Home తాజా వార్తలు ఇసుక మేత….

ఇసుక మేత….

Sand trafficking

 

అర్ధరాత్రి తోలకాలు
ఇసుక లేకపోయినా పట్టణంలో వెలుస్తున్న భవనాలు..
కొందరు ట్రాక్టర్ యజమానుల సిండికేటు
కోట్లలో ప్రభుత్వానికి నష్టం..

భద్రాచలం : భద్రాచలం పట్టణంలో ఇసుక అక్రమ వ్యాపారం యదేశ్ఛగా నడుస్తుంది. దొరికినంత ఇసుక మేసేస్తున్నారు. అధికారికంగా ఇసుక తోలకానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వక పోయినా దొడ్డి దారిన ఇసుకను దోచుకుంటూ.. అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తూ కొందరు కోట్లు గడిస్తున్నారు. రూ. వెయ్యి ఉండవలసిన ఇసుక రూ. 3 నుంచి 4 వేల రూపాయలకు అమ్ముతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకొని కేసులు పెట్టినా.. వీరు లెక్క చేయకుడం లేదు.

తిరిగి తోలకాలు కొనసాగిస్తున్నారు. ఎండాకాలం ఇసుక త్రవ్వకాలను ముమ్మరంగా కొనసాగించిన ఈ అక్రమార్కులు, వర్షాకాలం ముందు జాగ్రత్తగా ఇసుకను నిల్వ చేసుకుంటున్నారు. ప్రజల అవసరాలను వీరు ముందుగానే పసిగట్టి.. డిమాండ్ పెంచి, రెట్టింపు ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇసుక డంప్‌లను తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి తోలకాలు కొనసాగించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.

అధికారికంగా ఇసుక లభ్యం కాకపోయినా..
భద్రాచలం పట్టణంలో అధికారికంగా ఇసుక తోలకాలకు అనుమతులు లేక పోయినా భవన నిర్మాణాలు మాత్రం ఆగటం లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పట్టణంలో ఇసుక అక్రమ రవాణా జరగడం లేదని అధికారులు చెబుతున్నా.. పదుల సంఖ్యలో బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇన్ని కట్టడాలు వెలుస్తున్నా ఇసుక విషయంపై అధికారులు ఆరా తీయకపోవడం విశేషం.

సిండికేటుగా ఏర్పడి…
భద్రాచలంలో కొందరు ట్రాక్టర్ యజమానులు సిండికేటుగా ఏర్పడి, ఇసుక అక్రమ తోలకాలు కొనసాగిస్తున్నట్లు ప్రజల్లో చర్చ నడుస్తుంది. అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వీరు, ఎవరైనాఅడ్డొస్తే దాడులకు సైతం తెగబడుతున్నారు. వీరికి కొందు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఇసుక సిండికేట్ పై రెవిన్యూ, పోలీస్ శాఖలు దృష్టి పెడితేనే.. పరిస్థితి అదుపులోకి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. రాత్రిపూట గట్టి నిఘా పెట్టవలసిన అవసరం ఉందని, పట్టుకున్న ట్రాక్టర్లకు భారీ జరిమానాలు విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రభుత్వానికి భారీ నష్టం..
గతంలో ప్రభుత్వానికి భద్రాచలం ఇసుక ర్యాంప్ ద్వారా కోట్ల రూపాయలు లాభం సమకూరేది. అయితే ఇటీవల కాలంలో అనుమతులు లేక ఇసుక ర్యాంప్ మూసివేయడం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రభుత్వానికి చెందవలసిన కోట్ల రూపాలయ ధనం, వారి సొంతమవుతోంది. వెంటనే ఈ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయక పోతే ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడటమే కాక, పర్యావరణానికి కూడా నష్ట వాటిల్లుతుందని ఉందని ప్రజలు బావిస్తున్నారు.

Sand trafficking in Bhadrachalam