Home కలం తెలంగాణపై సంస్కృత ప్రభావం

తెలంగాణపై సంస్కృత ప్రభావం

ts

సంస్కృతం ఆర్యభాషే కావచ్చును. అది ఈ దేశంలోని కొన్ని సామాజిక వర్గాలకు బాగా పరిచితమైన, ఆ వర్గాల్లో చాలా ప్రచలితమైన భాషే అవొచ్చును. అయితేనేం..ఆ భాష దివి నుండి భువికి దిగిరాక తప్పలేదు. అసలు ఏ భాషకైనా నేల మీద కాళ్లూనక తప్పని పరిస్థితి వుంటుంది. పైగా సంస్కృతం పూర్వం అధికార భాషగా ఉన్నప్పుడు అది దేశ భాషల్లోకి చొచ్చుకుపోయింది. ఆ భాషల మీద బాగా ప్రభావం చూపింది. తన ప్రతాపం నెరపింది. తత్కారణంగా సంస్కృత పదాలు తెలుగు భాషలో పాలలో పంచదారలా కలిసిపోయినై. ఇట్లా ఏ భాషలోనికైనా ఇతర భాషల నుండి పదాలు రావడం తప్పదు. ఆదాన ప్రదానాల ద్వారా భాషల మధ్య పరస్పర పద వినిమయం ఉంటుంది. అప్పుడే అవి పరిపుష్టం అవుతాయి. సుసంపన్నంగా మారుతాయి. అయితే ఈ పదాల మార్పిడి ఏకపక్షంగా ఉండకూడదు. పైగా ఒక భాష అస్తిత్వానికి భంగం వాటిల్లని రీతిలో ఈ మార్పులు జరగాలి. తెలుగు నుండి సంస్కృతంలోనికి వెళ్లిన మాటల కన్నా సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి చేరిన పదాలే ఎక్కువ. మరి తెలంగాణ భాషలో ఈ సంస్కృత పదాలు ఎట్లున్నాయి? ఎన్నున్నాయి? బొంబాటుగ వున్నవి, బొచ్చెడున్నయి .. అనే జవాబులే వస్తాయి వెంటనే!
తెలంగాణము అంటే వాస్తవంగా తెలుంగు ఆణెమే! అంటే తెలుగు భాషకు స్థానం. అయినా మన అవసర నిమిత్తమో, అధికార భాషగా సంస్కృతం కొంత కాలం ఉన్న కారణంగానో తెలంగాణ భాషలోకి అనేక సంస్కృత పదాలు వచ్చి చేరినై. పండితుల మాటల్లోనే కాకుండా పల్లె ప్రజల సంభాషణల్లో కూడా ఈ మాటలు సహజంగా చక్కగా దొర్లుతుంటాయి.
తెలుగు భాషలో “వేలి ముద్ర” అనే మాట ఒకటి ఉంది. దీనికి సమానార్థకంగా ‘అంగూట్ ఒత్తుడు” అనే సమాసం వాడుకలో ఉంది. “అంగూట్‌” అంటే ఏమిటి? “అంగుష్ఠం” అనే సంస్కృత పదం నుంచి వచ్చిందది. దీనికి బొటనవేలు అని అర్థం. వేలి ముద్రలో ఏ “వేలు” అనే స్ఫురణ లేదు. కాకపోతే “వేలు” తెలుగు పదం. కాదు కాదు తమిళ పదం. “విరల్‌” అనే పదం వ్రేలు అయ్యి పిదప వేలుగా మారింది. ఇక “ముద్ర” సంస్కృతం. ఆ లెఖ్ఖన వేలి ముద్రా తెలుగు కాదు, అంగూట్ ఒత్తుడూ తెలుగు కాదు. (ఒత్తుడు మాత్రం తెలుగే సుమా:!) ఆంగ్లంలో యిదే థంబ్ ఇంప్రెషన్.
