Home జాతీయ వార్తలు వలస కార్మికుల సమస్యలపై కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీం

వలస కార్మికుల సమస్యలపై కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీం

Supreme Court

 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కన్నా కార్మికుల వలసే పెద్ద సమస్యగా తయారైందని, ఈ పరిస్థితుల్లో వలసలను నివారించడానికి ఏయే చర్యలు తీసుకుంటున్నారో మంగళవారానికి నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం కోరింది. లాక్‌డౌన్ వల్ల భారీగా స్వగ్రామాలకు తరలి వెళ్తున్న వలస కార్మికుల విషయమై చేపట్టిన విచారణలో సుప్రీం కోర్టు ఈమేరకు కేంద్రాన్ని నివేదిక కోరింది. దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా చీఫ్ జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, ఈ విచారణ చేపట్టారు. ఏదైనా ఆదేశాలు ఇచ్చే ముందు కేంద్రం నుంచి నివేదిక కోసం తాము వేచి ఉంటామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో వేలాది మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారని, వారికి ఆహారం, మంచినీళ్లు, మందులు, సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ న్యాయవాదులు అలఖ్ అలోక్ శ్రీవాస్తవ, రష్మీబన్సాల్ పిటిషన్లు వేర్వేరుగా సుప్రీంకోర్టుకు దాఖలు చేశారు.

కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కరోనా నియంత్రణ కోసం వలసలను ఆపాల్సిన అవసరం ఉందని, కేంద్రంతోపాటు రాష్ట్రాలు ఈమేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. వివిధ వార్తా కథనాలను ఉదహరిస్తూ శ్రీవాస్తవ రాష్ట్రాల మధ్య వలస కార్మికుల విషయంలో సమన్వయం, సహకారం లోపించిందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేసినా ఇప్పుడు ఆపేసిందని చెప్పారు. మరో పిటిషనర్ బన్సాల్ వలస కార్మికులకు వైద్య సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు అవసరమని వాదించారు. కార్మికులు ఉండే చోట శానిటైజర్లను వెదజల్లాలని, మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఇందులో చేర్చి భోజన సౌకర్యం కార్మికులకు కల్పించాలని సూచించారు.

SC seeks report from Centre on migration workers