Tuesday, September 26, 2023

కేంద్రంతో అయ్యేలా లేదు.. కమిటీ వేస్తాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం జరిపే చర్చలు ఫలించేలా కనిపించడం లేదన్న కోర్టు వివాద పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సామాన్య జనజీవనానికి ఇబ్బందిగా మారిందని, తక్షణమే వారిని ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. రిషబ్ శర్మ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనితో పాటుగా రైతుల ఆందోళనలకు మద్దతుగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిపై ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్‌ఎ బొపన్న, వి రామసుబ్రమణియన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళనలపై కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరు(కేంద్రం) విశాల దృక్పథంతో చర్చలు జరపనంతవరకు అవి విఫలమవుతూనే ఉంటాయి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతులతో కేంద్రం చర్చలు ఫలించేలా కనిపించడం లేదని, త్వరలోనే ఇది జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందని జస్టిస్ బోబ్డే అన్నారు. అందుకే వివాద పరిష్కారానికి రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానానికి తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులను స్తంభింపజేస్తున్న ఏ రైతు సంఘంతో చర్చలు జరుపుతున్నారో పేర్లు చెప్పాలని ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించగా, ప్రభుత్వం చర్చలు జరుపుతున్న సంఘాల పేర్లు ఇవ్వగలనని తుషార్ మెహతా చెప్పారు. అంతేకాదు, రైతుల ఉద్యమాన్ని ఎవరో హైజాక్ చేసినట్లుగా కనిపిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్లపై కేంద్రప్రభుత్వం, రైతు సంఘాలకు నోటీసులు ఇచ్చింది. దీనిపై గురువారం లోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. రైతుల ఆందోళనలపై అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News