Home తాజా వార్తలు డెబిట్ కార్డు ఇఎంఐ

డెబిట్ కార్డు ఇఎంఐ

SBI EMI

ప్రారంభించిన ఎస్‌బిఐ

న్యూఢిల్లీ: దేశీయ అగ్ర ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) డెబిట్ కార్డుపై ఇఎంఐ(నెలసరి వాయిదా) సౌకర్యాన్ని సోమవారం ప్రారంభించింది. ప్రస్తుత ఎస్‌బిఐ కస్టమర్లు ఇఎంఐలు ఆరు నెలల నుంచి 18 నెలల వరకు ఎంపిక చేసుకోవచ్చు. ఈ పండుగ సీజన్‌లో ఎస్‌బిఐ కస్టమర్లు డెబిట్ కార్డుతో నిమిషంలోనే తక్షణ రుణాన్ని పొందవచ్చు. దేశవ్యాప్తంగా 40,000కుపైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్ (పిఒఎస్) వద్ద ఎస్‌బిఐ డెబిట్ కార్డుదారులు వస్తువులను కొనుగోలు చేసి నెలసరి వాయిదాల రూపంలో (ఇఎంఐ)లో చెల్లింపులు చేపట్టే వెసులుబాటు కల్పిస్తున్నామని ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ ప్రకటించారు. దీంతో వస్తువుల కొనుగోలుకు అయ్యే మొత్తం తక్షణమే చెల్లించనవసరం లేదు. డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు ఇఎంఐపై వాటిని కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.

ఎస్‌బిఐ తక్షణ రుణం
ఎస్‌బిఐ డెబిట్ కార్డ్ వినియోగదారులందరికీ డెబిట్ కార్డ్ ఇఎంఐ సౌకర్యాన్ని ప్రారంభించింది. నెలసరి వాయిదాల ద్వారా డెబిట్ కార్డులపై తక్షణ రుణం పిఒఎస్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ వద్ద పొందవచ్చు. డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం కావలసిన మొత్తాన్ని ఇఎంఐగా మార్చిన తర్వాత తిరిగి చెల్లించడం ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది.

అర్హత తెలుసుకోవడం ఎలా?
ఎస్‌బిఐ సేవింగ్ అకౌంట్ వినియోగదారులకు వారి ఖాతా, వ్యయాల చరిత్ర ఆధారంగా క్రెడిట్ పరిమితి నిర్ణయిస్తారు. మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఎస్‌బిఐ డెబిట్ కార్డ్ వినియోగదారులు ‘డిసిఇఎంఐ’ అని టైప్ చేసి ‘567676’కు పంపాలి.

నిమిషంలో రుణం ఆమోదం
డెబిట్ కార్డు ద్వారా ఈ తక్షణ రుణం 60 సెకన్లలోపు పొందవచ్చు. డాక్యుమెంటేషన్ అవసరం కూడా లేదు. చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే కస్టమర్ల సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉన్నప్పటికీ రుణం ఆమోదిస్తారు. తక్షణమే ఇఎంఐలుగా మార్పు చేస్తారు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రుణ సదుపాయం వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. కస్టమర్ల కోసం ఈ కొత్త విధానాన్ని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామని అన్నారు. దీంతో ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని పొందుతారు. ఈ డెబిట్ కార్డు ఇఎంఐతో వివిధ స్టోర్స్‌లో ఇఎంఐలలో వినియోగదారులు తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఈ క్రెడిట్ సౌకర్యం ఎక్కడ లభిస్తుంది?
ఈ ప్రత్యేకమైన డెబిట్ కార్డ్ ఆధారిత ఇఎంఐ రుణ విధానం దేశంలోని 1500+ నగరాల్లో 40,000 మంది వ్యాపారులు, దుకాణాలలో వర్తిస్తుంది. ప్రస్తుతం 4.5 లక్షల పైన్ ల్యాబ్ బ్రాండెడ్ పిఒఎస్ యంత్రాలు చలామణిలో ఉన్నాయి. వీటి ద్వారా చెల్లించవలసిన మొత్తాన్ని ఎస్‌బిఐ వినియోగదారులు ఇఎంఐలుగా మార్చుకోవచ్చు.

SBI launches debit card with EMI facility