హాకీని జాతీయ క్రీడగా గుర్తించాలన్న పిల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: హాకీని జాతీయ క్రీడగా అధికారికంగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని తగు రీతిలో తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. క్రికెట్ వల్ల హాకీ తన ప్రాభవాన్ని కోల్పోతోందని.. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విశాల్ తివారీ తన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని, పిటిషనర్ కోరిన విధంగా తాము కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల్లో ప్రజల్లో చైతన్యం రావాలని అభిప్రాయపడింది. మహిళా బాక్సర్ మేరీ కోమ్ వంటి క్రీడాకారిణులు ప్రతికూల పరిస్థితుల్లోను రాణించారని, ఆ స్ఫూర్తి ఆందరిలోను కనిపించాలని పేర్కొంది. బెంచ్ ఆదేశాలతో విశాల్ తివారీ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.