Friday, April 19, 2024

రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్

- Advertisement -
- Advertisement -

Sahu maharaju is Father of reservations

 

భారతదేశ చరిత్రలో బహుజనులను(బీసీ,ఎస్సి,ఎస్టీ మరియు మైనారిటీలు) బ్రాహ్మణ భావజాల,సిద్ధాంత పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా మహాత్మ జ్యోతిబాపూలే ఛత్రపతి శివాజీ మహారాజ్ ల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యా తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల నాయకుడి గా మిగిలిపోయిన మహోన్నతుడు ఛత్రపతి సాహుమహారాజ్ . 1874 జూన్ 26 న రాధాబాయి , జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గే లకు జన్మించిన యశ్వంతరావు ఘాట్గే నే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్ గా ప్రసిద్ది చెందుతాడు . ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి ( ఓబీసీ ) చెందిన కున్భీకాపు కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి17న తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి యశ్వంత్ రావు ఘాట్గే కి ముద్దుగా ’ సాహు ’ అని పేరు పెట్టుకుంది. మూడేళ్ళకే తల్లిని కోల్పోయిన సాహు 1886 మార్చి 20 న తండ్రి మరణంతో 11 ఏళ్ళకే తల్లిదండ్రులిద్దరులేని వాడైనాడు .సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణ లో జరిగినందున ఆధునిక,ప్రాపంచిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు .

రాజర్షి సాహుజీ

తన 20 వ ఏటా 1894 ఏప్రిల్ 2 న సింహాసనం అధిష్టించిన సాహుజీ. 1900 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం చేయకుండానే వచ్చి సాహు క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడింపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక మంత్రాలు చదివి అవమానిస్తాడు.పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన , దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు. [మరాఠా సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ కేవలం వెనుకబడిన కులానికి చెందన వ్యక్తి అని అయినా పట్టాభిషేకనికి నేపాల్ నుండి వచ్చిన గంగాబాట్ అనే బ్రాహ్మణపురోహితుడు తన ఎడమకాలి బొటనవేలుతో తిలకం దిద్ది ఘోరమైన అవమాననికి గురిచేశారు.) ఈ సంఘటనలు సాహు మహారాజ్ ని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైంది.బాస్కరరావు జాదవ్ అనే ఉద్యోగిని ’ సత్యశోధక్ సమాజ్ ’ నడిపే బాధ్యతలు అప్పచెప్పి ’ మరాఠ దీనబందు ’ పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించిండు . బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు , వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్దతిలో జరిగాయి. తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో మత కర్మలలో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ రంగాలతో పాటు వ్యాపారం , వడ్డీ వ్యాపారం లో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించిండు . బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో , జీవితాల్లో మార్పు రాదని , బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని సాహు భావించిండు . తన ప్రైవేట్ సెక్రెటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యుయేట్ అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియచేసింది. ఐతే ఆ రాజ్యంలో అప్పటికి గ్రాడ్యేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరు లేరు.

వెనుకబడిన కులాల విద్యార్థులకు వసతిగృహాలు

సాహు వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్ , హాస్టల్స్ ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపాడు. కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించాడు . ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901 లో జైన హాస్టల్ , విక్టోరియ మరాఠ హాస్టల్ , 1906 లో ముస్లీంలకు , 1907 లో వీరశైవ లింగాయత్ లకు , 1908 లో అంటరానివారికి , మరాఠాలకీ 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి నామ్ దేవ్ హాస్టల్ , విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు .ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి అందరికి , అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించాడు . పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని అన్ని ఆలయాలను చావడీలను పాఠశాలలుగా వాడాలనీ ఏగ్రామంలో ఏ కులస్తులు మెజారిటీ గా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. ముస్లీంలకు వాళ్ళ మాతృ భాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి ఆతర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యాసంస్థలని రద్దు చేస్తూ అన్ని కులాల మతాల వారు కలిసిమెలిసి ఏపాఠశాలలో నైన విద్యా సంస్థలో నైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం .వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి.

