Wednesday, April 24, 2024

పిజి ఫైనల్ ఇయర్ మెడికల్ ఎగ్జామ్స్ రద్దు, వాయిదాకు ‘సుప్రీం’ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

SC refuses to cancel, postpone PG final year Medical exams

న్యూఢిల్లీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం చదువుతున్న వైద్యులు కొవిడ్-19 విధులను నిర్వహిస్తున్న కారణంగా వారి పరీక్షలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని వైద్య విశ్వవిద్యాలయాలకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. చివరి సంవత్సరం పిజి పరీక్షలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని దేశంలోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాలను ఆదేశిస్తూ తాము ఎటువంటి ఉత్తర్వులు జారీచేయలేమని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన వెకేషన్ బెంచ్ తెలిపింది.

చివరి సంవత్సరం పరీక్షలను తేదీలను ప్రకటించే సమయంలో దేశంలో కొవిడ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే దేశంలోని వైద్య విశ్వవిద్యాలయాలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసి) సూచనలు అందచేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులయ్యేందుకు వారికి తగిన సమయం ఇవ్వకుండా పరీక్షల తేదీని ప్రకటించినందునే న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించే ఐఎన్‌ఐ సెట్ పరీక్షను నెలరోజుల పాటు వాయిదా వేసే విషయంలో తాము జోక్యం చేసుకున్నామని ధర్మాసనం తెలిపింది.

పరీక్షలకు సింసిద్ధులయ్యేందుకు వారికి తగిన వ్యవధిని యూనివర్సిటీలు ఇవ్వాలని ఎన్‌ఎంసికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 29 డాక్టర్ల తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. భారత్ వంటి పెద్ద దేశంలో కరోనా పరిస్థితి అన్ని చోట్ల ఒకేలా ఉండదని, ఏప్రిల్-మే నెలలో ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పుడు రోజుకు 200 కేసులు మించి నమోదు కావడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కర్నాటకలో ఇప్పటికీ పరిస్థితి బాగా లేదని, ఈ కారణంగా యూనివర్సిటీల వాదన వినకుండా తాము ఎటువంటి ఉత్తర్వులు జారీచేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఎన్‌ఎంసి తరఫున న్యాయవాది గౌరవ్ శర్మ తన వాదన వినిపిస్తూ దేశంలోని డాక్టర్లందరూ కొవిడ్ విధులలో లేరని చెప్పారు. సంబంధిత ప్రాంతాలలో కొవిడ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పిజి చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహంచాలని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అన్ని వైద్య విశ్వవిద్యాలయాలకు ఎన్‌ఎంసి సలహా ఇచ్చిందని ఆయన తెలిపారు. కాగా.. కొవిడ్ విధులలో ఉన్న డాక్టర్లు పిజి పరీక్షలకు సిద్ధం కానందువల్ల సీనియర్ రెసిడెంట్ డాక్టర్లుగా మారడానికి అవకాశం కలగదని డాక్టర్ల తరఫు న్యాయవాది హెగ్డే విన్నవించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పరీక్షలకు హాజరుకాకుండా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లుగా ప్రమోషన్ పొందడానికి తాము అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News