Home దునియా దానధర్మాలు పోయినయి.. పైస కిందనే వైకుంఠం అయ్యింది

దానధర్మాలు పోయినయి.. పైస కిందనే వైకుంఠం అయ్యింది

Satirical Telugu Story on Charity and Donation

దానధర్మాలు, పుణ్యాలు పోయినయి. ఇప్పుడు అంతా పైస కిందనే వైకుంఠం అయ్యింది. పూర్వకాలంల ఇంటి ముందటికి వచ్చేటోల్లకు మంచి నీళ్లు పోస్తే పుణ్యం ఉంటదని అందురు. బాటసారులకు నీళ్ళు పోసే సాంప్రదాయం ఉండేది. ఊర్లల్ల నాలుగు బజార్లకాడ ధర్మబాయిలు ఉండేది. మంచినీళ్లు అందిచ్చుడు ధర్మం. రానురానూ నీళ్ళకు పైసలు అయినయి ఇరవై ఏండ్ల కింది నుంచే పదిరూపాయలకు నీళ్లబాటిల్ అమ్ముతున్నరు. ఇప్పుడు లీటర్ నీళ్లకు ఇరవై రూపాయలు అమ్ముతున్నరు. భూమినుంచి వచ్చిన నీళ్లకు ఆకాశం నుంచి కురిసిన నీళ్ళకు పైసలు మొదలైనయి.

ఒక్క మంచినీళ్లేం ఖర్మ, కలియామాకు, కోతిమీరాకు, బంతిపూలు, మల్లెపూలు ఇవన్ని కూడా ఎన్కటికాలంల పుణ్యానికి ఇచ్చేది. ఇప్పుడు అన్నటికి పైసలకాలం. ముందుగ పుణ్యానికి ఇచ్చే వస్తువును అమ్మలనంటే అది మంచిది కాదని ప్రచారం చేయలె. మంచినీళ్ళల్ల ఎన్నో క్రిములు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే మంచినీళ్లు అమ్మకంకు పెడుతరు. ఇట్ల నిత్యం తాగే నీళ్ళను వ్యాపారం చేస్తరు. ఇట్ల ఇంటింటికి ఇప్పుడు మినరల్ వాటర్ క్యాన్‌లు వస్తున్నయి. ఎన్కట కాలంల శాదబాయిల నీళ్ళు తాగలేదా నల్లనీళ్ళు వడపోసికోని తాగలేదా. ఆ కాలంల మనుషులు బతుకలేదా అంటే బతికిండ్రు ఇప్పటి కాలం వేరు. గోధుమలు తెచ్చుకోని పట్టిచ్చి రొట్టెలు చేసికొని తినేకాలం నుంచి ఇప్పుడు గోధుమ పిండి కొనుకొచ్చుకుంటున్నరు. గోధుమలు పట్టిచ్చి మీది పొరతీసి లోపల ఉన్న పిండిని అమ్ముతున్నరు. అసలు కొనుక్కవచ్చిన గోధుమపిండి రొట్టెలు గోధుమ రొట్టెల వాసనే వస్తలేదు. ప్రతిదీ అమ్మకం సరుకు అయిన సందర్భం.

ఇంట్ల పాడి ఉంటె సల్ల ఉత్తగ పోసేవాల్లు లేకుంటే సోలెడు తౌడుపోస్తే సల్ల పోసేది చెంబుల. మిరుపతోట కాడకి పోతె ఉత్తగనే నాలుగు మిరపకాయలు చేతుల పెట్టుతుంటిరి. అట్లనే అదే తోటలో బంతిపూల చెట్లు. ఒడ్లపొన్న ఏస్తుంటిరి. ఆ పూలు సుత ఇస్తుంటిరి. ఇంట్ల జామ చెట్ల ఉంటే జామ పండ్లు, రేగి పండ్లు ఏవంటే అవి ఆ ఇంటికి ఈ ఇంటికి అందిస్తుంటురి. ఇప్పుడు అవన్ని లేవు ప్రతిది మార్కెట్ పైసలు పైసలతోనే ప్రపంచం నడుస్తుంది. పైసకు విలువ పెరిగింది. పైసలే ప్రపంచం సుట్టు నడుస్తుంది. ఎవలకన్న ఏమన్న ఇస్తే పుణ్యం ఉంటదని అనుకుంటరు. ఇప్పటికాలం వేరు.

చింతచెట్టు ఉన్నోల్ల ఇంటికి పోతె చింతకాయ, ఓనగాయ ఇచ్చెటోల్లు, తాళ్ళల్లకుపోతె తాటిముంజలు, గేగులు ఇచ్చేది. ఈతచెట్టు పండ్ల తెచ్చుకోవచ్చు. ఇవన్ని ఊర్లల్ల ఉత్తగ తెచ్చుకున్నకాలం. అయితే తాటికల్లు ఈతకల్లుకు మాత్రం పైసలుకు ఇచ్చి పుచ్చుకునుడు ఉంటుండె. అట్లనే అదొక్క వస్తువులు అదలుబదలు ఉంటుండేది. ఊర్లల్ల పనిచేస్తే పైసల వంతుకు వడ్లు జొన్నలు ధాన్యం పెట్టుతుంటిరి. మంగలోల్లకు సాకలోల్లకు కుమ్మరోల్లకు మాదిగోల్లకు కమ్మరివాల్లకు వడ్లవాల్లకు కూలి పనికి వడ్లు ధాన్యం రైతులు ముట్టచెప్పినకాలం నుంచి క్రమంగా పైసలు ప్రవేశించినయి. పైసల్ ప్రపంచం అయినవి. పాత విలువలు పోయి కొత్త విలువలు ప్రవేశించినయి. పాతది కూలగొట్టాలనంటే దాన్ని నిర్వీర్యం చేయాలి. అప్పుడు అది ధ్వంసం అయితది. ఆ తర్వాత దాని స్థానం కొత్తగా మార్కెట్ సృష్టించుకోవచ్చు. ఇట్లనే పల్లెల్లోని మార్కెట్ ప్రవేశించింది. ఇంతెందుకు నలభైఏండ్ల కింద అందరు ఉత్తగనే యాపపుల్లతో పండ్లు తోముకునేది. ఇప్పుడు వంద రూపాయలు పెట్టి బ్రష్, పేస్ట్ కొంటున్నరు. అట్లతోమినా ఇట్ల తోమినా ఒక్కటే. కాని పాత విలువలు విధ్వంసం అయి కొత్త వాతావరణం ప్రవేశించింది. అవి మన అవసరం కొరకు కాకున్నా మార్కెట్ అవసరం కొరకు మనిషి ప్రయాణం అవుతున్నడు.

-అన్నవరం దేవేందర్, 94407 63479