రిజర్వేషన్లలకు ఆజ్యం

జులై 26 , 1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం , ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50% రిజర్వేషన్ లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది . వెనుకబడిన వర్గాలు అనగా బ్రాహ్మణ , ప్రభు , షెన్వీ , పార్శీ ఇతర అభివృద్ది చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు . అంటరానివారి నుండి అన్ని మతాలలో వెనుకబడినవారు కూడా రిజర్వేషన్ కిందికే వస్తారు. గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ ( పాటిల్ ) , పట్వారీ ( కులకర్ణి ) వ్యవస్థని 1918 లో రద్దు చేసాడు. టీచర్ ట్రైనింగ్ మరియు పాటిల్ ట్రైనింగ్ స్కూల్స్ పెట్టించి, విద్యారంగం లో సాహు కృషి కేవలం ఆక్షరాస్యత కే కాకుండా సంగీత, సాహిత్య , నాటక ప్రక్రియలన్నింటిని ప్రోత్సా హించి. సాహు ఆస్థానంలో అల్లాదియాఖాన్ అనే గొప్ప సంగీత విద్యావేత్త ఉండేవాడు . రాజవల్లి అనే గొప్ప గాయనీ ఉండేది.సాహు కాలంలో నాటక రంగం అభివృద్ది చెందింది. కొల్హాపూర్ జ్జ్ఞాన సమాజ్ , కిర్లోస్కర్ కంపెనీ , స్వదేశ్ – హితా చింతక్ వంటి నాటక సమాజాలకు ఉదారంగా విరాళాలిచ్చేవాడు .భారత దేశంలో మొట్టమొదటి మహిళా నాటక సమాజమైన ’ శేషశాని స్త్రీ సంగీత నాటక మండలి ’ కొల్హాపూర్ కి చెందినదే . సాహు ఏర్పరిచిన భూమిక పై నుండే వి.శాంతారాం , మాస్టర్ వినాయక్ షిండే లాంటి ప్రసిద్దులైన సినిమా దర్శకులు కొల్హాపూర్ ప్రాంతం నుండి వచ్చిండ్రు.

కుల నిర్మూలన ఉద్యమం (మహా విప్లవం)

ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలిస్తే సరిపోదని తను చెప్పిన మాటలు ఆచరించి చూపిండు సాహు మహారాజ్ . నిరక్షరాస్యుడైన గంగారామ్ కాంబ్లే అనే అంటరాని వ్యక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను టీ తాగి తన వాళ్ళందరికి తాగిస్తాడు . పాలన నిర్వహణకి అవసరమైన విద్యార్హతలు లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకి తీసుకున్నాడు . రథచోదకులుగా, మావటీలుగా, రక్షకభటులుగా నియమించిండు . 1919 సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అంటరాని ఉద్యోగులతో ప్రజలు గానీ , ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే పిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఉద్యోగులైతే ఆరు వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దైపోతుంది . 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థ ని రద్దు చేస్తూ చట్టం చేసింది ప్రభుత్వం . గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగాలైన ’ తలాతీ ’ ( సుంకరి , గ్రామ రెవెన్యూ సహాయకులు ) లుగా అస్పృశ్యులే ఉంటారు కాబట్టి వాళ్ళందరికి ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు ట్రేనింగ్ స్కూల్స్ ప్రారంభించిండు.1919 నవంబర్ 6 న వెలువడిన చట్టం ప్రకారం అన్ని విధాల వృత్తుల్లోను , ఉద్యోగాల్లోను ఉండే అస్పృశ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించిండు.

డా.అంబేద్కర్ ఉద్యమానికి సహకారం

ఆదివాసీ తెగలకు , అంటరాని వారికి సంబంధించి బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన ’ నేరస్థ కులాల చట్టాన్ని ’ 1918 లో రద్దు చేశారు. మహర్ , మంగు , రామోషీ , బెరాద్ లాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడే కులాల ప్రజలు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చర్యతో రద్దైoది సాహుమహారాజ్ అంటరానివారికి ఆపద్భాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబా సాహేబ్ అంబేడ్కర్ సాహు మహారాజ్ ల మద్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటీష్ చట్టాలు మంచిచెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలను కుంటున్నాననీ ఐతే ఆర్థిక ఇబ్బందులతో చేయలేక పోతున్నానడంతో ఆ పత్రిక కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో ’ మూక్ నాయక్ ’ పత్రిక ప్రారంభమౌతది.1920 , ఎప్రిల్ 15 న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు 1920 లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహుమహారాజ్ అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం ’ మూక్ నాయక్ ’ పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసిండు .రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ , ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా వ్యవహరించిండు సాహు . 1922 ఫిబ్రవరి 16న డిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ’ ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్న మించి ఉన్న అంబేడ్కర్ ఇంగ్లాండ్ లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టం. మన భారత జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేడ్కర్ ను మీరందరు ఆదర్శంగా స్వీకరించాలని , ఆయన స్థాయికి అందుకోవడానికి మీ అభివృద్ధికి కావలిసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన ’ అంటూ మాట్లాడాడు.

