తప్పేమి లేదని తేల్చిచెప్పిన సుప్రీం
మహారాష్ట్ర సర్కారు, దేశ్‌ముఖ్‌కు షాక్
వివరణ లేకుండా దర్యాప్తుపై వాదనలు
న్యూఢిల్లీ: రూ 100 కోట్ల వసూళ్ల వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముంబై పోలీసు కమిషనర్ చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తును దేశ్‌ముఖ్ , రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. సవాలు చేశారు. అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులపై వచ్చే ఆరోపణలు , పైగా వాటి స్వరూప స్వభావాల, తీవ్రత కోణంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ అవసరం అని తాము భావిస్తున్నట్లు న్యాయమూర్తులు ఎస్కె కౌల్, హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ప్రజలలో అధికారిక వ్యవస్థపై సరైన విశ్వాస పునరుద్ధరణకు దర్యాప్తు జరగాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
సిబిఐ నుంచి ప్రాధమికదర్యాప్తు జరగాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయినా ఇప్పుడు జరిగేది మౌలిక దర్యాప్తు, ఈ విషయంలో ఎటువంటి తప్పు లేదు. సీనియర్ మంత్రిపై సీనియర్ అధికారి, అదీ శాఖా సంబంధితులు. తీవ్రస్థాయి ఆరోపణలు వెలువడ్డ నేపథ్యంలో అపోహలు , అనుమానాలు తలెత్తకుండా చేసేందుకు సిబిఐ వంటి సంస్థల దర్యాప్తు ఉపయోగపడుతుందని ధర్మాసనం తెలిపింది. అయితే సంబంధిత అధికారి అసంబద్ధమైన ఆరోపణలను మౌఖిక స్థాయిలో చేశాడని, ఎటువంటి ఆధారాలు లేకుండా చేసిన వీటిని ప్రేలాపనలుగా భావించాల్సి ఉంటుందని దేశ్‌ముఖ్ తరఫు న్యాయవాదుల బృందం పేర్కొంది. అయినా తమ క్లయింట్ వివరణ తీసుకోకుండానే ముంబై హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు. మంత్రి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తమ వాదన విన్పించారు. రాజ్యాంగపరమైన అధికారిక వ్యవస్థపై ఆరోపణలకు దిగడం, పైగా దర్యాప్తునకు కోరడం వంటి పరిణామాల దశలో న్యాయస్థానం నుంచి సరైన విధంగా తమకు రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది కదా అని సిబల్ పేర్కొన్నారు.
ఆరోపణలకు సరైన ప్రాతిపదిక ఉండాలి. ఏదైనా ఆధార పత్రం లేదా సాక్షం చూపించాలి, అయితే ఇటువంటిదేమీ లేదని, కేవలం సదరు వ్యక్తి మంత్రిపై మౌఖిక దాడికి దిగినట్లుగా ఉందని న్యాయవాది తెలిపారు. అయితే ఈ కేసులో సంబంధిత వ్యక్తులు ఇద్దరిలో ఒకరు పోలీసు కమిషనర్ కాగా , మరొకరు హోం మంత్రి అని ( తరువాత రాజీనామా చేశారు) , ఇరువురూ వేరు దారులు పట్టేవరకూ కలిసే పనిచేశారని సుప్రీంకోర్టు తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎ ఎం సింఘ్వీ హాజరయ్యారు. సిబిఐ దర్యాప్తు డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చిందని, అటువంటి దశలో దర్యాప్తునకు ఇతర మార్గంలో సమ్మతి దక్కడం తమకు బాధకల్గించే విషయం అయిందని తెలిపారు. అయితే తాము అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, దర్యాప్తు వల్ల ఆరోపణలకు సంబంధించి కీలక ప్రాధమిక విషయాల నిగ్గు తేలేందుకు వీలేర్పడుతుందని భావించి ఈ పిటిషన్లను కొట్టివేయాల్సి వస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది.