Home కలం శేషేంద్ర ఒక కవిశిఖరం

శేషేంద్ర ఒక కవిశిఖరం

photo

శేషేంద్ర సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు. ఆయన కవిత్వంలోను, విమర్శలోను ఒక విలక్షణత కనిపిస్తుంది. వచన కవితైనా, పద్యం అయినా శేషేంద్ర చెప్పే రీతి ఒక ప్రత్యేకమైనదే. ప్రజల కోసమే కవిత్వమంటారు శేషేంద్ర. భారత ప్రభుత్వం నుంచి ‘రాష్ర్టేందు’ బిరుదు పొందిన శేషేంద్ర నా దేశం నా ప్రజలు. మండే సూర్యుడు. గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, స్వర్ణహంస, రక్తరేక, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశం వంటి రచనలు చేశారు. శేషేంద్ర ఎంత గొప్ప కవిత్వం రాశారో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఆయన పేరు నోబుల్ బహుమతి కొరకు నామినేట్ కావడమేనని చెప్పవచ్చు. 

పూవు పుట్టగానే పరిమళిస్తుందన్న ఆర్యోక్తి శేషేంద్ర శర్మ విషయంగా పూర్తిగా వర్తిస్తుంది.బాల్యంలో సంప్రదాయ పద్ధతిలో సంస్కృత వ్యాకరణం , తర్క అలంకార శాస్త్రాలు, ఉపనిషద్భాష్యాలు, వేదాంత పంచదశి, వేద విద్య, కావ్య ప్రబంధాలూ అభ్యసించిన శేషేంద్ర గుంటూరు ఎ.సి కాలేజ్ లో బి.ఎ చదువుతున్న రోజుల్లో ఆదిశంకరుల జీవితంలో జరిగిన ఒక ఉద్విగ్న సన్నివేశాన్ని ‘ చండాలోపి మమ గురుః ‘ అనే ఖండకావ్యంగా కాలేజ్ మ్యాగజైన్ లో ప్రచురింపజేయడంతో తన సాహిత్య ప్రస్థానాన్ని ఒక విలక్షణ రీతిలో ప్రారంభించి.. 1947-48 లలో మాథ్యూ అర్నాల్ ఆంగ్ల కావ్యాన్ని ’ సొరాబు ’ పేరుతో పద్య కావ్యంగా అనువదించి వేంకట పార్వతీశ్వర కవుల పీఠికతో 1954 లో వెలువరించి తనకు పద్యం పై ఉన్న మక్కువనూ, పద్య నిర్మాణంపై ఉన్న సాధికారికమైన పట్టునూ, పద్యం గురించి విశేషమైన తన అభిప్రాయాన్ని ’ కవిత్వంబు కేవలము లలిత పద మిళితంబును ,కాంతాసమ్మితంబును కారాదు. కంఠీరవ సదృశంబును, ఖడ్గధారాఘోరంబును పురుషత్వపటిమా జటిలంబును గావలెను ’ గా ప్రకటించారు. తర్వాత, కాలంతో పాటు తనూ, తనతో పాటు కాలాన్ని మార్చుకుంటూ 1961 లో శ్రీనాథుని చాటువులను ’ చంపూ వినోదిని ’ గా, 1963 లో తన స్వతంత్ర కావ్యం ’ఋతుఘోష ’ ను, 1970 లో ’ పక్షులు ’ ను,1972 లో ’ శేషజ్యోత్స్న ’ , 1974 లో ’ మండే సూర్యుడు ’, 1975 లో ’ నా దేశం- నా ప్రజలు ’ ,1976 లో ’ నీరై పారిపోయింది ’ కావ్యాలను శర పరంపరగా తెలుగు కవితాప్రియులకు అందిస్తూ శేషేంద్ర కొంగ్రొత్త