Home తాజా వార్తలు త్వరలోనే ‘సలార్’ సెట్స్‌లోకి…

త్వరలోనే ‘సలార్’ సెట్స్‌లోకి…

Salaar Movie has completed 50 percent shoot

 

దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా వరకు భారీ చిత్రాల రిలీజ్‌లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చిత్రాలని అర్థాంతరంగా వాయిదా వేశారు. అయితే కరోనా ప్రభావం రిలీజ్ కోసం సిద్ధంగా వున్న చిత్రాలపైనే కాకుండా సెట్స్‌పై వున్న భారీ చిత్రాలపై కూడా పడింది. దీంతో చాలా వరకు స్టార్స్ తమ చిత్రాల షూటింగ్‌లని నిలిపి వేశారు. ఖాళీ సమయం చిక్కడంతో కొంత మంది ఇతర దేశాలల్లో విహరిస్తుంటే మరికొంత మంది స్టార్లు తమ ఫ్యామిలీతో హాయిగా గడుపుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన ‘సలార్’ మూవీ షూటింగ్‌కి బ్రేకిచ్చేసి ఇటీవల యూరప్ ట్రిప్‌కు వెళ్లారు. తాజాగా తన ట్రిప్‌ని ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చేశారు.

అయితే ప్రభాస్ నిర్మాణ దశలో వున్న తన ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లను తిరిగి ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే ఈ స్టార్ రెండు పాన్ ఇండియా చిత్రాల షూటింగ్‌లను రికార్డు స్థాయి వేగంతో పూర్తి చేశారు. ‘రాధేశ్యామ్’ కోసం కొంత ఎక్కువ సమయమే పట్టినా ‘ఆది పురుష్’ చిత్ర షూటింగ్‌ని మాత్రం ఆశ్చర్యపోయే విధంగా రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసేశారు. విఎఫ్‌ఎక్స్‌కు భారీ స్కోప్ వున్న మూవీ కావడంతో ఈ మూవీ షూటింగ్‌ని ముందుగానే పూర్తి చేసి మిగతా చిత్రాల షూటింగ్ కోసం సిద్ధమైపోయారు. రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల తరువాత సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఇక ‘కెజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

దీంతో ఈ మూవీని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభాస్, ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. దీంతో ప్రభాస్ ముందుగా ‘సలార్’ షూటింగ్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో యంగ్ రెబల్ స్టార్ సందడి చేయనున్నారని తెలిసింది. ఈ మూవీతో పాటే ‘ప్రాజెక్ట్ కె’ని కూడా ఆపకుండా పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. సైన్స్ పిక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. హిమాలయాల్లో ఉన్న ఓ గుహ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథగా ఈ మూవీ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోందని చెబుతున్నారు. ఆదిత్య 369 మూవీ తరహాలో ఆ గుహ నుంచి మరో కాలానికి ప్రయాణించి ప్రభాస్ అండ్ కో ఏం చేశారన్నదే ఈ చిత్ర కథ అని సమాచారం. దీనికి బలాన్ని చేకూరుస్తూ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఈ మూవీకి మెంటర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం.

Salaar Movie has completed 50 percent shoot