Friday, March 31, 2023

సాగోగులు తెల్పండి

- Advertisement -

govt*మార్చి 11కి సాగుకు పనికిరాని భూముల లెక్క తేల్చాలని అధికారులకు ఆదేశం
సాగుయోగ్యం కాకపోతే పెట్టుబడి సాయం ఉండదు

మన తెలంగాణ / హైదరాబాద్ : రైతులకు వానాకాలం నుంచి ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా వృథా కాకుండా ఆలోచిస్తూ ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం 1.42 కోట్ల ఎకరాల మేరకు సాగుభూమి ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఆ భూములన్నింటికీ ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. అయితే అందులో సాగులో ఉన్న భూమి ఎంత, సాగు చేయకుండా పడావుగా ఉన్న భూమి ఎంత అనే వివరాలను రాబట్టేందుకు కార్యాచరణ ప్రారంభించింది. మార్చి నెల 11వ తేదీకల్లా పూర్తి స్థాయి వివరాలను అందజేయాల్సిందిగా ఏరియా వ్యవసాయ విస్తరణాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం ఇటీవల నియమించడంతో భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన వివరాల మేరకు క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ రికార్డుల్లోని భూములకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని ప్రభు త్వం కోరింది. భూరికార్డుల ప్రకారం సాగుభూములుగా నమోదైనా సాగుకు యోగ్యం గా ఉన్న భూముల విస్తీర్ణం ఎంత, సాగుకు యోగ్యం కాకుండా రాళ్ళు, రప్పలతో ఉన్న భూమి ఎంత అనే వివరాలను విస్తరణాధికారులు పంపాల్సి ఉంటుంది. రైతులకు ఆర్థిక సాయం చేయడం ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సాగుకు యోగ్యంకాని భూములకు సాయం చేసి నా ఫలితం ఉండబోదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తూ ఉంది. ఆర్థిక వనరులు  లేనందువల్ల సాగుకు యోగ్యమైన భూమే అయినా రైతులు సేద్యం చేయకుండా వదిలేస్తున్న క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వాటికి కూడా సాయం చేయడం ద్వారా సాగులోకి తేవాలని స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. అదే సమయంలో రికార్డుల్లో ఉన్న భూములు సాగవుతున్నాయా లేదా, రైతులు సంవత్సరానికి ఒక పంటే వేస్తున్నారా లేక రెండు పంటలు వేస్తున్నారా, ఏ రకమైన పంటలు వేస్తున్నారు… ఇలా పూర్తి వివరాలను ఆ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. సాగుకు యోగ్యంకాని భూములకు వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని మంజూరు చేసినా ప్రయోజనం లేనందున డబ్బు వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టింది. మంత్రివర్గ ఉప సంఘం స్పష్టంగా సాగుకు యోగ్యంకాని భూములకు ఆర్థిక సాయం అవసరంలేదని చెప్పింది. ప్రతి గ్రామం నుంచి వివరాలు అందిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News