న్యూఢిల్లీ : అనర్హత వేటు పడిన కాంగ్రెస్ జనతాదళ్ (ఎస్)కు చెందిన 17 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నవంబర్ 13న తీర్పు చెప్పవలసి ఉంది. తమను అనర్హులుగా ప్రకటిస్తూ ఆనాటి అసెంబ్లీ స్పీకర్ కెఆర్ రమేష్‌కుమార్ ఇచ్చిన ఆదేశాన్ని ఎంఎల్ఏలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. న్యాయమూర్తులు ఎన్వి రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అక్టోబర్ 25న ఈ ఎంఎల్ఎల పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది. కాంగ్రెస్ జెడి (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కొద్ది రోజు ల్లో అసెంబ్లీలో విశ్వాసపరీక్షను ఎదుర్కోబోయే తరుణంలో స్పీకర్ కుమార్ జూలైలో అధికారపక్షానికి చెందిన 17 మంది శాసన సభ్యుల్ని అనర్హులుగా ప్రకటించారు.
దాంతో విశ్వాసపరీక్షలో ఓడిపోయిన అప్పటి ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి రాజీనామా చేశారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బిఎస్ యెడియూరప్ప నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎంఎల్ఎలపై అనర్హత వేటు పడడంతో కర్ణాటకలో 17 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిలో 15 సీట్లకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అనర్హత వేటుపడిన వారికి ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్‌లేదు. కాబట్టి తమ పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు అసెంబ్లీ ఉపఎన్నికల్ని వాయిదా వేయమని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ 17 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.