మహిళల అభ్యుదయ వాది

పితృస్వామ్య , కుల , మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయి కి యూరోపియన్ టీచర్ ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించిండు . సంగీతంలో , చిత్రలేఖనంలో , ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇప్పించాడు .కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు .ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు , ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు. కొల్హాపూర్ రాజారాం కాలేజీ లో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పరిచారు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన , వసతి సదుపాయాలు కల్పించాడు. 1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది. 1919 జులై 12న కులాంతర , వర్ణాంతర వివాహాలను చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన ’ కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ – 1918 ’ ప్రకారం ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడం లో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగష్ట్ 2 న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలను సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని , దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు . ప్రభుత్వం దేవదాసీ ల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు.కొల్హా పూర్ ప్రాంతంలోని కోర్టులన్నిoటిలో సివిల్ , క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండేది. రోజుకి ఎన్ని కేసులు విచారణ జరుపుతామనే అంచన లేక పెద్ద సంఖ్యలో పిలవడము చాలా మంది కేసు బెంచ్ మీదికి రాకనే తిరిగి పోవడం పదే పదే జరుగడంతో చాలా మంది పేదలు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకి పరిష్కారంగాను 1919 అక్టోబర్ 17న చట్టం చేస్తూ రోజు కు కేవలం మూడు కేసులకి మించి విచారణకు స్వీకరించకూడదు.అక్కడ సరైన న్యాయం జరగలేదని ఏ పౌరుడైనా భావిస్తే నేరుగా మహారాజ్ ని కలవచ్చు. సాహు 1920 లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రం లోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందిన ’ హిందూ పర్సనల్ లా ’ లో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది.

సాహుజీ ఓ మహర్షి

ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మద్యే ఉంటూ సమస్యలు తెలుసుకుంటా ప్రజల భాషలో మాట్లాడేవాడు . పరిపాలనలో ప్రజలకు అర్ధం కాని , ప్రజలకు ఇబ్బంది కల్గించే బ్రాహ్మణ గుమాస్తాల , పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలన వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చి లో నిర్ణయం తీసుకున్నాడు . కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను , రుణాలని మాఫీ చేసిండు . అప్పుల కింద రైతుల ఆస్తులని , పనిముట్లనీ , పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894 లోనే చట్టం చేసిండు. 1918 లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు చేసిండు . రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినపుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పని చేయించిండు. రాధానగరి , పనాలా , కరవీర్ , శిరోల్ వంటి ప్రాజెక్ట్ లని నిర్మించిండు . ’ కింగ్ ఎడ్వర్ట్ అగ్రికల్చరల్ ఇన్సిట్యూట్ ’ ద్వారా రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిండు. తన తండ్రి పేరుతో ఏర్పరచిన ’ జైసింగ్ రావు ఘాట్గే టెక్నికల్ ఇన్సిట్యూట్ ’ ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్కర కర్మాగారాలు , బట్టల మిల్లులు , గోనే సంచుల ఫ్యాక్టరీలు , చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి.

స్వాతంత్రం గురించి సాహు 1917 , డిసెంబర్ 27 నాసిక్ లో జరిగిన సభలో ’ ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యం గానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి అని అన్నాడు. బొంబాయి ప్రెసిడెన్సి బ్రిటీష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్ కు 1917 , డిసెంబర్ 29 న లేఖరాస్తూ వెనుకబడిన కులాలను ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాoగం లో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్ళలో వెనుకబడిన కులాలకు అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలని కోరిండు ముంబాయిలో కార్మికుల ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ’రష్యా , జర్మనీ ఇంగ్లాండ్ లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి ’ అన్నడు.
1917 లో మరాఠ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ’ నేనిక్కడికి ఒక మహారాజ్ గా రాలేదు ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా రైతుగా భావించవచ్చు. నాపూర్వీకులు ఇదే పని చేశారు ’ అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి ,సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఇలా అంటాడు సాదారణ రైతు కుటుంబానికి, వెనుకబడిన కులానికి చెందిన జ్యోతిబాపూలే సామాజిక ఉద్యమ కారుడు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒక రాజు అయిన సాహు మహారాజ్ ఇంత నిబద్దతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం.
( జూన్ 26, 2020 ఛత్రపతి సాహు మహారాజ్ 146వ జయంతి)

కొంపెల్లి రాజు బహుజన్, 9177780013

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News