Home తాజా వార్తలు గంగమ్మ తల్లిని వదలని ఇసుకాసురులు…

గంగమ్మ తల్లిని వదలని ఇసుకాసురులు…

 Ganga Bhavani temple

 

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుక త్రవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇసుకాసురుల అంతులేని దురాశ ఫలితంగా సిరిసిల్ల పట్టణాన్ని ఆనుకుని పారుతున్న మానేరు నది ఎడారిని తలపించేలా మారిపోయింది. సిరిసిల్ల పట్టణం నుండి ప్రతిరోజు వేలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు అంతర్గతంగా అండదండలందించడం వల్లే ఇది సాధ్యపడుతోందనేది వాస్తవం. సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ఎస్‌పి నివాస కార్యాలయం ప్రక్కనే ఉన్న గంగా భవాని ఆలయ ప్రాంతమంతా కూడా ఇసుక త్రవ్వకాలవల్ల సుమారు మూడు మీటర్ల లోతు గొయ్యిలు ఏర్పడుతున్నాయి. సిరిసిల్ల తహసిల్దార్ గంగాభవాని అలయ ప్రాంతంలో ఆరు వందల మీటర్ల దూరం వరకు ఇసుక త్రవ్వకూడదని హెచ్చరిక బోర్డులు పాతించినా ఇసుకాసురులు తమ పనిని యధేచ్ఛగా సాగిస్తున్నారు.

సిరిసిల్ల మానేరు నది నుండి ఇసుకను తెల్లవారు జామున మూడు గంటలనుండే అక్రమంగా వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్నా మామూళ్ల మత్తులో ఉండే అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. నగరంలో అక్రమాలను గుర్తించేందుకు ఊరంతా ఆర్భాటంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా అర్ధరాత్రుల్లు కూడా రవాణా చేస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డవుతున్నా అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు కోటి రూపాయల ప్రశ్నగా మిగిలిపోయింది. సిరిసిల్లనుండి గతంలో అక్రమంగా హైదరాబాద్‌కు వందలాది లారీల్లో ఇసుకను తరలించారు. ప్రజలు ఆ సందర్భంగా గగ్గోలు పెడితే ఆందోళలనలు చేస్తే పట్టణంలో ప్రజలకు కూడా అధికారులు ఇసుక లభించకుండా చక్రబంధం వేసి ప్రజలను తీవ్ర ఇబ్బంధులకు గురి చేశారు.

సిరిసిల్ల ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారక రామారావు జోక్యంతో స్థానికులకు అధికారులు పర్మిట్లు అందిస్తే దాని ప్రకారం ఇసుకను తోడుకునే అవకాశం కల్పించారు. అయితే సూర్యోదయం తరువాతే ట్రాక్టర్లు మానేరు నదిలోకి దిగాలనే నిబంధనను విధించారు. ఉదయం మాత్రమే ఇసుక తరలించాలని కూడా సూచించారు. అయితే ఇసుకా సురులు మాత్రం అర్ధరాత్రి నుండే ఇసుక తరలింపు చేస్తున్నా అధికారులు తమ చేతులు తడిగా మారడంతో చూసికూడా పట్టించుకోవడం లేదనేది వాస్తవం.

సిసి కెమెరా పుటేజీలను ఉన్నతాధికారులు శ్రధ్ధతో పరిశీలిస్తే ఇసుక అక్రమరవాణా దృశ్యాలు కనిపిస్తాయి. అంతెందుకు జిల్లా ఎస్‌పి కార్యాలయం, నివాసాలకు, సిరిసిల్ల పోలీస్ కార్యాలయాల సమీపంలోనే సుమారు 200 మీటర్ల దూరంలోనే గంగా భవాని ఆలయం ఉంది. అక్కడి నుండి ప్రతిరోజు వందల ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. అందులో కొన్ని అధికారికంగా అనుమతులు పొందితే మరికొన్ని అక్రమంగా అనుమతులు లేకుండా రవాణా అవుతున్న విషయాలు కొంచెం శ్రధ్దవహించినట్టయితే అధికారులు గమనించే అవకాశాలున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి ఇసుక అక్రమ రవాణా విషయాలు పోకుండా క్రింది స్థాయి అధికారులు మేనేజ్ చేస్తుండటం వల్ల ఇసుకాసురుల ఆటలు సాగుతున్నాయనడంలో సందేహం లేదు.

జిల్లా కలెక్టర్, జేసి, డిఆర్‌ఓ, ఆర్‌డిఓ, ఎస్‌పి, డిఎస్‌పి, మైనింగ్ విభాగంలోని ఉన్నత స్థాయి అధికారులు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదాలు మోపడానికి అనేక సూచనలు చేస్తున్నా క్రింది స్థాయి అధికారులు చేతులు తడిపే ఇసుక రవాణాను అడ్డుకుంటే తమ ఇతర అవసరాలు తీరే మార్గం లేదని ఇసుకాసురులకు ఎర్రతివాచి పరుస్తున్నారు. ఇసుక అక్రమరవాణా దారులు అధికారులకు తక్కువ మొత్తంలో తాయిలాలు అందిస్తూ ప్రజల నుండి, ఇసుక దందాలు చేసే దళారుల నుండి మాత్రం పెద్ద మొత్తంలో వసూల్లు చేస్తున్నారు.

ఇసుక అక్రమ రవాణా వల్ల మానేరు జీవనది కాస్తా ఎండిపోయి, భూగర్భజలాలు ఐదారువందల అడుగులకు పోవడంతో సిరిసిల్ల ప్రాంతంలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యావరణ శాస్త్రవేత్తలు గతంలో సిరిసిల్లను సందర్శించి మానేరు నదిలో ఇసుక అక్రమరవాణాను అరికట్టక పోతే త్వరలోనే సిరిసిల్ల ప్రాంతం పంటలు పండక, ఎడారిలా మారటం ఖాయమని హెచ్చరించారు. అయితే అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు ఇసుక స్మగ్లర్లు అధికారుల్లోని కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమంగా ఇసుకను తరలించడం మాత్రం ఆపలేదు. దీని పర్యవసానంగా చివరకు గంగా భవాని ఆలయం వరకు ఇసుక త్రవ్వకాలు వచ్చాయి.

ప్రతి ఏటా గంగా భవాని జాతర సిరిసిల్లలో కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తుండటం ఆనవాయితి. జాతరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు కూడా హజరై గంగాభవాని ఆశీస్సులు అందుకున్నారు. అలాంటి గంగా భవాని ఆలయ పరిసరాలని కూడా ఇసుకాసురుల దుర్మార్గపు ఆలోచనలు చుట్టుముట్టి ఆలయ ప్రాంగణప్రాంతంలో కూడా ఇసుక తరలింపులు నిర్విఘ్నంగా కొనసాగించడం వెనుక ఉన్న బంగారు హస్తాలు ఏవో జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Sand mining in the Ganga Bhavani temple area