Home Default ఎస్‌బిఐ లాభం 81% జంప్

ఎస్‌బిఐ లాభం 81% జంప్

SBI profit surges 81% to Rs 4,189 crore in Q1

 

జూన్ త్రైమాసికంలో లాభం రూ.4,189 కోట్లు
కలిసొచ్చిన ఎస్‌బిఐ లైఫ్ వాటా విక్రయం
5.44 శాతానికి తగ్గిన స్థూల ఎన్‌పిఎ

ముంబై : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. క్యూ1 (ఏప్రిల్‌జూన్)లో ఎస్‌బిఐ నికర లాభం 81 శాతం పెరిగి రూ.4,189.34 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.2,312.20 కోట్లు గా ఉంది. ఎస్‌బిఐ లైఫ్‌లో వాటాను అమ్మ డం వల్ల బ్యాంక్ మొత్తం రూ.1,539 కోట్లు సంపాదించింది. ఈ కారణంగా ఎస్‌బిఐ జీవిత బీమా సంస్థలో వాటా 57.60 శాతం నుండి 55.5 శాతానికి పడిపోయింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.26,641 కోట్లుగా ఉంది. అలాగే ఎస్‌బిఐ క్యూ1లో రూ.12,501.30 కోట్లు కేటాయించగా, ఇది మార్చి త్రైమాసికంలో చేసిన రూ. 13,495.08 కోట్ల కేటాయింపుల కన్నా తక్కువగా ఉంది.

అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9,182.94 కోట్ల కంటే ఎక్కువగా ఉందని బ్యాంక్ వెల్లడించింది. కోవిడ్ సంబంధిత ఖాతాల కోసం ప్రభుత్వ బ్యాంకు అదనంగా 1,836 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో కోవిడ్ 19కి సంబంధించిన మొత్తం కేటాయింపులు జూన్ 30 నాటికి రూ.3,008 కోట్లుగా ఉన్నాయి. జూన్ 30 నాటికి బ్యాంకు ప్రొవిజన్ కవరేజ్ రేషియో (పిసిఆర్) 86.32 శాతంగా ఉందని ఎస్‌బిఐ తెలిపింది. అప్పులు తగ్గడం వల్ల బ్యాంకు లాభాలు పెరిగాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ) 5.44 శాతానికి క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 7.53 శాతంగా ఉంది.

అదేవిధంగా బ్యాంక్ నికర ఎన్‌పిఎ ఏడాది క్రితం 3.07 శాతం నుండి 1.8 శాతానికి తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన చూస్తే, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 2,950.50 కోట్ల నుంచి ఈ త్రైమాసికంలో ఎస్‌బిఐ నికర లాభం 62 శాతం పెరిగి రూ .4,776.50 కోట్లకు చేరుకుంది.ఈ త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర ఆదాయం రూ.87,984.33 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 83,274.04 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 70,653.23 కోట్ల నుంచి ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .74,457.86 కోట్లకు పెరిగిందని స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.

SBI profit surges 81% to Rs 4,189 crore in Q1