ప్రతీకలతో, రూపకాలతో, ఉపమానాలతో, శైలితో, అక్షరాలకు అగ్నిని పొదిగి కొత్త తుఫానులా ప్రవేశించి అప్పటికి నిస్తేజంగా ఉన్న తెలుగు వచన కవితాలోకాన్ని ఒక్క కుదుపు కుదిపి విమర్శకులందరిని ఉలిక్కిపడేట్టు చేశాడు. తెలుగు వచన కవితా చరిత్రలో 1970 ల దశాబ్దం ఒక ’ విజృంభన ’ .. అంతా కొత్త గాలి, కొత్త చిగుళ్ళు, కొత్త అక్షర పర్యావరణం, కొత్త ఆలోచనా దిశ. కవిత్వ నది ఒక చారిత్రాత్మకమైన మలుపు తిరిగి తెలుగు సాహిత్య భూమిని సస్యశ్యామలం చేసింది. తెలుగు కవిత్వ చరిత్రలో మిగిలిపోయిన ఒక స్వర్ణ యుగమది.. శేషేంద్ర తనను తాను ఒక ప్రజా కవిగా, మహాకవిగా రూపాంతరీకరించుకుని ’ కవిత్వం ’ అంతిమంగా ప్రజలకోసమేననీ, ప్రజల పక్షమే ననీ, ప్రజల ఊపిరేననీ తేల్చి చెప్పాడు.  శేషేంద్ర తనను తాను ఒక ఎదురులేని సాహిత్య స్రష్ట .అతను ఏండ్ల పర్యంతం అవిశ్రాంతంగా సాగించిన సంప్రదాయ భారతదేశ, విదేశ విశ్వ సాహిత్య సమగ్ర అధ్యయనం. సంస్కృతం, తెలుగు ,ఇంగ్లిష్ ,ఉర్దూ భాషలపై సాధించిన పట్టు. పాండిత్యం. అనర్ఘళమైన అభివ్యక్తి ధార. ఆశువుగా సాహిత్య సంబంధమైన ఏ సంగతినైనా సోదాహరణంగా, సవివరంగా, సాధికారకంగా చర్చించి ఒప్పించగల విషయ పరిపక్వత. లేకుంటే, ’ ఋతుఘోష ’ కు ముందుమాట ’ కావ్య తత్త్వ ప్రకాశము ’ రాస్తూ విశ్వనాథవారు ’ ఇట్టి కవియొక్క రచనయందు కూర్పుయొక్క రమణీయత చూపించుట అనవసరము. అట్టి రమణీయత కితని గ్రంథమున పండిన పంటచేను. ఇట్టి రచన చేయగలవారీనాడు పట్టుమని పదిమందియైనను లేరు. ఈయన చిరాయువై యొక మహాకావ్య నిర్మాత యగుగాక ’ అని ఆశీర్వదించేవాడుకాదు. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవుల్లో ఆవేశమూ అనుశీలనా సంయుక్తమై పరిఢవిల్లడం, ప్రతిభా పాండిత్యమూ రెండూ ఒకే కవిలో ప్రధాన ధాతువులై వర్థిల్లడం, కావ్య ప్రపంచమూ సృజనాత్మక అలౌకిక ప్రపంచమూ ఒకే వ్యక్తిలో సమ్మిళితమై ఉండడమూ బహు అరుదైన విషయాలు. నిజానికి శేషేంద్ర పండితులలో కవి, కవులలో పండితుడు .. ప్రజాస్వామ్య సమాజంలో అతనొక హృదయవాది. సొరాబు – దీర్ఘ కవిత ( 1947 ), షోడశి ( 1967 ),స్వర్ణ హంస ( శ్రీ హర్షుని నైషద కావ్యానికి విశ్లేషణ ), సాహిత్య కౌముది ( తెలుగు క్లాసికల్ కవులపై వ్యాసాలు ) కృతులను వెలువరించేనాటికి శేషేంద్ర దాదాపు చందస్సు ను గౌరవిస్తూ, తెలుగు పద్యం పై ఎనలేని మమకారాన్ని ప్రదర్శించిన పండిత కవిగానే విజ్ఞులకు