Wednesday, November 30, 2022

చటాన్‌పల్లిలో దిశ కమిషన్

- Advertisement -

SC panel visits encounter site near hyderabad

 

ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని, దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని పరిశీలించిన కమిషన్ 
ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న హెడ్‌కానిస్టేబుల్‌ను షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నించిన సభ్యులు
అక్కడ అంతా గడ్డి ఉన్నదని, దిశ హంతకులు పోలీసుల కళ్లలో ఎక్కడ మట్టికొట్టారని ప్రశ్న, కమిషన్‌కు వ్యతిరేకంగా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన

మనతెలంగాణ/హైదరాబాద్: దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన స్థలాన్ని సిర్పుర్కర్ కమిషన్ బృందం ఆదివారం నాడు పరిశీలించింది. ఈక్రమంలో షాద్‌నగర్ చేరుకున్న కమిషన్ సభ్యులు చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని, దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు నిందితుల ఎన్‌కౌంటర్ స్థలంలో క్షేత్రస్థాయి అంశాలను పరిశీలించారు. అదేవిధంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషన్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్‌ను ప్రశ్నించింది. నిందితులు చనిపోయిన స్థలంలో ఎక్కువగా గడ్డితో నిండి ఉందని, దీంతో పోలీసుల కళ్లలో మట్టి ఎక్కడ కొట్టారన్న విషయంమై సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో తీసిన ఫోటోలను కమిషన్ సభ్యులు కానిస్టేబుల్‌కు చూపెట్టారు. దిశపై అత్యాచారం చేసిన మహ్మద్ అరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు 2019 డిసెంబర్ 6న ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం విదితమే.

దిశపై అత్యాచారం హత్య చేసిన ఘటన స్థలంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై హక్కుల సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన వారంలోపులోనే సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు సుప్రీం కోర్టు మాజీ రిటైర్డ్ జడ్జి సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తుండగా సిబిఐ మాజీ చీఫ్ డిఆర్ కార్తికేయన్, ముంబై హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఈ కమిటిలో సభ్యులుగా ఉన్నారు. విచారణలో భాగంగా ఎన్‌కౌంటర్ ఘటనతో పాటు ఇతర కీలక అంశాలపై సిర్పుర్కర్ కమిషన్ సభ్యులు ఆగస్టు 21 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డి, రాచకొండ సిపి మహేశ్ భగవత్, అప్పటి సైబరాబాద్ సిపి సజ్జనార్, శంషాబాద్ డిసిపి ప్రకాశ్ రెడ్డిలతో పాటు పలువురిని ప్రశ్నించారు. అంతేకాకుండా ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబసభ్యుల నుంచి సాక్ష్యం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2022 ఫిబ్రవరి నెల లోపు సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక సమర్పించేందుకు సయామత్తమౌతోంది.

షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన :
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ బృందం షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లిలో పర్యటించిన అనంతరం ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ చేరుకున్నారు. అయితే కమిషన్ సభ్యులు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న క్రమంలో స్థానిక పోలీసులతో పాటు సిఆర్‌పిఎఫ్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వివిధ సంఘాల నాయకులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనలో భాగంగా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న సంఘాలు కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే కమిషన్‌ను రద్దు చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. కమిషన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో షాద్ నగర్ పోలీసులు ఆందోళనకారులతో చర్చించి వారిని అక్కడి నుంచి పంపించేశారు. కాగా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే కమిషన్ సభ్యులు దిశను హత్యాచారం చేసిన శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో గల ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లారు. దిశ తన ద్విచక్ర వాహనంతో నిలిచి ఉన్న ప్రాంతంతో పాటు ఆమెను అత్యాచారం చేసిన ప్రదేశాన్ని కమిషన్ సభ్యులు పరిశీలించారు.

SC panel visits encounter site near hyderabad

Related Articles

- Advertisement -

Latest Articles