హైదరాబాద్‌లో ఒకప్పుడు రెండు అంత్రాల బస్సులు విరివిగా నడిచేవి. వీటినే ఇంగ్లీషులో డబుల్ డెక్కర్లు అంటున్నారు. “రెండు అంత్రాలు” లోని “అంత్రం” అనే మాటకు పూర్వరూపం “అంతరం”. ఇది సంస్కృతం. “అంతరం” మాటకు ఒక అర్థం “నడిమిచోటు” ఇంకా తెలంగాణలో “వాడు నాలుగు అంత్రాల యిల్లు గట్టిండు”,“వీడు నడుమంత్రపోడు” మొదలైన మాటల్లోని అంత్రమూ ఈ సంస్కృత అంతరమే మరి!
“ఎల్లయ్యకు ఒక్క అచ్చరం ముక్క రాదు”, “పొట్ట చీరినా ఒక్క అచ్చరం లేదు” … ఈ మోస్తరు వాక్యాల్లోని “అచ్చరం” సంస్కృత “అక్షర” జన్యం. జనం ఉచ్చారణాత్వరలో చదువు సంధ్యలు లేకపోవడం చేత కూడా సంయుక్తాక్షరాలను ద్విత్వాలుగా మార్చుకుంటారు. “లక్ష్మి” “లచ్చి” అవుతుంది. రుక్మిణి “రుక్కుంబాయి”గా మారుతుంది. కష్టం కట్టమై పోతుంది. ఇష్టమున్నా లేకపోయినా “ఇష్టం” ఇట్టంగా మారిపోతుంది. ఈ “అక్షరాదుల్ని” యిక్కడికి వదిలేసి “అగరు బత్తులు” వెలిగిద్దాం. ఆ వత్తుల్ని అంటించడం ద్వారా వచ్చే సుగంధాలు అనుభవిద్దాం. అగరు బత్తుల్లోని “అగరు” సంస్కృత “అగరువు” నుండి పుట్టింది. అగరువు అంటే ఒక రకమైన చందనం. ఆ కారణం చేత ముట్టించగా వచ్చేది సుగంధం. వీటినే “ఊదు బత్తులు” అని కూడా పిలుస్తారు. తెలంగాణలో “అగాదం జగన్నాదం” అయిపోయింది అంతా అనే పలుకుబడి ప్రచారంలో ఉంది. దీనికి భావం “అంతా అగమ్యగోచరంగానూ, అయోమయంగానూ వుందని. ఈ పదబంధంలోని “అగాదం” సంస్కృత “అగాథం” నుండీ, “జగన్నాదం” ఆ భాషలోని “జగన్నాథం” నుండీ వచ్చాయి. ఇటువంటి పలుకుబళ్లు అలవోకగా ప్రజల నోళ్లలో నానుతున్నాయి. “ఏ వాన్ని ఎందుకు కొడుతున్నవే! వాడు అగ్యానం పిల్లవాడు. ఇంక సక్కగ గ్యానమే రాలేదు వానికి” అనే మాటలు వినబడుతాయి. ఇందులోని అగ్యానం, గ్యానం వరుసగా అజ్ఞానం, జ్ఞానం నుండి జనించిన మాటలు. “ఈ పిల్లలు పాడుగాను! నెరీ ఆగ్గెల లేకుండ అయితున్నరు” లోని “ఆగ్గె” ఏమిటి? అది “ఆజ్ఞ”. అంటే పెద్దవాళ్లు ఆజ్ఞాపిస్తే పిల్లలు వినడం లేదని అర్థం. అదుపాజ్ఞల్లో ఉండడం లేదని సారం. సంస్కృతంలోని “ప్రజ్ఞ” పెగ్గె కాలేదా? అట్లాగే “ఆజ్ఞ” ఆగ్గె అయ్యింది. ప్రజ్ఞ అయినా, పెగ్గె అయినా సామర్థ సూచకం అయినట్లే; ఆజ్ఞ అయినా, ఆగ్గె అయినా ఏకార్థ బోధకం.
