Tuesday, April 16, 2024

రుణాల వడ్డీ మాఫీఫై సమాధానమివ్వండి

- Advertisement -
- Advertisement -

SC seeks finance ministry reply on waiver of interest on loans

 కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు సుప్రీం కోర్టు ఆదేశాలు
ఇది తీవ్రమైన సమస్య అన్న ధర్మాసనం
జూన్ 12కు విచారణ వాయిదా

న్యూఢిల్లీ : మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ మినహాయింపుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమాధానమివ్వాలని గురువారం సుప్రీం కోర్టు కోరింది. ఇఎంఐలపై బలవంతపు వడ్డీ మాఫీ వివేకవంతమైన చర్య కాదని, ఇది బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేస్తుందని ఆర్‌బిఐ చెప్పిన తర్వాత సుప్రీం కోర్టు ప్రభుత్వం సమాధానమివ్వాలని పేర్కొంది. ఇఎంఐలపై మార్చి నెల నుంచి ఆరు నెలలపాటు ఆర్‌బిఐ మారటోరియం ఇచ్చింది. ఈ కేసు లో రెండు అంశాలు పరిశీలనలో ఉన్నాయని కోర్టు తెలిపింది.

ఒకటి మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ వసూలు చేయకూడదు, రెండోది రుణాల వడ్డీపైనా వడ్డీ వేయొద్దనే అంశాలు కోర్టు విచారిస్తోంది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం కేసు విచారణ సందర్భంగా ఇది ఒక సవాలు సమయం అని, ఇది తీవ్రమైన సమస్య అని పేర్కొంది. ఎందుకంటే ఒక వైపు ఇఎంఐ వాయిదా వేస్తూనే, మరోవైపు రుణంపై వడ్డీ వసూలు చేస్తున్నారు. మార్చి 27 రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని గజేంద్ర శర్మ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం విచారించింది.

మారటోరియం సమయంలో రుణ మొత్తానికి వడ్డీ వసూలు చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఆగ్రాలో నివసిస్తున్న శర్మ కూడా తన పిటిషన్‌లో మారటోరియం కాలంలో రుణంపై వడ్డీ వసూలు చేయకుండా ఊరటనిచ్చేలా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకును ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఈ విషయంలో ఆర్థిక మంత్రి త్వ శాఖ సమాధానం ఇవ్వనుందని, దీనికి సమయం అవసరమని అన్నారు. అయితే పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా మాట్లాడుతూ, ఇప్పుడు పరిస్థితి స్పష్టంగా ఉందని, బ్యాంకు లాభా లు ప్రధానమని రిజర్వ్ బ్యాంక్ చెబుతోందని అన్నారు.

నాన్ షెడ్యూల్డ్ ఎయిర్ ఇండియా విమానాలలో మిడిల్ సీటు బుక్ చేసుకునే విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాజీవ్ దత్తా ఉదహరించారు. ఈ కేసులో ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువేం కాదని కోర్టు తెలిపిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ఏమిటంటే, దేశం మొత్తం కరోనా వైరస్ అంటువ్యాధితో బాధపడుతున్నా, బ్యాంకులు మాత్రం లాభపడాలనే అర్థం ఉందని దత్తా అన్నారు. వడ్డీ మాఫీతో బ్యాంకులు రూ.2.01 లక్షల కోట్లు నష్టపోవాల్సి ఉంటుందని, అంటే ఇది దేశీయ జిడిపిలో ఇది 1 శాతమని రిజర్వు బ్యాంక్ సుప్రీంకోర్టుకు తెలిపింది.

జూన్ 12న తదుపరి విచారణ

ఈ కేసులో జూన్ 12 లోగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానమివ్వాలని కోర్టు సోలిసిటర్ జనరల్ మెహతాను కోరింది. అలాగే పిటిషనర్, ఇతర పార్టీలు కూడా సమాధానాలను ఈ సమయంలోగా దాఖలు చేయడానికి ధర్మాసనం అనుమతించింది. కేసు విచారణ ప్రారంభమైన వెంటనే, రిజర్వ్ బ్యాంక్ సమాధా నం కోర్టుకు రాకముందే మీడియాకు లీక్ కావడంపై ధర్మాసనం దృష్టికి వచ్చింది. ‘రిజర్వ్ బ్యాంక్ తన సమాధానం మొదట మీడియాలో, తరువాత కోర్టులో దాఖలు చేస్తుందా? ప్రశ్నించింది. ఇది మొత్తం కేసు ను సంచలనాత్మకం చేసే ప్రయత్నం అని దత్తా అన్నా రు. ఇది చాలా ఖండించదగిన ప్రవర్తన అని, పునరావృతం చేయకూడదని ధర్మాసనం పేర్కొంది.

SC seeks finance ministry reply on waiver of interest on loans

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News