Friday, April 19, 2024

సంపాదకీయం: యుపిలో నేర సమ్రాట్టులు!

- Advertisement -
- Advertisement -

Sampadakiyam:8 UP Cops Killed by gangster Vikas dubey

వెయ్యికి పైగా బూటకపు ఎన్‌కౌంటర్లలో వంద మందిని వధించి నాలుగు వందల మందిని గాయపర్చి నేర సామ్రాజ్యాలను గడగడలాడిస్తున్నాడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఖ్యాతి గాలి తీసేసి, ఎగతాళి చేసిన దారుణ ఘటన గత శుక్రవారం నాడు సంభవించింది. కాన్పూర్ జిల్లా దిక్రూ గ్రామంలో వికాస్ దూబే అనే గండరగండడు వంటి హంతక ముఠా నాయకుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసు బృందంలో ఒక డిఎస్‌పి సహా ఎనిమిది మందిని అతడి అనుచరులు మాటు వేసి బలి తీసుకున్న ఉదంతం యోగి ప్రభుత్వ వీర రక్షక భటుల పరువు తీసేసింది. కేవలం పోలీసు బలగాల ఆయుధ బలంతోనే శాంతి భద్రతల స్థాపన సాధ్యం కాదనే సంగతిని చాటి చెప్పింది. యుపి పోలీసులు ఇంత కాలం సాగించిన ‘ఎదురు కాల్పుల’ పరంపర అంతా సమాజ దుష్టాంగ ఛేదనలో రవ్వంతైనా విజయం సాధించలేదని, నెత్తురు తాగే నేర సమ్రాట్టులను వదిలిపెట్టి, చోటా మోటా చిల్లర గ్యాంగుల మీదనే ప్రతాపం చూపిందని రుజువైపోయింది.

వికాస్ దూబే ఘోర నేరాల జాబితాలో 2002లో నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రిత్వంలోని అప్పటి బిజెపి ప్రభుత్వ సహాయ మంత్రి సంతోష్ శుక్లాను హతమార్చిన దారుణోదంతం కూడా ఉన్నది. ఆ దాడిలో ఇద్దరు పోలీసులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో మంత్రి కారు డ్రైవర్ సహా ప్రత్యక్ష సాక్షులందరూ దూబేకు భయపడి వాస్తవం చెప్పకపోడంతో అతడు స్వేచ్ఛగా విడుదలై ఎదురులేని రాజ్యాన్ని కొనసాగించాడు. దినేశ్ దూబే అనే ఒక వ్యాపారిని, తారాచంద్ అనే ఒక కాలేజీ అసిస్టెంట్ మేనేజర్‌ను కూడా వికాస్ దూబే హతమార్చాడు. ఇతనిపై హత్య, కిడ్నాప్ వంటి నేరాలకు సంబంధించి 60 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. ఆ ఊరులోనే కాదు, ఆ జిల్లాలోనే మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్నాడు. అతడికి భీతిల్లిపోయి ప్రజలు అతడి భార్యను జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. బిజెపి, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీలు పాలనలో ఉండగా వాటి ముఖ్య నేతలతో సంబంధాలు పెట్టుకొని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లనే చెప్పు చేతల్లో ఉంచుకొని తన ఇష్టా రాజ్యాన్ని నడిపించుకున్నాడు. పోలీసులే ఇతడిని ‘డేర్ డెవిల్’ అని చెప్పుకునేవారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొన్నటి ఘాతుక ఘటనలో తనను అరెస్టు చేయడానికి భారీ పోలీసు బృందం రానున్నదని పోలీసులే ఉప్పందించగా దారికి అడ్డంగా జెసిబిని ఉంచి వారు దానిని తొలగించే పనిలో ఉండగా తన అనుచరుల చేత పై నుంచి వారిపై బుల్లెట్ల వర్షం కురిపింపజేశాడు. ఈ దారుణం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులు ఇతడి ఆచూకీని తెలుసుకోలేకపోయారు. వికాస్ దూబేతో లాలూచీ పడ్డారని భావిస్తున్న నలుగురు పోలీసులను ఇప్పటి వరకు సస్పెండ్ చేశారు. కొమ్ములు తిరిగిన నేరగాళ్లకు, పోలీసు అధికారులకు మధ్య లాలూచీ ఉదంతాలు దేశంలో కోకొల్లలు.

మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఇష్టా విలాసం సాగించిన పేరు మోసిన భూకబ్జాదారు నయీమ్‌కు, పోలీసు బాసులకు సంబంధాలున్నాయన్న విషయం అతని ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన దర్యాప్తులో బయటపడిన సంగతి తెలిసిందే. అవలీలగా లాకప్ చిత్రహింసలకు, హత్యలకు పాల్పడుతున్న తమిళనాడు పోలీసులకు పాలక రాజకీయ పార్టీల అండదండలు దండిగా ఉంటాయనే విమర్శ విదితమే. దేశమంతటా చట్టం పోలీసులకిచ్చిన అధికారాలు, ఆయుధాలు ప్రజలకు ఉపయోగపడకుండా పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నాయని ఆ బలంతో వారు ప్రజా కంటకులకు గొడుగు పడుతున్నారని చిరకాలంగా అనుకుంటున్నదే. రాజకీయ నాయకత్వం పోలీసులు నేర రారాజుల మధ్య విడదీయలేనంతగా బిగుసుకున్న బంధాన్ని ఛేదించడం ఎప్పటికైనా సాధ్యమేనా అనే సందేహం రోజురోజుకీ దృఢతరమవుతున్నది. కంచెలే చేను మేస్తున్న చోట ప్రజాస్వామ్య పైరు మాడి మసికావడం కళ్లార చూస్తున్న కఠోర సత్యమే. రాజ్యాంగ ధర్మానికి, శాసన నియమాలకు విరుద్ధంగా బూటకపు ఎన్‌కౌంటర్ల బుల్‌డోజర్‌ను నడిపించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం తన హూంకరింపులన్నీ వికాస్ దూబే వంటి అగ్ర సామాజిక వర్గానికి చెందిన కరడుగట్టిన నేరగాడి ముందు పిల్లి కూతలుగానే నిరూపించుకున్న చేదు సత్యాన్ని ఇకనైనా గ్రహించి ప్రజాస్వామ్య చట్టబద్ధ పాలన ద్వారా ముష్కర మూకల నిర్మూలనకు కంకణం కట్టాలి. వారి బందీలుగా ఉన్న సాధారణ ప్రజల్లో భయాన్ని పోగొట్టాలి. లేని పక్షంలో గద్దలను వదిలి కాకులను కాల్చి చంపిన నవ్వుల పాలు నిర్వాకంలో సాటిలేనిదిగా యోగి ఆదిత్య నాథ్ పాలన చరిత్రలో నిలిచిపోతుంది. అయ్య వారిని చేయబోయి కోతిని సృష్టించిన ఘనతకు చిరునామాగా మిగిలిపోతుంది. దేశ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను ప్రజాస్వామ్య రాజ్యాంగ బద్ధం గావించడానికి సుప్రీంకోర్టు దీక్ష వహించాలి.

Sampadakiyam:8 UP Cops Killed by gangster Vikas dubey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News