Home యాదాద్రి భువనగిరి పల్లెలకు సంక్రాంతి శోభ

పల్లెలకు సంక్రాంతి శోభ

MUGGULU

మనతెలంగాణ/భువనగిరిటౌన్: పట్టణాలు, పల్లెల్లో సంక్రాంతి పండుగ వాతవరణం సంతరించుకుంటుంది. యువకులు, పిల్లలు పతంగులు కొనుగోలు చేసి ఎగరవేస్తుండగా, యువతులు ముత్యాల ముగ్గుల్లో నిమగ్నమయ్యారు. ముత్యాల ముగ్గులతో ముచ్చటగొలిపే పట్టణాలు, పల్లెసీమలు… ధనుర్మాస వైభోగం…. ఎటుచూసిన కొత్తధనం… అంతటా పండుగ హడావుడి… సందడే సందడి. ఎంతంత దూరం నుంచో తమస్వంత ఊరుచేరుకొని కలుస్తారు. పర్వదినాలలో అతిముఖ్యమైనది సంక్రాంతి. ‘సం’ అనగా మంచి, ‘క్రాంతి’ అనగా మార్పు(పరివర్తనం) అని అర్థం పతంగులు ఎగరవేస్తూ చిన్నారుల, యువకుల కేరింతలు, ఇండ్ల ముంగిట యువతులు వేసే తీరోక్క రంగుల ముగ్గులు, ఇండ్లనిండ దాన్యం రాశులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల ఆటలు….మనకు గుర్తుకొస్తాయి. పండుగలన్నింటిలో సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగుప్రజలు 3 రోజుల పాటు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మొదటిరోజు భోగి, 2వ రోజు మకరసంక్రాంతి, 3వ రోజు కనుమను ప్రజలు కన్నుల పండుగగా జరుపుకుంటారు. ప్రతి ఇళ్లు బందువులతోపాటు, కుటుంబ సభ్యులతో కళకళలాడుతుంటాయి. కొత్త బట్టలు, పసందైన పిండివంటలు చేసుకోవడం సాంప్రదాయం. వారం రోజుల నుంచే గ్రామాలలో గంగిరెద్దులను ఆడిస్తుంటారు. హరిదాసులు తలపై అక్షయపాత్రను ధరించి చేతిలో తంబురపట్టుకొని హరిలోరంగహరి అంటూ సంకీర్తనలు, హరినారాయణుడి నామాన్ని స్మరిస్తూ ఆలపిస్తూంటారు. గ్రామప్రజలు హరిదాసుకు తమకు తోచినంత సహాయం అందజేసి సహకరిస్తారు. ప్రస్తుతం డూడూ బసవన్నల సైయ్యాటలు, హరిదాసుల పాటలు కనుమరుగైయ్యాయి.
మహిళలకు రంగవల్లుల పోటీలు
మనతెలంగాణ / మిర్యాలగూడ : సంక్రాంతి పండుగ ప్రాశస్తాన్ని చాటుతూ పట్టణంలోని వివిధ వార్డులలో గురువారం మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండుగ అని ఆనవాయితీగా వస్తుండటంతో ప్రతియేటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం 14వ వార్డు ఇస్లాంపురం కౌన్సిలర్ ఘనీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విజేతలకు మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి బహుమతులను అందజేసి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రాణించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డబ్బీకార్ మల్లేష్, విజయ్‌కుమార్, నీలామోహన్‌రావు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, బావండ్ల పాండు పాల్గొన్నారు. అదే విధంగా తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం గాంధీనగర్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మన్ తిరునగర్ నాగలక్ష్మీ భార్గవ్ పాల్గొని బహుమతులను అందజేశారు. సంస్కృతి సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తిరునగర్ భార్గవ్, సోముసుందర్, ఆర్యవైశ్య సంఘం నాయకురాలు రాయపూడి భవాని, రమ్య, ఉబ్బపల్లి మధు పాల్గొన్నారు. 33, 34వ వార్డులో కౌన్సిలర్లు ఆలగడపి గిరి, చిలుకూరి సక్కుబాయిల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ నాగలక్ష్మీ, మాజీ శాసన సభ్యులు తిప్పన విజయసింహారెడ్డి, కుర్ర విష్ణు, బత్తిని సోమాదేవి పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 12వ వార్డులో పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో జాగృతి మహిళా నాయకురాలు చాపల జయశ్రీ, కుక్కడపు పద్మ, ఓరుగంటి పద్మ, నాగలక్ష్మీ, అరుణ, సరితలు పాల్గొన్నారు.