనాథ్ ఇకనైనా రాముడి విగ్రహ ఆలోచన మానుకోవాలని అవిముక్తేశ్వరనాంద ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, విహెచ్‌పి అయోధ్యలో ఆదివారం నిర్వహించిన ధర్మ సభలో చాలా మంది సాధువులు పాల్గొనలేదు. అయోధ్యలో తాత్కాలిక రామ్ లాలా మందిరానికి ప్రధాన పూజారి అయిన మహంత్ సత్యేంద్ర దాస్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా మంది ప్రముఖ సాధువులు ఈ సభను దూరం పెట్టారని చెప్పారు. ధర్మ సభలో పాల్గొనడానికి శంకరాచార్య నిరాకరించారు. నిజమైన ఆధ్మాత్మిక గురువులు లేకుండా ఏ ధర్మ సభ పరిపూర్ణం కాదు. అది కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే, అని ఆయన చేసిన వ్యాఖ్యలు విహెచ్‌పి అయోధ్యలో నిర్వహించిన ధర్మ సభ స్వరూపాన్ని రుజువు చేస్తుంది.

Sadhus reject proposal of Ram Statue