Home వార్తలు నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర చేశా

నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర చేశా

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరోహీరోయిన్‌లుగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందించిన చిత్రం ‘అ..ఆ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంతతో ఇంటర్వూ విశేషాలు...

samanthaమొదటిసారి కామెడీ పాత్రలో…
ఈ వేసవిలో విడుదలవుతున్న నా చివరి సినిమా ‘అ..ఆ’. నా కెరీక్‌కు ఎంతో ముఖ్యమైన సినిమా ఇది. నేను ఇప్పటివరకు సీరియస్, ఇంటెన్స్, రొమాన్స్… ఇలా రకరకాల జోనర్స్ సినిమాల్లో నటించాను. కానీ కామెడీని మాత్రం ప్రయత్నించలేదు. మొదటిసారి కామెడీ పాత్రలో నటిస్తున్నాను. కామెడీ అనేది చాలా కష్టమైన జోనర్. సినిమాలో నా పాత్రకు పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను.
నవ్వించే సినిమా…
త్రివిక్రమ్‌కు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఈ సినిమాలో నేను ఎక్కువగా ఆయన్నే అనుసరించాను. ‘అ..ఆ’ ఓ కొత్త కాన్సెప్ట్ అని నేను చెప్పను కానీ… సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి ఒక్కరి మొహం మీద చిరునవ్వు మాత్రం ఉంటుందని చెప్పగలను. నేను ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మళ్లీ మళ్లీ సినిమా చూడాలనిపించింది.
స్క్రిప్ట్ నచ్చి చేశాను…
త్రివిక్రమ్ సినిమా అని ‘అ..ఆ’ చేయలేదు. మొదటి నుండి నన్ను గమనిస్తే… నాకు స్క్రిప్ట్ నచ్చితేనే తప్ప ఎవరి గురించో సినిమా చేయను. స్క్రిప్ట్ నన్ను సంతృప్తిపరిస్తేనే సినిమా చేస్తాను.
పూర్తిస్థాయి ప్రేమ కథ…
ఈమధ్య కాలంలో హీరోయిన్‌లకు తక్కువ ప్రాముఖ్యత ఉండే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. 10 సినిమాల్లో ఒక సినిమాకు మాత్రమే హీరోయిన్‌కు మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో నాకు ‘అ..ఆ’ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రేమ కథను మాత్రమే కాకుండా కుటుంబంలోని బంధాలను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పూర్తిస్థాయి ప్రేమ కథను త్రివిక్రమ్ ఇప్పటివరకు చేయలేదు.
అల్లరి చేసే పాత్ర…
సినిమాలో నేను పోషించిన పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. చాలా అల్లరి చేస్తూ… తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. నా కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైన పాత్రగా చెప్పుకోవచ్చు.
వారితో స్నేహం ఉంది…
అదే దర్శకులతో, హీరోలతో మళ్లీ మళ్లీ పని చేయడంతో నాకు సౌకర్యంగా అనిపిస్తుంది. చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్‌లతో నాకు మంచి స్నేహం ఉంది. ఈ సినిమాలో చక్కగా నటించడానికి వారితో ఉన్న స్నేహం తోడ్పడింది.
ఫ్లాప్ వస్తే బాధపడతాను…
నేను హిట్స్, ఫ్లాప్స్ బాగా పట్టించుకుంటాను. హిట్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడతానో… ఫ్లాప్ వచ్చినప్పుడు అంతే బాధ పడతాను. అయినా… రిజల్ట్ అనేది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. సమ్మర్‌లో రిలీజైన నా సినిమాలు తేరి, 24 మంచి విజయాలను అందుకున్నాయి. బ్రహ్మోత్సవం మాత్రం అనుకున్న రిజల్ట్‌ను ఇవ్వలేకపోయింది.
తెలుగులో రెండు సినిమాలు…
‘యూ టర్న్’ రీమేక్ సినిమాలో నటిస్తున్నాను. పవన్ అనే దర్శకుడు ఆ సినిమాకు పనిచేస్తున్నాడు. తమిళ, తెలుగు భాషలలో సినిమా రిలీజవుతుంది. తెలుగులో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్నాను. దీని తర్వాత ఇప్పటివరకు తెలుగులో మరే సినిమాకు సైన్ చేయలేదు.