“ఇగో ఏదైనా అతి చెయ్యద్దు. వాడు అతిచేస్తడు “లోని “అతి” అచ్చంగా సంస్కృతం. అంటే ఎక్కువ చేయటం. ఓవర్ చేయడం. అతి చేయడం వల్ల జరిగే పర్యవసానాలు వేరు. “అతి సర్వత్ర వర్జయేత్‌” అనేది సూక్తి. “ఎవ్వలకు అతికారం ఇచ్చినా బతుకులు ఏం మారుతలేవు” అనే వాక్యంలోని “అతికారం” అధికారంలోంచి వచ్చింది. అసలు తెలుగులో మహాప్రాణాలు అంటే ధ, భ, ఖ మొదలైనవి లేవు. అందుకని ప్రజలు తమకు అనుకూలంగా ఆ పదాల్ని మార్చుకుంటారు. అలా మారడమే తెలుగు భాషా పద్ధతి. ప్రజల వ్యవహారంలో ఉన్నవన్ని సాధురూపాలే! జనబాహుళ్యంలో బాగా నానుతున్న ఇటువంటి మాటలన్నింటినీ నిఘంటువుల్లోకి ఎక్కించవలసిందే గాని భాషకు ఏదో అపచారం జరుగుతుందనే అభిప్రాయం వుండకూడదు. “మల్లయ్యకు ధైర్నం తక్కువ. ఆపద వచ్చినప్పుడు మనిషికి గుండె ధైర్నం ఉండాలె. అధైర్నం మంచిది కాదు” వాక్యాల్లోని “ధైర్నం” ధైర్యం నుండి ధైర్యంగా నిర్భయంగా ప్రభవించింది. ధైర్యంలోని యావత్తు ధైర్నంలో నావత్తుగా మారింది. ఎంత ధైర్యమో గమనించండి. ప్రజలు పదాల్ని తాము ఉచ్చరించడానికి విధేయంగా మార్చుకుంటారు. “గుండె ధైర్నం చెడొద్దు” అంటారు. ఇంకో మాట! “అధ్వానం” అనే పదానికి అమార్గం అని అర్థం. అంటే పెడత్రోవ. చెడుదారి. ఇది తెలంగాణలో అమాంతం “అద్మాన్నం” అయిపోతుంది. వా వత్తు మావత్తు అయి కూచుంది. అదనంగా నకారానికి నావత్తు వచ్చి చేరింది. ఇట్లా ద్విత్వం రావడం తెలంగాణ భాషలో సర్వ సాధారణం. తెలంగాణ భాషేమిటి, తెలుగు భాషా లక్షణం అది. ఉదాహరణకు “పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు, పాపాయి చేతుల్లు పొట్ల కాయల్లు, “మా పాప మామల్లు మత్సావతారం, వరసైన బావల్లు వరహావతారం” మొదలైన పాటల్లోని “కన్నుల్లు” వంటి పదాల్లో ద్విత్వం రాలేదూ! అదుగో… అలాగే తెలంగాణలో “కాళ్లు తట్ట తట్ట కొడతరు పిల్లలు బడికి పోను అని. అయినా పెద్దలు ఊరుకోక వాళ్లను గొర్రగొర్ర గుంజుకపోతరు. కొంత మంది ఉత్తగనే కిల్లకిల్ల నవ్వుతరు. తలలో పేలు పడ్డవాళ్లు బర్రబర్ర గోకుతరు. గాలి బొయ్యబొయ్య ఇసురుతది” లాంటి వాక్యాల్లోని “తట్టతట్ట కొడుతరు” మొదలైన మాటల్లో ద్విత్వం ఉంది కదా! అట్లాగే “అధ్వానం” లోని “న” తెలంగాణ “అద్మాన్నం” లో “న్న”గా మారింది. సంస్కృత పదం “అనాయాసం” ఎటువంటి ఆయాసం లేకుండా తెలంగాణలో “సునాయాసం” అయింది. అనాయాసం అంటే ఆయాసం లేకుండా అనే నఇఫ్ తత్పురుషం. మరి సునాయాసం ఎట్లా పుట్టిందో, సులువుగా చెప్పలేం. ఆయాసం లేకుండానూ, మంచిగానూ అని అర్థం చెప్పుకోవాలి. సునాయాసంలోని “సు” మంచిగా, చక్కగా అనే అర్థాన్నె ఇస్తున్నది.