పరిచయమయ్యేడు. సంప్రదాయవాదులను ’ షోడశి ’ లో వాల్మీకి రామాయణంలోని ధ్వని వైచిత్రి గురించీ, సుందరకాండ లో కుండలినీ యోగం నిక్షిప్తమై ఉందనీ, త్రిజటా స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్రం ధ్వనిస్తున్నదనీ అనేక శబ్దాలు శాస్త్ర రహస్యాల్ని తెలియజేస్తున్నాయనీ, రాముడు పరాశక్తిగా, హనుమంతుడు నిరంతర దేవీ ధ్యాన జప యోగ తత్పరుడుగా దర్శనమిస్తున్నాడని అనేకానేక అన్వయింపులతో ఋజుపరుస్తూ.. గ్రంథ నిర్మాణ పద్ధతిలోనూ,శబ్ద వినియోగంలోనూ, ఉపమానాలు, వర్ణనలూ, కథన రీతుల్లోనూ పంచమవేదమైన మహాభారతం రామాయణానికి ప్రతిబింబంవలె ఉందని తేల్చి చర్చల్లో ఒప్పించారు. అలాగే ’ స్వర్ణ హంస ’ శ్రీ నైషద కావ్య విశ్లేషణలో యోగ , తంత్ర, మంత్ర, వేదాంత విశేషాలు ఎలా నిక్షిప్తమై ఉన్నాయో తెలియజేస్తూ స్వర్ణ హంస అంతే సాధారణ అర్థంలో ఒట్టి బంగారు హంస కాదని, శ్రీహర్షుని హిరణ్మయి హంస అజపాయంత్రాధి దేవతనీ, శ్రీ సూక్తంలోని ’ హిరణ్య వర్ణాం హరణీం.. ‘ అనే మంత్రంలోని శ్రీ దేవియే ఈ స్వర్ణ హంస అని శ్రుతుల్లో, తైత్తరీయాది ఉపనిషత్తుల్లో , విద్యారణ్యుల వేదభాష్యంలోని అనేక అంశాలతో మూల్యాంకనం చేసి పండితులను మెప్పించారు. ఇదంతా శర్మగారిలోని ఒక సంప్రదాయ పార్శ్వం. నిరంతరమూ అన్యాయానికి గురి ఔతున్న కష్టజీవులను తిరగబడమని చెప్పిన ఉప్పెన వంటి కావ్యం ’ గొర్రిల్లా ’ ( 1977 ) వచ్చింది. గొర్రిల్లా ను ఒక అకలుషిత కరుణామయ రాక్షసునిగా అభివర్ణిస్తూ శ్రామికుల సంఘటిత శక్తికి ప్రతీకగా చెబుతూ ’ సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు/ తుఫాను గొంతు ’ చిత్తం ’ అనడం ఎరగదు/ పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు/ నేనింకా ఒక పిడికెడు మట్టే కావచ్చు/ కాని కలమెత్తితే నాకు / ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది ’ అని గర్జిస్తూనే ’ చావునెదుర్కోవడం కంటే బ్రతుకునెదుర్కోవడ మే పెద్ద సమస్య ఐపోయింది ’ అని వాపోయాడు. తర్వాత ’సముద్రం ఒక మార్మిక ద్రవ్యం ’ అని ఒక అత్యంత మార్మిక ఆంతరిక భాషలో వెలువరించిన గ్రంథం ’ నా పేరు సముద్రం ’ ( 1977 ). అంతకు క్రితమే అనేక సంవత్సరాలుగా శేషేంద్ర మనస్సులో లావాలా మరుగుతున్న ’ కవులను ఒక సైన్యంలా తయారుచేయాలి ’ అన్న కాంక్షకు ఒక శాస్త్రీయ రూపాన్నిస్తూ అప్పటిదాకా తాత్కాలికంగా ’ కవి సేన ’ గా వ్యవహరిస్తూ వచ్చిన ( నేనుకూడా కవిసేన మానిఫెస్టో రూపకల్పనలో భాగస్వామినే ) సంస్థకోసం ఆధునిక కావ్య శాస్త్రం ’ కవి సేన మానిఫెస్టో ’ ను( 1977 లో ) వెలువరించారు శేషేంద్ర. చిలీ దేశంలో ఫాబ్లో నెరోడా వలె ఒక కవియైన సాంస్కృతిక సారథి ఈ దేశాన్ని శాస్త్రీయంగా పరిపాలించి ఈ భూమిని భూతల స్వర్గం చేయాలని స్వప్నించేవాడు. దాని హృదయ వాక్యం ఏమిటంటే..’ మనందరం కలిసి ఒక దిక్కుకు నడుద్దాం ’ .. అని. ఈ గ్రంథాన్ని తయారు చేయడానికి నాతో సహా చాలా మందిమి అనేకానేక దేశ విదేశ ప్రామాణిక , రాజకీయ ,సాంస్కృతిక నేపథ్యాలతో విజయాలను సాధించిన చరిత్రలను అధ్యయనం చేశాము. కాని మేధావులు అంత తొందరగా సంఘటితం కారు. వైరుధ్యాలు కోకొల్లలుగా ఉంటాయి వాళ్ల మధ్య. చర్చలతోనే చాలా కాలం వ్యర్థమైపోయింది. ఎనభైలలో నేనెరిగి శేషేంద్రలో ఒక రకమైన అంతర్మథనంతో.. తనను తాను కూర్చుకోవడం.. కూడదీసుకోవడం మొదలైంది. ఉద్యమ పథం నుంది కొద్దిగా ప్రక్కకు జరిగి..మళ్ళీ మృదు భావాలతో కూడిన ఊహాత్మక రచనల్లోకి జారిపోయాడు. అప్పుడే ..అంటే 1986 లో తను అంతవరకు రచించిన కావ్యాలను తనకు నచ్చిన క్రమంలో అమర్చి ’ ఆధునిక మహాభారతం ’ పేరుతో ఒక బృహత్ కావ్యాన్ని ప్రకటించాడు. అప్పుడన్నాడు శేషేంద్ర.. ‘ నిజానికి ఏ కవైనా తన జీవిత కాలంలో ఒకే ఒక మహా కావ్యాన్ని రచిస్తాడు. అదీ అప్పుడప్పుడు అంచెలంచెలుగా కవి తనను తాను తన ఒకే దీర్ఘ కావ్యంలోని అంగాలుగా ఆవిష్కరించుకుంటాడు ‘. దీంట్లో పది పర్వాలున్నాయి. ’ మండే సూర్యుడు ’ ను ’ సూర్య పర్వం ’ అన్నాడు. ఇలాగే మిగతా పర్వాలు కూడా. వ్యాస మహాభారతానికి అనుబంధ కావ్యం ’ హరి వంశం ’ ఉన్నట్టే తన ఆధునిక మహా భారతానికి కూడా అనుబంధ కావ్యాన్ని 1994 లో ’ జనవంశం ’ పేర ప్రకటించాడు శేషేంద్ర. దీంట్లో ఆరు కాండలున్నాయి. అవి , ఋతుకాండ, భ్రమర కాండ, ప్రజా కాండ, చంపూ కాండ, యుద్ధ కాండ, మరియు చమత్కారిక కాండ. ఈ గ్రంథం మనిషి జననం నుండి మరణం దాకా సాగే జీవన సుదీర్ఘ యానంలోని సకల సుఖ దుఃఖాల సంవేదనలతో పాటు.. ఇహ పర తాత్విక, ఆత్మిక అధ్యాత్మిక లోతులన్నీ చక్కటి కవిత్వ వ్యక్తీకరణలతో , మార్మిక నైరూప్య ప్రతీకలతో శోభిల్లింది.  