Home సూర్యాపేట 2019 ఎన్నికల్లో బిజెపిదే అధికారం: జవదేకర్

2019 ఎన్నికల్లో బిజెపిదే అధికారం: జవదేకర్

Sankineni Said BJP power in the 2019 elections
మనతెలంగాణ/తుంగతుర్తి: గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనా ,ఇతర పార్టీల పాలనలో దేశంలోని రైతులకు ఏనాడూ చేకూరని లబ్దిని నేడు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించి రైతులకు లబ్ది చేకూర్చారని కేంద్ర మానవ వనరుల శాఖా మాత్యులు ప్రకాశ్ జవదేకర్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి నియోజక వర్గ కేంద్రంలో జరిగిన జన చైతన్య యాత్ర మొదటి విడత ముగింపు సమావేశం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే నాటికి దేశంలో ఆరు రాష్ట్రల్లో మాత్రమే బిజెపి సర్కార్ అధికారంలో ఉండగా ,కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి ,నేడు 20 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందని , ఇది ప్రజల ఆశీర్వాదం మోదీ పాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు. మోదీ దెబ్బకు కాంగ్రెస్ కోటలు , కమ్యూనిష్టుల ఎర్రకోటలు బీటలు వారాయని అన్నారు. దశాబ్దాల కాలంగాకేంద్రంలో సాగుతున్నకాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు మోదీ చరమగీతం పాడారని అన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న రోజుల్లో ఢిల్లీ నుండి వంద రూపాయలు గల్లీకి వచ్చేసరికి 15 రూపాయలుగా తగ్గిపోయాయని,అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయిన కాంగ్రెస్ నేతలు ,ప్రజాధనాన్ని ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చే సరికి దిగమింగారని, విమర్శించారు. కాని నేడు నరేంద్ర మోదీ సర్కార్ వంద రూపాయలు పేద వాడికి గ్రామీణ ప్రాంతాలకు పంపితే వంద రూపాయలు అందుతున్నాయని అన్నారు. పేద వారిని ఆదుకోవడం కోపం నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు జమయ్యేలా 31 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్‌లు ఇవ్వడం జరిగిందని అన్నారు. మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు, 20 కోట్ల మంది లబ్ది దారుల ఖాతాలకు నేరుగా అందించిన ఘనత మోదీ సర్కార్‌దేనని అన్నారు. కాంగ్రెస్ హటావో -దేశ్‌కి బచావో నినాదంతో బిజెపి ముందుకు వెళ్తోందని ,అవినీతి , కుంభకోణాల్లో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇక ముందు మనుగడ లేదని అన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో ఏప్రభుత్వం అధికారంలో ఉన్నా రోడ్లు ,విద్యుత్,ఘనులు ,రైలు ,తదితర రంగాల్లో అభివృద్ధి కోసం కావాల్సిన ప్రాజెక్టులు అన్ని తక్షణమే మంజూరి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తమకు సూచించారని జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని రానున్న కాలంలో దేశం నుండి తరిమి వేయాలని ప్రజలను కోరారు .

కాంగ్రెస్ పాలనా కాలంలో రైతుల ఆత్మహత్యలు వేలాదిగా జరిగాయని, రైతుల పై లాఠీలు,తూటాలు పేలాయని, కానీ నేడు నరేంద్ర మోదీ సర్కార్ రైతులకు మేలు చేయాలనే యోచనతో మద్దతు ధర ప్రకటించి రైతును తల ఎత్తుకునేలా చేశారని అన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.200,పత్తికి రూ.1000,మక్కకు .రూ325 పెంచడమే కాకుండా వీటితో పాటు, మరో 11 రకాల ధాన్యాలకు మద్దతు ధర పెంచారని అన్నారు. వరికి ఒక ఎకరాకు 30 క్వింటాళ్ళ ధాన్యం దిగుబడి వచ్చినట్లయితే రూ.6000మద్దతు ధర కేంద్రం అదనంగా ఇచ్చిందని అన్నారు. రైతు సుఖంగా లేకపోతే దేశం సుఖంగా ఉండదని రైతు బాగుంటే రైతు , రైతు కూలీలు గ్రామాలు, దేశం బాగుంటుందని అదే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు కమీషన్ దందాలతో పని చేస్తోందని ,కానీ నేడు కేంద్ర ప్రభుత్వం మిషన్ మాదిరిగా పని చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణాను రాష్ట్ర ప్రభుత్వం సరియైన దిశ,నిర్దేశంతో పాలించడం లేదని ,అభివృద్ధి కుంటు పడిందని అన్నారు. తాను మానవ వనరుల శాఖా మంత్రిగా విద్యుత్ ప్రాజెక్టు అనుమతి కోసం తెచ్చిన టిఆర్‌ఎస్ అనుమతి లేఖను వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి 2000 మెగా వాట్ల పవర్ ప్రాజెక్టు కావాలని కోరారని ,పవర్ ప్రాజెక్టు వెనువెంటనే మంజూరి ఇచ్చామని అన్నారు. ఇంత వరకు ఎవరూ ఇవ్వని అనుమతిని తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో అనుమతి నిచ్చామని అన్నారు. జన చైతన్యయాత్ర చేపట్టిన రాష్ట్ర పార్టీ అధ్యక్షున్ని ప్రకాశ్ జవదేకర్ కొనియాడారు. ఇప్పటి వరకు 26 బహిరంగ సభలు నిర్వహించి ప్రజలకు బిజెపి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియపరుస్తూ ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని అన్నారు. సభ్‌కాసాస్ -సబ్‌కా వికాస్ మోదీ కోరుతున్నారని దీనికి తెలంగాణ ప్రజల మద్దతు కూడా అవసరమని అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని , జవదేకర్ అన్నారు. ఈసమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ఎస్.కృష్ణ దాస్, బిజెఎల్‌పి నేత కిషన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు ,శాసన సభ్యులు రాజ్‌సింగ్, చింతల రాంచంద్రారెడ్డి, ప్రభాకర్, లతో పాటు పలువురు బిజెపి కేంద్ర,రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.