Home మంచిర్యాల అమ్మకానికి సబ్సిడీ గొర్రెలు

అమ్మకానికి సబ్సిడీ గొర్రెలు

police

*దళారులకు విక్రయిస్తున్న లబ్ధిదారులు
*రూ.3.33లక్షల విలువ చేసే గొర్రెల పట్టివేత
*వాహనం సీజ్ ఇద్దరి అరెస్టు

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి  ప్రభుత్వం యాదవుల అభివృద్ధి కోసం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేయగా పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు అనారోగ్యంతో ఉండడం, మృతి చెందడం లాంటి సంఘటనల వలన లబ్ధిదారులు పొరుగు జిల్లాల దళారులకు విక్రయిస్తున్నారు. కాగా ఆదివారం సబ్సిడీ గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌తోపాటు గొర్రెలు, నిందితులను రామగుండం టాస్క్‌ఫోర్స్ సిఐ సారిలాల్ నేతృత్వంలో పోలీసులు  పట్టుకున్నారు. చెన్నూర్ మండలం లింగంపల్లి గ్రామం నుంచి 3.33 లక్షల విలువ చేసే 62 గొర్రెలను పట్టుకున్నారు. చెన్నూర్ మండలం లింగంపల్లి నుంచి జగిత్యాల జిలా వెల్గటూర్ మండలం రాజరాంపల్లి గ్రామానికి తరలిస్తుండగా మంచిర్యాలలో వ్యాన్‌ను నిలిపి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన సూత్రదారి హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గెల్లు మల్లేష్ కాగా కొనుగోలు చేసిన వ్యక్తి వెల్గటూర్ మండలం రాజరాంపల్లి గ్రామానికి చెందిన మేకల ఓదెలుగా పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గొర్రెలను పశుసంవర్థకశాఖ అధికారి ఎం. తిరుపతి, తహసీల్దార్ కుమారస్వామిలకు అందజేశారు.
జిల్లాలో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెల వివరాలు
మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో 183 గొర్రెల పెంపకం దారుల సంఘాలలో 11,619 మంది సభ్యులు ఉన్నారు. వీరికి తొలి విడత కింద 5833, గొర్రెలు రెండో విడతలో 5786 గొర్రెలను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 4830 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయగా 1003 యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. అనారోగ్యాల కారణాల వలన 1507 గొర్రెలు మృతి చెందగా 307 గొర్రెలకు బీమా డబ్బులు చెల్లించగా మరో 1200 గొర్రెలకు బీమా డబ్బులు చెల్లించాల్సి ఉంది. కాగా మృతి చెందిన గొర్రెలకు బీమా డబ్బులు వస్తాయో లేదోననే అనుమానంతో యాదవులు, దళారులను ఆశ్రయించి గొర్రెలను విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పంపిణీ చేసిన గొర్రెలను విక్రయించినా, కొనుగోలు చేసినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితిల్లో యాదవులు గొర్రెలను దళారులకు విక్రయిస్తున్నారు.