Home తాజా వార్తలు ఘనంగా ‘ఎస్‌బిఐ’ మహిళ దినోత్సవ వేడుకలు

ఘనంగా ‘ఎస్‌బిఐ’ మహిళ దినోత్సవ వేడుకలు

SBI announces concession to women home loan borrowers

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) హైదరాబాద్ సర్కిల్ సోమవారం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ను ఘనంగా నిర్వహించింది. ఇక్కడ కోఠి లోకల్ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హోమ్‌గార్డ్ ఎడిజిపి బాలనాగ దేవి (ఐపిఎస్), కేర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ చంద్రముఖి సునెహ్రా, ఆడియా ఇంజనీర్ అండ్ మ్యుజిషియన్ సాజిదా ఖాన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. విచ్చేసిన అతిథులతో పాటు చీఫ్ జనరల్ మేనేజర్ ఒ.పి.మిశ్రా జ్యోతి ప్రజ్వలన చేశారు. మహిళా సాధికారత, సాధించిన విజయాలు, సమాజానికి వారు చేస్తున్న సేవలను మిశ్రా ప్రశంసించారు. అనతరం అథితులు ప్రసంగించారు.

ఎస్‌బిఐ అమరావతి సర్కిల్ మహిళలకు సత్కారం
మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అమరావతి సర్కిల్ ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఎన్‌జిఒ భూమిక సత్యవతి, అనాథాశ్రమం శ్రద్ధా హోమ్ సుజాతా బుర్లా, నర్సు జి.రాజేశ్వరి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సమాజానికి చేస్తున్న విశేష సేవలకు గాను చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ సహయ్ వారికి మెమోంటో ఇచ్చి శాలువాతో సత్కరించారు.

యూనియన్ బ్యాంక్ ప్రత్యేక వర్క్‌షాప్
మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) సికింద్రాబాద్ రీజియన్ ప్రత్యేక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. జ్యోతి ప్రజ్వలనతో రీజియన్ హెడ్ ఎస్.శ్రీనివాస్, డిప్యూటీ రీజినల్ హెడ్ ఎస్.ప్రకాశ్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ విద్యావేత్త డా.సుమన్‌లత ముఖ్య అతిథిగా, ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ డిజిఎం కె.రాజేంద్ర కుమార్ హాజరయ్యారు.

విద్యార్థినులకు ‘పిఎన్‌బి’ కొవిడ్ కిట్లు పంపిణీ
కార్పొరేట్ సమాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. మూసాపేట్ జెడ్‌పిహెచ్‌ఎస్ వద్ద ఎన్‌జిఒ మాగ్నా కార్టా సహకారంతో పిఎన్‌బి పరివార్ శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో 500 మంది విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, కొవిడ్ కిట్లు పంపిణీ చేశారు.

SBI announces concession to women home loan borrowers