“బూమలింగం రాతం దుబాయికే పోతుంటడు. ఊల్లె ఉండనే ఉండడు” లోని “రాతం” మాటకు అర్థం “ఎల్లప్పుడు” అని, ఈ “రాతం” ఎక్కడిది? అనవరతం, అనారతం, నిరతం అనే సంస్కృత పదాల్లోని రతమే రాతంగా మారొచ్చు. అయితే “రతం” అని విడిగా మాటకు అర్థం లేదు. ఉన్నా ఎల్లప్పుడు అనే భావం రాదు. అయితేనేం పండితుల సంభాషణల్లో గబగబా దొర్లిన అనారతం వంటి మాటల్ని విన్న జనం పొరపాటున “రాతం” గ్రహించి ఉండాలి. “అన్నాలం పాడుగాను! ఏం కాలమొచ్చింది. అంత అగ్గిబుగ్గయిపోతుంది” వాక్యంలోని “అన్నాలం” ఏమిటో కాదు. అది “అన్యాయం”. సంస్కృత పదంలో వున్న యావత్తు తెలంగాణలో నావత్తు కావడం ద్విత్వపరమైన పాత మార్పే! ఇక్కడ ప్రస్తావించదగిన అంశం అన్యాయంలోని యకారం లకారంగా అన్నాలంలో చోటు చేసుకోవడం. ఇదెక్కడి అన్యాయం అని పండితులు గుండెలు బాదుకోనక్కర లేదు. భాష మారుతుంది. మారడం సహజం. ప్రజల వ్యవహారంలో అనేక కారణాల వల్ల మరింత మారిపోతుంది. మారిన రూపం వాడుకలో ఉంటే సాధురూపమే! ఇది ప్రజాస్వామిక యుగం. ప్రజానీకం మాట్లాడుతున్న ప్రతి మాటనూ కళ్లకు అద్దుకోవాలి. సేకరించాలి. నిఘంటువుల్లోకి తీసికోవాలి. కాలానుగుణంగా అన్నీ మారుతున్నాయి కానీ నిఘంటువులే మారడం లేదు. మారడం అటుంచి అసలు నిఘంటు నిర్మాణమే లేదు తెలంగాణలో. కేవలం కవిత్వాది ప్రక్రియలు తప్ప తెలుగు సాహిత్యంలో ఇతర ప్రక్రియలు నిష్క్రియలుగా మారడం మంచి పరిణామం కాదు. ప్రజల మాటలతో నిఘంటు నిర్మాణం జరగడం తక్షణావసరం.“అనుములంటే అపరాదం మినుములంటే మిడియాల్లం” అనే తెలంగాణ సామెతలోని అపరాదం సంస్కృత అపరాధ్యజన్యం.
మహాప్రాణం తేలికైంది తెలంగాణలో. ఆ సామెతకు అర్థం ఏం మాట్లాడినా ఇబ్బందే అని స్థూలంగా! ఇక సంస్కృతంలోని “అపేక్ష”కు ఏ అపేక్షో ఆపాచ్చనగా మారాలని! “ఆపాచ్చన” తెలంగాణ మాట. కోరిక అనే అర్థం కల్గిన అపేక్ష తెలంగాణలో ఆపాచ్చన అయిపోయింది. “పైసల మీద వానికి ఎంత ఆపాచ్చన పాడయింది. పోయేటప్పుడు ఏమన్న తీస్కపోతమా?” అంటుంటారు మామూలు జనాలు. “వీడు అప్రశస్తపు ముండకొడుకు” వంటి తిట్లు కొన్ని కుటుంబాల్లో వినవస్తుంటాయి. ఈ ఛీత్కారంలోని “అప్రశస్తపు” సంస్కృతం. చివరి “పు” తెలుగు. ప్రశస్తం కానిదే అప్రశస్తం. ఇక్కడ చెడ్డవాడు అని అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో ‘అబద్ధం” అనే పదం ఉంది. అంటే బద్దము కానిది. దేనికీ కట్టుబడని నీతినియమం లేని అసత్యం అబద్ధం. ఇది ఎంచక్కా తెలంగాణలో నిత్య వ్యవహారంలో “అవద్దం”గా అవుపిస్తున్నది. అబద్ధంలోని “బ” అవద్దంతో “వ”గా