Home దునియా మేకప్‌తో పాటు నటనలోను ప్రతిభ

మేకప్‌తో పాటు నటనలోను ప్రతిభ

నాటక రంగంలో ఏ పాత్రకైనా మేకప్ బాగుంటేనే  ఆకట్టుకుంటుంది. మేకప్ ద్వారా పాత్ర సహజత్వం  ఉట్టిపడుతుంది. నవరసాలను పలికించడంలో కూడ మేకప్ ప్రధాన భూమికను పోషిస్తుంది. మేకప్ లేని ఏ పాత్ర రాణించదు. అలాంటి అవినాభావ సంబంధం పాత్రకు, మేకప్‌కు ఉంటుంది. అంతటి విశిష్టత గల మేకప్ రంగాన్ని ఎంచుకున్నాడు బాపన్‌పల్లి వెంకట స్వామి.

Art

నా టక రంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎందరో నట దిగ్గజాలకు మేకప్ చేస్తూ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు వెంకటస్వామి. తనకు ఇష్టమైన పౌరాణిక (పద్య) నాటకాలకు మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తూ అందరిచేతా శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావ్‌పల్లి గ్రామానికి చెందిన తుప్పులయ్య, ముసిలమ్మ దంపతుల కుమారుడైన బాపన్‌పల్లి వెంకటస్వామి ఇంటర్ వరకు చదివాడు. ఆ తరువాత ఐటీఐ పూర్తి చేసిన ఆయన బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అంబర్‌పేట న్యూపటేల్‌నగర్‌లో ఉంటూ కొంతకాలం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే నగరంలో ఉంటున్న వెంకటస్వామి చిన్నాన్న కుమారుడైన పరమేశ్వర్ నాటకరంగంలో మేకప్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. తరచూ సోదరుడి వద్దకు వెళ్లే వెంకటస్వామి అతను చేసే మేకప్ పనిని శ్రద్ధగా గమనించేవాడు. ఈ క్రమంలోనే సోదరుడి వద్ద శిష్యరికం చేసి తాను కూడ మేకప్ పనిని పట్టుదలతో నేర్చుకున్నాడు. ఆ తరువాత గురువు, సోదరుడు పరమేశ్వర్ సురభి కేశవరామ్‌ల ప్రోత్సాహంతో వెంకటస్వామి తానే స్వయంగా మేకప్ సామగ్రిని కొని, చిన్న చిన్న నాటకాలలో కళాకారులకు మేకప్‌లు చేస్తూ అంచలంచెలుగా ఎదిగాడు.

నాటకాలలో దుర్యోధనుడు,

కృష్ణుడు, శ్రీనాథుడు, రావణుడు, ఖడ్గతిక్కన, వశిష్టుడు, విశ్వామిత్రుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు తదితర పాత్రలకు వెంకటస్వామి మేకప్ చేసి జీవం పోశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెరెన్నికగన్న నాటకపరిషత్‌లకు మేకప్ చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. నాటక రంగ దిగ్గజాలు గుమ్మడి గోపాలకృష్ణ, సురభి జమునారాయులు, అల్విన్ సుబ్బారావు, పీవీఎస్ కృష్ణ, నైవేలి వెంకటకృష్ణ, నర్సింగ్‌రావు, దివంగత తంగిరాల రాఘవశర్మ, పందిళ్ల శేఖర్‌బాబులకు వెంకటస్వామి మేకప్ వేసి వారి అభిమానాన్ని చొరగొన్నాడు. ప్రస్తుతం వెంకటస్వామి ఇరురాష్ట్రాల కోసం పేరెన్నికగన్న నటులు, నాటక సమాజాలకు పర్మెనెంట్ మేకప్ ఆర్టిస్టుగా సేవలందిస్తున్నాడు. మేకప్ ఆర్టిస్టుగానే కాకుండా నాటకరంగంలో నటుడిగా కూడ ఆయన రాణిస్తున్నాడు. ప్రధానంగా బాలల కోసం నాటికలు, నాటకాలు, కథానికలు తదితర రచనలు చేస్తున్నాడు.

వివిధ సంస్థలు ఇచ్చే అవార్డులతో పాటు 2013లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ప్రతిష్టాత్మకమైన నంది(ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్) అవార్డును స్వామి అందుకున్నాడు. 2007 నుంచి 2015 వరకు వరుసగా ఆయన నందినాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. అలాగే ఎన్‌టిఆర్ నాటక పరిషత్ ఉత్తమ మేకప్, శ్రీకాళహస్తీశ్వర నటరాజు అవార్డు, తెనాలి లలిత కళా సమితి హనుమ అవార్డు, టిటిడి గరుడాశ్వం అవార్డులను దక్కించుకున్నాడు. 2017 -18 సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ సారి నంది అవార్డుకు వెంకటస్వామిని ఎంపిక చేసింది. ఇరురాష్ట్రాలలోనే కాకుండ మలేసియా, దుబాయ్, శ్రీలంక దేశాలకు కూడ వెళ్ళి అక్కడి నటులకు మేకప్ చేస్తున్నారు. మేకప్ ఆర్టిస్టుగానే కాకుండా వెంకటస్వామి సమాజానికి తన వంతుగా సేవలను అందిస్తున్నాడు. తన పెద్దమ్మ దివంగత బాపన్‌పల్లి కిష్టమ్మ పేరుమీద ప్రతిఏడాది పదవతరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఒక పేద విద్యార్థికి ఆయన నగదు బహుమతిని అందజేస్తున్నాడు. ఇటీవల ఆయన స్వగ్రామమైన గంట్రావ్‌పల్లిలో జరిగిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో వెంకటస్వామి దంపతులను ఘనంగా సన్మానించారు.

ఎం.సతీష్ ముదిరాజ్
మనతెలంగాణ/సిటీబ్యూరో