Home జాతీయ వార్తలు పుట్టిన ఊరు క్షేమంగా చేరనివ్వండి

పుట్టిన ఊరు క్షేమంగా చేరనివ్వండి

SC order to central and state govts on migrants

 

వలసజీవులపై ఛార్జీల భారం మోపొద్దు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు
భోజనం మంచినీరు ఏర్పాట్ల బాధ్యత మీదే

న్యూఢిల్లీ: వలస కూలీల నుంచి ఎటువంటి ప్రయాణ ఛార్జీలు వసూలు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెలువరించింది.

కరోనా ఉత్పన్న లాక్‌డౌన్‌తో వలస కూలీలు స్వగ్రామాలకు తిరిగివెళ్లడం తీవ్ర అంశంగ మారింది. దీనిపై సుప్రీంకోర్టు గురువారం స్పందించింది. వలసకూలీలు బస్సుల్లో వెళ్లినా, రైళ్లలో ప్రయాణాలు చేసినా వారి నుంచి ఒక్క పైసా వసూలు చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. ప్రయాణాల సమయంలో వారికి ఉచితంగా భోజనం, మంచినీరు అందించాల్సి ఉంటుందని వివిధ రాష్ట్రాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తక్షణ ఆదేశాలను వెలువరించింది. జీవనోపాధిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వలసకూలీలు ఇప్పుడు ఎటువెళ్లలేని స్థితిలో ఉన్నారు. సంబంధిత రాష్ట్రాలు వారికి ఉచిత భోజన వసతి కల్పించాల్సి ఉందని న్యాయమూర్తులు అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. రాష్ట్రాలలో కానీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ చిక్కుపడి ఉన్న కూలీల పరిస్థితిని పట్టించుకోవాలని ధర్మాసనం సూచించింది.

వారివారి ప్రాంతాలకు వెళ్లే కూలీలు స్టేషన్లలో చిక్కులు ఎదుర్కోకుండా చూడాల్సి ఉందని రాష్ట్రాలను ఆదేశించింది. బస్సులు లేదా రైళ్లు వారికి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది , ఎంతకాలం వేచిచూడాల్సి ఉందనేది అందరకీ తెలిసేలా ప్రకటించాల్సి ఉంది. నోటీసు బోర్డులపై ప్రచురించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఏ స్టేషన్‌లలో సంబంధిత రాష్ట్రాలు వలసకూలీలకు భోజనం నీరు అందించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో రైల్వేబోర్డు ఈ బాధ్యత తీసుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వలస కూలీల సమస్యలపై వచ్చిన వార్తాకథనాలను సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

పేర్లు నమోదు అయ్యేలా చూడాలి
వలసకూలీలు స్వస్థలాలకు చేరుకునేందుకు వారి పేర్లు నమోదు చేసుకోవడంలో ఆయా రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరితగతిన వారు ప్రయాణాలకు వెళ్లేందుకు తగు ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. రైలు అయినా బస్సు అయినా ప్రతి చోటా వారిని సురక్షితంగా ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉంటుందన్నారు. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి కూలీలు వెళ్లుతున్నారు? వారి ప్రయాణాల పరిస్థితి ఏమిటనేది పూర్తి స్థాయి సమాచారంగా వెలువరించాల్సి ఉందని ధర్మాసనం ఆదేశించింది.

చేతిలో సరైన డబ్బులు లేకుండా పేద కూలీలు నానా అవస్థలు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. పనికి వచ్చిన ప్రాంతంలో పనిలేకుండా పోయిన దశలో కన్నూళ్లకు పోవాలనే తపన వారిలో ఉందని, ఈ క్రమంలో నిస్సహాయ కూలీలు ఎదుర్కొంటున్న కష్టాలు కన్నీళ్లపై తాము స్పందించాల్సి వస్తోందని ధర్మాసనంలో భాగమైన న్యాయమూర్తులు ఎస్‌కె పాల్, ఎంఆర్ షాలు వ్యాఖ్యానించారు. వలస కూలీల తిరుగు ప్రయాణాలపై రాష్ట్రాలూ , యుటిలు బాగానే వ్యవహరిస్తున్నాయని, ఇందులో సందేహం లేదని , అయితే కొన్ని లోపాలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ధర్మాసనం తెలిపింది.

వలసకూలీల ప్రయాణాలకు పేర్ల నమోదు, రవాణా, ఆహారం మంచినీరు కల్పించడంలో క్షేత్రస్థాయిలో వైఫల్యాలతో వలసకూలీలు నానా కష్టాలు పడాల్సి వస్తోందనే విషయం తమ దృష్టికి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వాలు ఈ అపశృతులను సవరించాల్సి ఉందని సూచించారు. వలస కూలీల పరిస్థితి, వారి ప్రయాణాల ఏర్పాట్లపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వివరణలతో శుక్రవారం నాటికి అఫిడవిట్లు దాఖలు చేసుకోవల్సి ఉందని తెలిపిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.

SC order to central and state govts on migrants