Saturday, April 20, 2024

ఉరిశిక్షల జోరుకు అడ్డుకట్ట

- Advertisement -
- Advertisement -

Bail for Kerala journalist Siddique Kappan

మరణ శిక్ష విధించక తప్పదనిపించే కేసుల్లో నాణేనికి రెండో వైపును కూడా లోతుగా పరిశీలించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉరిశిక్ష వేయకుండా ఉండడానికి ఉపయోపడే సానుకూల కారణాలను విధిగా అన్వేషించడానికి అన్ని కింది న్యాయస్థానాల(ట్రయల్ కోర్టులు)కు ఒకే రీతి విధివిధానాలను రూపొందించాలని భావించి అందుకోసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని నెలకొల్పాలని అది సోమవారం నాడు తీసుకున్న నిర్ణయం మహోన్నతమైనది, మానవీయమైనది. కింది కోర్టులు మంచినీళ్ల ప్రాయంగా ఉరి శిక్షను విధించే పద్ధతికి తెర దించే ఉద్దేశంతోనే భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నది. ఉరి శిక్షను అరుదైన వాటిల్లో అరుదైన కేసుల్లో మాత్రమే విధించాలని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం 1980లోనే బచన్ సింగ్ x పంజాబ్ ప్రభుత్వం కేసులో స్పష్టంగా దిశానిర్దేశం చేసింది. అయినా కింది కోర్టులు మరణ శిక్ష విధింపులో ఏపాటి నిగ్రహమూ పాటించడం లేదు. 2018లో అతి ఎక్కువ ఉరి శిక్షలు విధించిన ఏడు దేశాల్లో మన దేశం కూడా వుండడమే ఇందుకు నిదర్శనం. ఆ ఏడాది 162 ఉరి శిక్షలను దేశంలోని కింది కోర్టులు ప్రకటించాయి. మనది మానవ హక్కులను గౌరవించే ప్రజాస్వామిక దేశమైనప్పటికీ ఒక ఏడాదిలో వందకు మించిన ఉరి శిక్షలు విధించిన ఘనతను మూటగట్టుకోడంలో చైనా, ఈజిప్టు, ఇరాక్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, వియత్నాంల సరసన చేరిపోడం బాధాకరం. నేరస్థ రికార్డు వున్న వ్యక్తులకు మరణ శిక్ష విధించాలనే ఐపిసి 303 సెక్షన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినా దేశంలో ఉరి శిక్షల జోరు తగ్గడం లేదు. ఉరి శిక్ష విధించేటప్పుడు అందుకు దోహదపడే తీవ్రమైన నేరస్థ అంశాలనే న్యాయమూర్తులు రికార్డు చేస్తున్నారని ఏ పరిస్థితుల్లో వారు ఆ చర్యకు పాల్పడ్డారో, మరణ శిక్షతో సరిపెట్టడానికి దోహదపడే కారణాలేమైనా ఉన్నాయేమో తెలుసుకొని నమోదు చేయడానికి వారు శ్రద్ధ చూపడం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. నేరానికి పాల్పడినప్పటి నేపథ్యం ఏమిటో నిందితుల నుంచి తెలుసుకోడానికి ప్రాధాన్యమివ్వాలని భావించింది. శిక్ష ప్రకటించిన తర్వాత తమ పరిస్థితులను క్షుణ్ణంగా తెలియజేయడానికి నిందితులు సాహసించబోరని పేర్కొన్నది.

అందుచేత శిక్షను నిర్ధారించడానికి ముందే దాని తీవ్రతను వీలైనంత తగ్గించడానికి దోహదం చేసే కోణాలను పరిశీలించాలని సూచించింది. 1973లో జగ్‌మోహన్ సింగ్ x ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఉరి శిక్ష రాజ్యాంగం 14, 19, 21 అధికరణలకు ఉల్లంఘన అని నిందితులు వాదించారు. ఈ శిక్షతో ఆ వ్యక్తికి ఆర్టికల్ 19 1ఎ నుంచి జి వరకు గల రాజ్యాంగ హామీలన్నీ అక్కరకు రాకుండా పోతాయని, మరణ శిక్ష విధించడానికి న్యాయమూర్తులకు గల అపరిమిత అధికారాలు రాజ్యాంగం 14వ అధికరణకు ఉల్లంఘన అని అన్నారు. అయితే ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వారి వాదన తిరస్కరించి ఉరి శిక్షను ఖరారు చేసింది. బచన్ సింగ్ కేసులో మరణ శిక్ష అరుదైన వాటిలో అరుదైన కేసుల్లో మాత్రమే విధించాలన్న సుప్రీం ఆదేశం వెలువడిన తర్వాత ఈ కేసుల్లో మానవీయ ఆలోచనకు ప్రాధాన్యం పెరిగింది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ పరంగా చూసినా, ఆర్థిక వెనుకబాటుతనం, పురుషాధిపత్య సామాజిక వైఖరులపరంగా గమనించినా నిందితుల నేపథ్యం హత్య వంటి హీనమైన నేరాలకు పురికొల్పే అవకాశం మన సమాజంలో వుంది. నేరస్థుల సామాజిక పరిస్థితులను దృష్టి లో వుంచుకొని ఉరి శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చిన సందర్భాలున్నాయి. 70 దేశా ల్లో ఉరి శిక్షను రద్దు చేశారు. అమెరికాలోని 23 రాష్ట్రాల్లో దాని ఉనికి లేదు. ఉరి శిక్షల వల్ల అటువంటి నేరాలు జరగకుండా ఆగిపోయాయా అంటే ఆ దాఖలాలేమీ బొత్తిగా కనిపించడం లేదు. ఎందరికి ఎన్ని మరణ శిక్షలు విధించినా హత్యాచారాలు, సామూహిక వధలు వంటివి జరుగుతూనే వున్నాయి. సమాజం ప్రజాస్వామిక నీతి నియమాలను గౌరవించి నడచుకునే స్థాయికి పరిణతి చెందనంత వరకు, ఫ్యూడల్ పురుషాధిపత్య సంప్రదాయాలను, దురహంకారాలను విడనాడనంత వరకు తీవ్రమైన నేరాలు జరుగుతూనే వుంటాయి. మన రాజ్యాంగం బోధిస్తున్న సమానత్వ, సెక్యులర్ జీవన విధానాన్ని దేశంలోని మెజారిటీ ప్రజలు అలవరుచుకునేలా చేయడమే ముఖ్య కర్తవ్యం. ఉరి శిక్షల విషయంలో కింది కోర్టుల న్యాయమూర్తులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా అడ్డుకట్ట వేయడానికి సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం.

SC refers to larger bench to frame guidelines for courts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News