Wednesday, April 24, 2024

తుపాకుల గూడెం బ్యారేజికి ‘సమ్మక్క’ పేరుగా నామకరణం

- Advertisement -
- Advertisement -

tupakula gudem barrage

 

హైదరాబాద్ : గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకుల గూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత “సమ్మక్క” పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు తుపాకులగూడెం బ్యారేజీకి “సమ్మక్క బ్యారేజీ” గా నామకరణం చేస్తూ సంబంధిత జీవోను జారీ చేయాలని ఇఎన్‌సి మురళీధర్ రావును సిఎం ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణా, కటాక్షాలు బలంగా వుండడం చేతనే తెలంగాణలో అభివృద్ది అనుకున్న రీతిలో సాగుతున్నదని సిఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యి తెలంగాణ బీల్లల్లోకి కాళేశ్వరం సాగునీల్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సిఎం గుర్తు చేశారు.

కాగా గురువారం సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నదన్నారు. ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారాయని తెలిపారు. రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం మరింతగా పెరుగుతుందన్నారు. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అటునుంచి నీటిని కాలువలకు మల్లించే దిశగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగా పనుల విభజన చేసుకోవాలని సిఎం తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గుంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రైతుసమన్వయ సమితి అధ్యక్షులు ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఒ కార్యదర్శి స్మితా సబర్వాల్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి శాఖ ఇఎన్‌సి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Sammakka name to tupakula gudem barrage
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News