రెండు విలువైన వ్యాస సంపుటాలను శేషేంద్ర శర్మ తెలుగు సాహిత్య సంపదగా మిగిల్చి వెళ్ళారు. అవి 1) ’ రక్త రేఖ (1975 ).. ఇది శర్మగారు 1952 నుండి 1974 వరకు అప్పుడప్పుడు వివిధ అంశాలపై ఆంగ్లాంధ్ర భాషల్లో రాసుకున్న దినచర్య వంటి ఒక నోట్ బుక్. ఇవి కవి యొక్క స్వగత సంభాషణలు. ’ కవి – కవిత్వం ’, ’ రచయిత – రచనలు ’, ’ అకవిత్వం – అకవులు ’ ,’ ఆదర్శ సమాజం ’, ’ ఆదర్శ విశ్వం ’ . ఈ శీర్శికలన్నీ అప్పటి శేషేంద్ర ఆలోచనల స్వభావాన్నీ, విలువల గురించి అతను చెందిన అంతర్మథనం గురించీ తెలియజేస్తాయి. 2) కాల రేఖ (1990 ).. ఇదే శేషేంద్ర శర్మకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ప్రామాణిక గ్రంథం. ఆదికవి వాల్మీకి నుండి చిలకమర్తి లక్ష్మీనరసింహం వరకు అనేకానేక విలువైన వ్యాసాలు,వ్యాసుడు, కాళిదాసు, మయూరుడు, అరవింద సావిత్రి, ప్రాచీన గ్రీకు భారతీయ నాటకాల తులనాత్మక పరిశీలన, సూర్య శతకం , గజల్ పుట్టు పూర్వోత్తరాలు, ఛందస్సు – కవిత్వ ఆయుస్సు, వచన కవిత- ఒక ప్రపంచ పర్యవేక్షణ.. వంటి ఎన్నో బహుముఖీన ప్రాధాన్యతలున్న అంశాలపై ఎంతో ఉపయుక్తమైన వ్యాసాలున్నాయి దీంట్లో. ముఖ్యంగా ’ గజల్ ’ నిర్మాణ విశేషాలు, గజల్ వివిధ దేశాల్లో ఎలా వర్థిల్లుతూ వస్తోంది..అది ఎలా శాశ్వత వినోద క్రియగా సజీవంగా ఉండగలుగుతోంది అన్న విషయాలను శర్మగారు చాలా అసక్తికరంగా చెప్పారు. తెలుగు వచన కవిత ఎందుకు చదువబడుతోంది.. ఎందుకు పాడబడడంలేదు..అన్న మీమాంసకు అతి శాస్త్రీయమైన కారణాలను చర్చకు పెట్టి మున్ముందు ’ వచన కవిత ’ ఎలా నిర్వీర్యం కాగలదో దర్శింపజేశారు. ధారణ శక్తినివ్వలేని ఏ సాహిత్య ప్రక్రియైనా అంతరించిపోతుందని ఒక హెచ్చరిక చేశారాయన. శేషేంద్రకు వీరాభిమానులున్నట్టే వీర శత్రువులు కూడా ఉన్నారు. ఆయనకు దక్కవలసిన గౌరవం దక్కలేదు. అదృష్టం ఎప్పుడూ అతన్ని అప్పణంగా వరించలేదు. తెలుగు భాషా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు కవి శేషేంద్ర పేరు ( నా దేశం – నా ప్రజలు కావ్యం ద్వారా ) ’ నోబెల్ ’ పురస్కారార్థం పరిశీలనకోసం ఎంపిక చేయబడింది. కాని అదీ దక్కలేదాయనకు. 1994 లో మాత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టానును ప్రదానం చేసి తన గౌరవాన్ని కాపాడుకుంది. ఐతే..తెలుగు సాహిత్యమున్నంతవరకు ఒక విలక్షణ పండితునిగా , విభిన్న కవిగా, తనదైన స్వంత స్వరంతో ’ నిదిరించే తోటలోకి ఒక పాటై ’ వచ్చి సాహిత్య ప్రియులకు ఒక నిశ్శబ్ద గీతమై శేషేంద్ర నిరంతరం వినిపిస్తూనే ఉంటాడు. గుంటూరు శేషేంద్ర శర్మ ఒక కవి శిఖరం.