Home ఎడిటోరియల్ విరుగుడెప్పుడు!

విరుగుడెప్పుడు!

Saidabad rape accused found dead on railway tracksహైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిపాప చైత్రపై పొరుగింటి 30 ఏళ్ల పల్లకొండ రాజు అత్యాచారం చేసి హతమార్చి మూటకట్టి తన ఇంటిలోనే దాచిపెట్టి పరారైన దారుణోదంతానికి ఊహించని రీతిలో పడిన ముగింపు తెర, ఆ వ్యవహారానికి అంతటితో ఫుల్‌స్టాప్ పెట్టినా దానికి దారి తీసిన కారణాల కూకటి వేళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. అవి ఇటువంటి మరిన్ని ఘోరాలకు దారి తీసి ఇంకెంతో మంది ఆడపిల్లలను బలి తీసుకునే ప్రమాదం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. అందుచేత ఒక బాధ్యత గల సమాజంగా ఆ హేతువులపై సమగ్ర చర్చ జరిపి వాటి మూలాలను పెకలించ వలసిన అగత్యముంది. ఈ ఉదంతంలో హత్యాచారానికి గురైన బాలికది నిరుపేదరికంలో మగ్గుతున్న గిరిజన కుటుంబం. ఉపాధి కోసం నల్లగొండ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చింది. తండ్రి ఆటోరిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హత్యాచారానికి తెగించిన రాజు కూడా పేద కుటుంబానికి చెందినవాడేనని తెలుస్తున్నది. అతడు గంజాయికి అలవాటుపడ్డాడనీ భార్యను ఘోరంగా హింసించడంతో ఆమె వదిలి వెళ్లిపోయిందని సమాచారం.

అపారమైన సంపద ఉన్న వారు కళ్లు మూసుకుపోయి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం ఒక తీరు అయితే పేద కుటుంబాల్లోని పురుషులు కూడా ఈ దారుణాలకు ఒడిగట్టడం మరొక తీరు. రెండింటిలోనూ ఉన్నది పురుష దురహంకారమే, ముష్కర కాముకతమే. వీటికి మూలంలో ఉన్నది చెప్పనలవికానంత పురుషాధిపత్య భావజాలమేనని అంగీకరించక తప్పదు. అక్కడ సరైన చికిత్స జరగ్గకుండా అనునిత్యం సాగిపోతున్న ఈ అత్యాచార, హత్యాచారాల పట్ల ఎంతగా గగ్గోలు పెట్టినా ప్రయోజనం ఉండదు. పురుష దురహంకారం కరడుగట్టిపోయిన వారు ఇంటిలోనూ, వీధిలో కూడా దాని ప్రభావంతోనే వ్యవహరిస్తారు. మానవ హక్కులనేవి వీరికి బొత్తిగా గిట్టనివి. మహిళలకు ఇండియా అత్యంత ప్రమాదకరమైన దేశమని 2018 జూన్‌లో అమెరికాకు చెందిన థామస్ రాయిటర్స్ ఫౌండేషన్ విడుదల చేసిన అధ్యయన నివేదిక ఎత్తి చూపింది. మహిళల సమస్యలపై 550 మంది నిపుణులు లోతైన పరిశీలన జరిపి ఈ నివేదికను రూపొందించారు. భారత దేశంలో మహిళల చేత బలవంతంగా పని చేయిస్తారని, ఇంటి చాకిరీకి కట్టిపడేస్తారని, బలవంతపు పెళ్లిళ్లు చేసి లైంగిక దాస్యం చేయించుకుంటారని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది.

2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత మహిళలపై లైంగిక దాడులకు, హింసకు శిక్షలను తీవ్రతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టం తీసుకు వచ్చినా ఇండియాలో మహిళలపై రోజుకి 100 లైంగిక దాడులు జరిగిపోతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. మహిళల పట్ల అన్ని రకాల వివక్షను, హింసను అంతమొందించాలని 2015లో ప్రపంచ నేతలు పూనిన శపథాన్ని వాస్తవ చిత్రం అపహాస్యం చేస్తున్నది. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరిపై భౌతిక లేదా లైంగిక హింస జరుగుతున్నదని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో భారత దేశం అత్యంత కపట పూరితమైనటువంటి కీర్తిని మూటగట్టుకున్నది. మన పురాణాలు, సంప్రదాయ ఆలోచనలు మహిళను గౌరవించాలని, పూజించాలని, మాతృమూర్తిగా నెత్తిన పెట్టుకోవాలని చెబుతున్నప్పటికీ స్త్రీని చెరబట్టడం, వస్త్రాపహరణం చేయడం వంటి దుర్మార్గాలు ఆ ఇతిహాసాల్లోనే కనిపిస్తాయి. నిజ ప్రపంచంలో ఇవి అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నిరంతరాయంగా సాగిపోతున్నాయి. చదువు లేని నిరుపేద పురుషుల్లో అయితే తాగుడు, మాదకద్రవ్యాలు సేవించడం నిత్యకృత్యమైపోయి మహిళలపై గృహ హింస నిరాఘాటంగా సాగిపోతున్నది. బయట వొంటరిగా కనిపించే యువతులను, బాలికలను నిర్దాక్షిణ్యంగా చిదిమివేసే తత్వమూ రోజురోజుకీ ప్రబలిపోతున్నది.

ఇటువంటివి జరిగినప్పుడల్లా పోలీసు వ్యవస్థను నిందించడం మామూలే. దాన్ని భరించలేక వారు నిందితుల కోసం తీవ్రమైన గాలింపు చేపట్టడం సహజమే. అయితే నిందితులను అక్కడికక్కడే చంపి వేయాలనే డిమాండ్ కూడా పెరుగుతూ వస్తున్నది. బాధ్యత గల పదవుల్లోని వారే ఎన్‌కౌంటర్ చేయాలనడమూ చూస్తున్నాము. ఇదంతా వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి సమస్యను నలుగురి మధ్య పడిన పాములా పరిష్కారానికి అందకుండా చేయడమే. పోలీసులు, చట్టం ద్వారా లేదా చట్టానికి బయట జరగవలసినవన్నీ జరిగిపోతాయి. కాని ఈ దారుణాలు మాత్రం ఆగకుండా ఒక దాని వెంట మరొకటి వడివడిగా సంభవిస్తూనే ఉంటాయి. అంతిమంగా మహిళ పురుషాహంకార పులినోట చిక్కిన దీన ప్రాణిగా నిరంతరం బతకక తప్పడం లేదు. అందుచేత బహిరంగ వధలో, ‘ఎన్‌కౌంటర్’ లో, ఉరి శిక్షలో ఈ సమస్యకు పరిష్కారం కానేకావు. సమాజ సారథులు స్థిమితంగా కూచొని మన రాజ్యాంగం నిర్దేశించిన మానవ హక్కులు స్త్రీ, పురుష, ధనిక, పేద తదితర తేడాలేమీ లేకుండా అందరికీ సమానంగా లభించేలా చూడవలసి ఉంది.

Saidabad rape accused found dead on railway tracks