Home తాజా వార్తలు టీమిండియా బాగానే ఆడింది: మంజ్రేకర్

టీమిండియా బాగానే ఆడింది: మంజ్రేకర్

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన బాగానే ఉందని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్‌లో కోహ్లి సేన ఆట ఏమాత్రం బాగాలేదని మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై మంజ్రేకర్ ఈ విధంగా స్పందించాడు. ప్రపంచకప్‌లో పాల్గొన్న జట్లతో పోల్చితే టీమిండియా బాగానే ఆడిందన్నాడు. 9 మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో విజయం సాధించిందన్నాడు. కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లను అలవోకగా ఓడించిందన్నాడు. ఇలాంటి ప్రదర్శన నేపథ్యంలో విమర్శలు చేయడం మంచిది కాదన్నాడు. ఇంగ్లండ్‌లో భారత్ తన స్థాయికి తగ్గ ఆటనే కనబరిచిందన్నాడు. సెమీఫైనల్లో కూడా చివరి వరకు విజయం కోసం పోరాడిందన్నాడు. గతంతో పోల్చితే ఈసారి టీమిండియా ప్రదర్శన తనకు సంతృప్తి కలిగించిందన్నాడు.

గతంలో పెద్ద జట్లతో మ్యాచ్‌లు అంటేనే భారత్ ముందే ఓటమి అంగీకరించేదన్నాడు. కానీ, ఇటీవల కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నాడు. ఎంతటి పెద్ద జట్టునైనా అలవోకగా ఓడించే సత్తా భారత్‌కు ఉందన్నాడు. మరోవైపు మూడు ఫార్మాట్‌లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని ఎంపిక చేయడాన్ని కూడా మంజ్రేకర్ సమర్థించాడు. కోహ్లి అన్ని ఫార్మాట్‌లలో కూడా మెరుగైన కెప్టెన్ అనే విషయాన్ని మరువ కూడదన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లి ఎంతో సమర్థుడని ప్రశంసించాడు. అంతేగాక గవాస్కర్ సెలెక్టర్లపై చేసిన విమర్శలను కూడా మంజ్రేకర్ తప్పుపట్టాడు. ప్రపంచకప్ కోసం మంచి జట్టునే సెలెక్టర్లు ఎంపిక చేశారన్నాడు. అంతేగాక వెస్టిండీస్ పర్యటన కోసం సీనియర్లు, జూనియర్లకు అవకాశం కల్పించారన్నాడు. వెస్టిండీస్ సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగుర వేస్తుందనే నమ్మకాన్ని మంజ్రేకర్ వ్యక్తం చేశాడు.

Sanjay Manjrekar disagrees with Gavaskar words on kohli