Home తాజా వార్తలు పరిశుభ్ర సిరిసిల్ల

పరిశుభ్ర సిరిసిల్ల

Sanitation

 

వ్యర్థాల తొలగింపు ప్రణాళికలు

మొత్తం 90వేల గృహాలకు ఇంకుడు గుంతలు
మండలం యూనిట్‌గా, గ్రామ, వార్డు స్థాయిల్లో యాక్షన్ ప్లాన్
ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు

హైదరాబాద్ : పరిశుభ్ర సిరిసిల్లా లక్ష్యంగా పారిశుద్ద్య ప్రణాళికలు ఉండాలని రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ జిల్లా యంత్రాగాన్ని ఆదేశించారు. 30 రోజుల గ్రామ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. గ్రామ పారిశుద్ధ ప్రణాళికలో భాగంగా రూపొందించిన కార్యక్రమాల అమలుపైన ప్రత్యేక శ్రద్ద వహించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే జిల్లా బహిరంగ మల విసర్జిత రహిత హోదాను(ఒడియఫ్) సాధించామని, ఇదే స్పూర్తితో పారిశుద్ధ్య ప్రణాళికను కూడా విజయవంతం చేద్దామన్నారు. లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ (ద్రవ, ఘన వ్యర్ధాల నిర్వహాణ) ప్రాధాన్యతగా తీసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి అదేశాలు జారీ చేశారు.

శనివారం సిరిసిల్లా నియోజకవర్గం అభివృద్ధిపై హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ ఉన్నతస్దాయి సమీక్ష సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్లా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించారు. వివిధ శాఖల అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9 పనులపైన కూడా మంత్రి సమీక్షించారు. జిల్లాలో ఇంకుడు గుంతల ( సోక్ పిట్స్) నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపాదికన చేపట్టాలన్నారు. ఇందుకోసం జిల్లాలో ఉన్న సూమారు 90 వేల గృహాలకు ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా యంపిడివోలు, గ్రామాలు, వార్డుల వారీగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు.

గ్రామ పారిశుద్ద్య కమిటీల ఆధ్వర్యంలో సంతృప్త స్ధాయిలో (సాచ్యురేషన్) ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లాను యూనిట్లుగా మార్చుకుని, ముందుకు గ్రామస్ధాయిలో సర్వే నిర్వహించాలన్నారు. ఈ సర్వే ద్వారా నిర్మించాల్సిన వ్యక్తిగత, కమ్యూనిటీ, కామన్ ఇంకుడు గుంతల సంఖ్యను నిర్ధారించుకుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామపంచాయితీలు, పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. వీటి నిర్మాణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహాకారం పెంచేలా వారిని చైతన్యం చేయాలన్నారు.

జిల్లాలో ఇప్పటికే 9500 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయిందని మంత్రి కెటిఆర్‌కు అధికారులు వివరించారు. నాగంపేట, చెక్కపల్లి లాంటి పలు గ్రామాల్లో వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో, అక్కడి అనుభవాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇంకుడు గుంతల నిర్వహాణలో ఎదురవుతున్న అనుభవాలను పరిశీలించాలని కెటిఆర్ సూచించారు. జాతీయ గ్రామీణాభివృద్ది సంస్ధతో సంప్రదించి ఇంకుడుగుంతల నిర్మాణం, నిర్వహాణకు సంబంధించి గ్రామీణాభివృద్ది శాఖ తాజా మార్గదర్శకాలు ఇవ్వాలని పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ రఘనందన్ రావును మంత్రి కెటిఆర్ కోరారు. దీంతోపాటు జాతీయ ఉపాధిహమీ పథకం కింద చేపట్టాల్సిన పాఠశాల కిచెన్ షెడ్డుల నిర్మాణం, హరిత హారం వంటి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని కమీషనర్ ను కోరారు. పారిశుద్ద్య నిర్వహాణలో భాగంగా వందశాతం వైకుంఠధామాలు (శ్మశనాలు) నిర్మాణం, గ్రామాల్లో చెత్త సేకరణ, డంప్ యార్డులు, కంపోస్టింగ్ ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు.

నీటి పారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో పనుల పురోగతి వివరాలు తెలుసుకున్న మంత్రి, పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అదేశించారు. పాఠశాలలకు అవసరం అయిన వివిధ కార్యక్రమాలపైన విద్యాశాఖాధికారులు మంత్రికి వివరాలు అందించారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అద్వర్యంలో చేపట్టిన రోడ్లు, వంతెనలు, గోడౌన్లు, కమ్యూనిటీ భవనాల పురోగతిని సైతం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్టభాస్కర్ తోపాటు పంచాయితీరాజ్ కమీషనర్ రఘనందన్ రావు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Sanitation plans targeted at Pure Circilla