మారింది. వకార బకారాలు రెండూ పరస్పరం మారడం భాషలో సహజం. అబద్ధానికి వ్యతిరేకంగా నిబద్ధం ఉంది సంస్కృత భాషలో. కట్టుబడేది నిబద్ధం. చిత్రంగా ఇది తెలంగాణలో “నివ్వద్దె” అయ్యింది. ఇక్కడా “బ” కారం “వ”గా మారడమే కాకుండా అదనంగా ద్విత్వమైంది. అంతేగాక “నిబద్ధం” లోని “ద్ధం” చిత్రంగా “ద్దె” గా మారింది. నిబద్ధంలోని “సున్నా” ఎగిరిపోయింది. పైగా “ద్ధ” అనేది ఎకారాంతమై “ద్దె”గా మారింది. కన్నడ ప్రభావం తెలంగాణ భాషపై ఎక్కువ. పాఠశాలను నిజామాబాద్ ప్రాంతాల్లో శాల్లె అంటారు. అక్కడే బిడ్డను బిడ్డె అనీ, పిట్టను పిట్టె అని కూడా పిలుస్తారు. శాల్లె, బిడ్డె, పిట్టె… ఇటువంటివన్నీ ఎకారాంతాలు. నిజామాబాద్ జిల్లాకు ఆనుకొని సరిహద్దు రాష్ట్రంగా కర్నాటక ఉంది. “నువ్వద్దె” లోని “ద్దె” మీద ఆ రాష్ట్రపు అసర్ పడింది. “అమృత” అనేది ఆకారాంత స్త్రీ లింగ సంస్కృత నామ వాచకం. ఇది తెలుగులో “అమృతము” అవుతుంది. చివరి “ము” తెలుగు ప్రత్యయం. తెలంగాణలో కొంత మంది స్త్రీల పేర్లు అమృతవ్వ, అమృతమ్మ అని కూడా ఉంటాయి. “అర్తంలేని సదువు ఎర్తం” అనే సామెతలోని “అర్తం” సంస్కృత “అర్థం” లోంచి వచ్చింది. అర్థము అంటే శబ్దార్థం. మీనింగ్. ఆ అర్థం బోధపడకుండా చదివే విద్య వ్యర్థం కదా! సంస్కృత వ్యర్థం తెలంగాణలో “ఎర్తం” గా అవతరించింది. మొలల వ్యాధి, పైల్సు, మూలవ్యాధి అనే మాటలకు తెలంగాణలో “అర్శ మొలలు” అనే సమాస వ్యవహారం ఉంది. అర్శం అంటే మూలవ్యాధే! పైగా యిది అర్శం కాదు, అస్రం. అస్రం అంటే నెత్తురు. ఆ రక్త నాళాలు గట్టిబారగా ఏర్పడినవే అర్శమొలలు.కొందరు “అల్మింతలు” కూరగా వండుకుంటారు. “అలసాంద్వము” నుండి ఆల్మింతలు ఏర్పడ్డాయి. అలా మారడంలో మనకు చింతలూ, విచారాలే వద్దు. “అవతారం” అనేది సంస్కృత పదం. ఇది చాలా చక్కగా తెలంగానలో ప్రయుక్తం అవుతున్నది. దేనికైనా జవాబు చెప్పకుండా ముభావంగా ఉన్నప్పుడు “వీడు బుద్దావతారం” అంటారు. ఏదీ సరిగా చెప్పే జ్ఞానం లేని తరుణంలో” వానిది మొద్దావతారం” అని పల్కుతారు. సరిగా బట్టలు వేసుకోని సందర్భంలో “ఏం అవతారంరా నీది?” అని ప్రశ్నిస్తారు. చచ్చీచెడీ, కిందామీదా పడీ ఓ పనిని సాధించిన సన్నివేశంలో “అబ్బా! నాకు ఓ అవతారం ఎత్తినంత పని అయ్యింది” అంటుంటారు. ఇవన్నీ అవతార ప్రస్తావనలే! అవలచ్చనం (అవలక్షణం), అంసురం (అవసరం), అవస్త (అవస్థ), అన్నం తింటున్నవా అశుద్ధమా (అశుద్ధం) అతారె (అస్త్రం), ఆంకారం (అహంకారం)… ఇత్యాది సంస్కృత జన్యాలను తెలంగాణ జనాలు హాయిగా వాడుతున్నారు.

డా.నలిమెల భాస్కర్
9704374081