Home తాజా వార్తలు పోషణ్ అభియాన్‌లో సంగారెడ్డికి జాతీయ అవార్డు

పోషణ్ అభియాన్‌లో సంగారెడ్డికి జాతీయ అవార్డు

Poshan-Award

మన తెలంగాణ/ సంగారెడ్డి ప్రతినిధి : పోషన్ అభియాన్ క్రింద 2018 19 సంవత్సరానికి సంగారెడ్డి జిల్లా జాతీ య స్థాయిలో ఉత్తమ జిల్లాగా ఎంపికవడంతో జిల్లా కలెక్టర్ హన్మంతరావు అవార్డు అందుకున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలోని 149 ప్రాజెక్టులు ఈ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపాయి. అందులో సంగారెడ్డి జిల్లాను జాతీయ స్థాయి అవార్డు కోసం కమిటీ ఎంపిక చేసింది. ఫలితంగా సంగారెడ్డి జిల్లా ఉత్తమ జిల్లా గా ఎంపికైంది. మహిళా, శిశు సంక్షేమం, డిఆర్‌డివో, డిపివో, వైద్యారోగ్యశాఖ సంబంధిత శాఖల సమన్వయంతో పోషన్ అభియాన్ అవార్డు దక్కింది. ఫలితంగా శుక్రవారం ఢిల్లీలో అవార్డును స్వీకరించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, శ్రీమతి దేబాశ్రీ చౌదరిల నుంచి ఈ మేరకు అవార్డును స్వీకరించారు. పోషన్ అభియాన్ కార్యక్రమాలు జిల్లాలో గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను వినూత్న పద్దతిలో జిల్లా వ్యాప్తంగా అమలుచేశారు. పోషకాహార లోపా న్ని తరిమికొట్టేందుకు క్షేత్రస్థాయిలో వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చారు. తద్వారా పోషణలోపం లేని సమాజ నిర్మాణం కోసం జిల్లాలో పోషణపై చైతన్యం తీసుకువచ్చారు.
అందరి కృషి సహకారంతో జాతీయ స్థాయిలో జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికైందని, అందుకు అందరిని అభినందిస్తున్నట్లు కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖాధికారి మోతి, డిపివో వెంకటేశ్వర్లు, డిఆర్‌డివో శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రాథోడ్, జిల్లా ఇమ్యూనినైజేషన్ డా. గాయత్రి దేవిలు కూడా అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో సంగారెడ్డి జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికైనందుకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను, ఇతర అధికారులను అభినందించారు.

Sangareddy district receives Poshan Abhiyan Award