Home తాజా వార్తలు శానిటైజేషన్ మనసుకి అవసరం

శానిటైజేషన్ మనసుకి అవసరం

Sanitization

వెండి దారాలను సాగదీస్తున్నట్లు వాన జల్లు భూమికి చేరుతుంది. సర్వ ప్రకృతి నిశ్శబ్దంగా వర్షాన్ని ఆస్వాదిస్తుంది. ఆకు చివర నుంచి నీటి ముత్యాలు జారుతుంటాయి. దుమ్ము ధూళి మాయమై పచ్చని చెట్లు కళకళలాడుతుంటాయి. అంతా పరిశుభ్రంగా… స్వచ్ఛంగా ఇవాళ మనం అలా వున్నాం. కరోనా భయంతో లాక్‌డౌన్‌లో సామాజిక దూరం పాటించడం, రెండు గంటలకోసారి చేతులు శుభ్రం చేసుకోవడం, ప్రతి వస్తువూ కడిగి ఎండలో వుంచి ఆరోగ్య నిబంధనలతో ఆహారం తీసుకోవడం ఇవన్నీ జీవితంలో అనివార్యం అయ్యాయి. ఈ శానిటైజ్ చేసుకోవడం అనేది కేవలం చేతులకు శరీరం వరకే కాకుండా మానసికంగా కూడా శుభ్రపడండి అంటున్నారు నిపుణులు.

ఏదైనా ఒక అంశాన్ని ఇరవై ఒక్క రోజులు పాటిస్తే అది జీవితమంతా అలవాటుగా మారిపోతుంది. సాంప్రదాయికంగా వాడుకలో ఉన్న యోగ, వ్యాయామం, వాకింగ్ ఏదైనా 21 రోజులు నేర్చుకుంటాం ఆ అలవాటు జీవితాంతం కొనసాగుతుంది అంటున్నారు నిపుణులు. చిన్నచిన్న అలవాట్లు ఆచరిస్తే అవి జీవితాంతం కొనసాగుతాయి. మనలో కూడా ఎన్నో ప్రతికూల భావోద్వేగాలున్నాయి. వాటి వల్లనే భయం అపరాధభావం కలుగుతూ ఉంటాయి. ఒక్క వైరస్ భయంతో మొత్తం జీవన విధానాన్ని ఎలా మార్చుకోగలిగామో అలాగే కొన్ని వ్యతిరేక భావాలను వదిలించుకోవడం కాస్త శ్రమతో సాధ్యమౌతాయి. ఓకే ఒక్క ప్రశ్న వేసుకోవచ్చు ఈ భావనలో భావోద్వేగాల ప్రయోజనం ఏమిటి నా అభివృద్ధి పరిణామానికి ఏమైనా పనికొస్తాయా? ఇప్పుడు వీటిని వదిలివేయడం వల్ల నాకు నేను పొందగలిగేది ఏమిటి అనుకుంటే వచ్చే సమాధానం ఒక సముద్రపు పోటులాగా ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని విషయాలు దృష్టిలోకి తీసుకుం ఈప్రతికూలభావనల వల్లే ఎన్నో మానవ సంబంధాలు పోగుట్టుకున్నామని మనకే తేలిపోతుంది.

జాతి, మతం, డబ్బు, రూపం మొదలైనవాటిపై విపరీతమైన వ్యామోహం.
ఆత్మగౌరవం, ఎదుటివారి పట్ల గౌరవం రెండూ లేకపోవడం
ఉపయోగంలేని ఫిర్యాదుల చిట్టా ఒకటి మనస్సులో చెరపలేకుండా వుండటం
పాత సంఘటనలు పదే పదే గుర్తుచేసుకుంటూ ఎదుటివారి పట్ల కోపం తగ్గకుండా చూసుకోవడం
మనకు అవసరం లేని సమాచార సేకరణ వార్తల రూపంలో, వినోదం రూపంలో పోగుచేసుకోవడం.
ఇతరులపై కళంకాన్ని ఆపాదించి వినోదించడం, బూతును వినోదంగా చూపించడం. ఎలాంటి సిగ్గు, వెరపు, ఆధారంలేని విషయాలు ప్రచారం చేయడం
ఇతరులు చేసే పనిపై అదే పనిగా దృష్టి పెట్టడం.
పూర్తి సమాచారం లేకుండా వదంతులు వ్యాపించేందుకు పూనుకోవడం
సహనం లేకుండా ఉండటం
శీఘ్రమైన కోపావేశాలు
ఇతరుల వైపు నుంచి నిముషం కూడా ఆలోచించకుండా ఉండటం
మానవ సంబంధాల విషయంలో కనీస గౌరవం లేకుండా వుండటం..

ఇలాంటివన్నీ చాలామంది ఏమాత్రం సంకోచం లేకుండా చేసే పనులు. విశ్వంలో మానవ జాతికి ఒక ప్రత్యేక పరిణామక్రమం ఉంది. భయం , అపరాధభావన కలిగితే చాలు మనుషులు రూపాంతరం చెంది తీరతారు. మనలో ఉండే లోపాలు తెలుసుకుని వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయడం ప్రేమను పంచడం చాలు కొత్త జన్మ ఎత్తేందుకు. ఆత్మ సాక్షిని నమ్ముకుని వదిలేయదలుచుకున్న చెడ్డ గుణాలను ప్రవాహ వేగంతో మనలోంచి బయటికి పోనివ్వగలగాలి. ఇవి చాలా తేలిక. ఒక నిశ్చయం తర్వాత దాన్ని అమలుచేయడం సులభం.

ఒక్కసారి మనస్సు ప్రక్షాళన ప్రారంభం అయితే అది జీవితాన్ని తేజోవంతం చేస్తుంది. ఒక వైరస్ భయంతో శానిటైజేషన్ తప్పనిసరి అలవాటుగా మార్చుకున్నట్లు మనస్సుని ప్రక్షాళన చేసుకోవచ్చు. పరిశుభ్రమైన గాలి, వాతావరణం ఆరోగ్యాన్ని శాంతిని ఇచ్చినట్లు స్వచ్ఛమైన స్ఫటికం వంటి మనస్సు కూడా శాంతికి నిలయం అయిపోతుంది. జీవితంలో ఒత్తిడి, ఆందోళన, భయం విచారం కోపం అన్నీ మాయమౌతాయి. వర్షం భూమిని ప్రకృతిని ముంచెత్తి దుమ్ము ధూళి మురికిని లవలేశం కూడా లేకుండా కడిగేసినట్లు మన మనస్సు కూడా స్వచ్ఛంగా తేరుకున్న నీళ్లలాగా తేటగా ఉంటుంది. అందులో మనం మన ప్రతిబింబాన్ని చూసుకోవచ్చు.

Sanitization is essential to mind

సుజాత. సి