Home జాతీయ వార్తలు ఇందిరపై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న రౌత్

ఇందిరపై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న రౌత్

Sanjay Raut

 

ముంబయి: ఒకప్పటి ముంబయి డాన్ కరీంలాలాను కలిసేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దక్షిణ ముంబయికి తరచూ వచ్చే వారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేయడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ‘నా ప్రకటన ఇందిరాగాంధీ ప్రతిష్ఠను లేదా తమ మనోభావాలనైనా దెబ్బతీస్తుందని ఎవరైనా భావిస్తున్నట్లయితే నా ప్రకటనను ఉపసంహరించకుంటున్నాను’ అని రౌత్ గురువారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ కరీం లాలా పఠాన్ నేత . ఫక్త్తూన్‌ఇ హింద్ అనే సంస్థకు నాయకత్వం వహించే వారు. ఆయన తనకున్న నాయకత్వ పటిమ కారణంగా ఇందిరాగాంధీ సహా అనేక మంది అగ్రనేతలను కలుసుకునే వారు. ముంబయి చరిత్ర తెలియని వారు మాత్రమే నా వ్యాఖ్యలకు వక్ర భాష్యాలు చెబుతున్నారు’ అని రౌత్ ఆ ట్వీట్‌లో అన్నారు.

ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని, అలా చెప్పడానికి తానెప్పుడూ వెనకాడలేదన్నారు. ఇందిరాగాంధీ, పండిట్ నెహ్రూ, రాజీవ్ గాంధీ సహా నెహ్రూల కుటుంబం అంటే తనకెంతో గౌరవమని, ఇందిరాగాంధీని ఎవరు టార్గెట్ చేసినా ఆమెకు వెన్నుదన్నుగా నిలిచే వాడినని రౌత్ అన్నారు. బుధవారం లోక్‌మత్ మీడియా గ్రూపు అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఆ గ్రూపునకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో సంజయ్ రౌత్ కరీంలాలాను కలుసుకునేందుకు ఇందారాగాంధీ తరచూ ముంబయి వెళ్లేవారని చెప్పారు. కాగా ఇందిరాగాంధీపై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ నేతలు సంజయ్ నిరుపమ్, మిలింద్ దేవరలు ఆయనపై నిప్పులు చెరిగారు. ‘ ఆ రచయిత( సంజయ్ రౌత్) తన రచనా చమత్కృతితో మహారాష్ట్ర ప్రజలను సంతోష పెట్టడానికే పరిమితమైతే బాగుంటుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్ఠను దిగజార్చాలని ప్రయత్నిస్తే ఆయన ఆ తర్వాత విచారించాల్సి వస్తుంది. ఇందిరాగాంధీపై వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి’ అని నిరుపమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆది అవకాశవాద కూటమి: జవడేకర్

కాగా, ఇందిరాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను సంజయ్ రౌత్ ఉపసంహరించుకోవడంపై బిజెపి తనదైన శైలిలో స్పందించింది. రాష్ట్రంలోని అధికార శివసేనఎన్‌సిపి కాంగ్రెస్ కూటమిని అవకాశవాద కూటమిగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అభివరిస్తూ, ప్రతి రోజూ ఏదో ఒక వాస్తవం వెలుగులోకి రావడం, ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతోందన్నారు. ముంబయి పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం దేశం వదిలి పారిపోవడానికి కాంగ్రెస్ పార్టీ సాయపడిందన్న విమర్శలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా తరహా అనుభవాలను మనం ఎదురు చూడవచ్చని కూడా ఆయన అన్నారు. అంతేకాదు, అధికారం, అవకాశ వాద రాజకీయాలకోసమే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడాయని కూడా ఆయన అన్నారు. గతంలో శివసేన నేతల బాల్‌థాకరేను ‘హిందూహృదయ సమ్రాట్’గా అభివర్ణించేవారని, అయితే ఇకపై వారు ఆయనను అలా అభివర్ణించలేరని కూడా జవడేకర్ అన్నారు.

Sanjay Raut withdraw comments against Indira Gandhi