Friday, April 19, 2024

మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసు

- Advertisement -
- Advertisement -
SC show cause to Maharashtra Assembly Secretary
ఆర్నాబ్‌కు లేఖ రాయడంపై తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: అరెస్టుపై హౌస్ నోటీసు గురించి సుప్రీంకోర్టుకు తెలియచేయవద్దని హెచ్చరిస్తూ జర్నలిస్టూ ఆర్నాబ్ గోస్వామికి లేఖ రాయడంపై మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శికి సుప్రీంకోర్టు శుక్రవారం షోకాజ్ నోటీసు జారీచేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో రెండు వారాలలో సంజాయిషీ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఈ నోటీసులో ఆదేశించింది. మహారాష్ట్ర శాసనసభ గతంలో చేపట్టిన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానంలో ఆర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయకుండా రక్షణను ప్రసాదించిన సుప్రీంకోర్టు అక్టోబర్ 13వ తేదీన అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఆర్నాబ్ గోస్వామికి అసెంబ్లీ కార్యదర్శి రాసిన లేఖ సారాంశాన్ని గోస్వామి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ప్రస్తావించగా చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చాలా గోప్యమైనవని, వాటిని వెల్లడించరాదని చెబుతూనే అసెంబ్లీ కార్యదర్శి ఆ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కారణంగా పిటిషనర్‌ను(ఆర్నాబ్ గోస్వామి) బెదిరించడానికే ఆ లేఖ రాసినట్లు కనపడుతోందని, ధర్మాసనం పేర్కొంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి వార్తా కథనాన్ని ప్రసారం చేసినందుకు మహారాష్ట్ర శాసనసభ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని చేపట్టేందుకు తనపై జారీచేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ఆర్నాబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. రాజ్‌పుత్ కేసుపై న్యూస్ డిబేట్స్ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై చేసిన కొన్ని వ్యాఖ్యలపై గోస్వామికి అసెంబ్లీ షోకాజ్ నోటీసు జారీచేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News