Home జాతీయ వార్తలు నేషనల్ హెరాల్ఢ్ కేసులో సోనియా, రాహుల్‌కు తాత్కాలిక ఊరట

నేషనల్ హెరాల్ఢ్ కేసులో సోనియా, రాహుల్‌కు తాత్కాలిక ఊరట

Supreme Court

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వివాదానికి సంబంధించి పన్ను పునర్‌మదింపు కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సుప్రీంకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. ఆదాయ పన్ను(ఐటి) శాఖ గట్టిగా వ్యతిరేకించి నప్పటికీ ఈ కేసుకు సంబంధించి వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టరాదని సుప్రీంకోర్టు మంగళవారం తన మధ్యంతర ఉత్తర్వులో ఆదేశించింది. జస్టిస్ ఎకె సిక్రి సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదాయ పన్ను శాఖకు చర్యల నిలుపుదల ఉత్తర్వును జారీ చేస్తూ ఈ కేసు తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. రాహుల్, సోనియా గాంధీల ఆదాయాలకు సంబంధించి 2011-12 మదింపు సంవత్సరానికి అంచనాలు వేయడానికి, తుది ఉత్తర్వులు జారీచేయడానికి సైతం ఎటువంటి అభ్యంతరం లేనప్పటికీ దాన్ని అమలు చేయడం మాత్రం కుదరదని సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులో స్పష్టం చేసింది. కాగా, మధ్యంతర ఉత్తర్వుల జారీని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించగా, తమ ఉత్తర్వులు రెండు పక్షాలకు సమన్యాయం చేసేవేనని, ఈ కేసుపై సుదీర్ఘ విచారణకు వ్యవధి లేనందున మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. రాహుల్, సోనియా గాంధీల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పి చిదంబరం మధ్యంతర ఉత్తర్వులకు అనుకూలంగా వాదించారు.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే…దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఎజెఎల్)కు సంబంధించిన తమ పన్ను మదింపులను తిరిగి పరిశీలించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను సెప్టెంబర్‌లో కొట్టేసిన హైకోర్టు 2011-12 సంవత్సరానికి చెందిన రికార్డులను పరిశీలించడానికి ఆదాయ పన్ను శాఖకు ఆనుమతినిచ్చింది. ఎజెఎల్‌ను స్వాధీనం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు ఐటి శాఖ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామి ప్రత్యేక కోర్టులో దాఖలో చేసిన ఒక ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదును పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులపై ఐటి శాఖ దర్యాప్తు చేపట్టింది. ఇదే కేసులో వీరు ముగ్గురూ బెయిల్‌పై విడుదలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి బాకీ పడిన రూ 90.25 కోట్లను ఎజెఎల్ నుంచి రాబట్టే హక్కును పొందిన యంగ్ ఇండియన్(వైఐ) అనే లాభాపేక్ష రహిత సంస్థకు రూ 50 లక్షలు చెల్లించడం ద్వారా సోనియా, రాహుల్‌తోపాటు ఇతరులు మోసపూరిత కుట్రకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు సుబ్రమణియన్ స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2010 నవంబర్‌లో రూ 50 లక్షల పెట్టుబడితో స్థాపించిన వైఐ సంస్థ ఎజెఎల్ మొత్తం వాటాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ఎజెఎల్ బకాయిలు రూ 90 కోట్లు కూడా వైఐ పరమయ్యాయి.

SC provides Relief to Sonia