Home దునియా పాపాల కూపీ!

పాపాల కూపీ!

Cartoon

మత్తును చిత్తు చేయాలంటే ఓ ప్రమాదంలో ప్రముఖుడి సోదరుడు లేదా దగ్గర మనిషి చనిపోయి అతని డైరీ పోలీసులకు దొరకాలి. అంతేనా! అది చాలదు. అందులో మత్తు మందులోళ్లు మరియు మాయలోళ్ల పేర్లు, వాళ్ల కాంటాక్టు వీరుల పేరు, ఫోన్ నెంబర్లు ఉండితీరాలి. అప్పుడే మత్తు లోళ్లు కదులుతారు. పాపం వాళ్లకి అంతవరకూ ఏ పుట్టలో ఏ పాముందో తెలియక పుట్టల జోలికి వెళ్లరు. అప్పటికీ వారు కదలాలంటే మరో కలిసొచ్చే సంగతి ఉండాలి. ఏ పెద్ద కుంభోణంపైనో దర్యాప్తు జరుగుతూ అయినవారు రక్షించాల్సిన పెద్ద తలకాయలు ఉండితీరాలి. కప్పెట్టాల్సిన రహస్యాలు ఉన్నపుడే రహస్య విచారణ జరపాల్సిన ఎపిసోడ్లు పబ్లీకున జరుగుతాయి. ఇంకోటి. మత్తులందు పేద మత్తులు వేరయా. ఏశాఖ అయితే పేద మత్తును దేశ క్షేమం కోరి ఖజానాను పిక్కటిల్లజేయడానికి అనుమతిస్తుందో అదే శాఖ ఖజానాకు పనికిరాని మత్తు పని పట్టడానికి ‘ గొప్ప బహిరంగ నృత్య ప్రదర్శన’ టికెట్ లేండా మత్తు జన భంజకంగా సాగిస్తుంది.

‘కల్లు మానండోయ్ బాబూ కళ్లు తెరవండోయ్’ లాగా ‘పెగ్సు తాగండోయ్ బాబూ డ్రగ్సు మానండోయ్’ అని ‘పాట్రేగిపోవడం’ వింతల్లోకెల్లా వింత కాక ఎమిటి సార్లూ. ఒక మత్తులో జనం చిత్తవ్వాలని కోరుకుంటూ ప్రోత్సహించడానికీ, మరో మత్తును చిత్తు చేయడానికంటూ ఉరకలెత్తడానికీ మధ్య లాలూచీ ఏమిటని కదూ అడుగుతున్నారు. డొంకతిరుగుడు లేకుండా సూటిగా కుండబద్దలు అవడం చూడాలని తమరికి ఉంది కామోసు. ఇదిగో తెలియండి.

ఇప్పుడు బ్రాందీ, విస్కీలు ఉన్నాయి కదా. అవి మత్తు మందులని తెలిసీ తాగమని చెప్సే ‘సిన్’ టాక్స్ వారు అదే నోటితో డ్రగ్స్ తీసుకోవడం, బఫే డిన్నర్‌లోలాగా పంచిపెట్టడం తప్పని కోప్పడ్డం ఏమన్నా సబబుగా ఉందా. అనుమానమున్న వాళ్ల గోళ్లు, వెంట్రుకలు, ఇతర నమూనాలూ రహస్యంగా తీసుకొంటే పోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్టు. ‘ తెలిసీ చెప్పక పోయావో నీ తల వేయి వక్కలైపోతుంది’ అని శవంలోని భేతాళుడిలాగా హుంకరించనక్కరలేదు. చాలా తాజుగా తెలిసి పోతోంది- సర్కారుకు అక్కరలేనిది నిషిద్ధం అని. కావలసిన మత్తును కాదనం అని.! మందు మానకండోయ్ బాబూ.. డ్రగ్స్ ఒద్దండోయ్.. అని పాడాలని.

పుచ్చలపల్లి సుందరయ్యగారు ఆదిలో కాంగ్రెస్‌లో ఉన్నపుడు తాటి చెట్ల తలలు నరికే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వారు గనక ఇప్పుడుంటే ‘ ఆదాయానికి అడొస్తావా’ అంటూ ఆయన తలనే నరుకుతారు ఎక్సయిజు వారు అనిపిస్తోంది. డ్రగ్స్ ద్వారా కూడా పన్నుల ఆదాయం పెంచే ఉపాయాలుంటే అవి పుచ్చుకొనే వారికి ఎర్రతివాచీలు పరుస్తారు సర్కారీ సాములు. నిజంగా జనం మత్తులో చిత్తు కాకూడదని సర్కారు వారికి ఉంటే ‘సిన్ టాక్స్’ శాఖని ఎత్తేయాలంటాను.