Home తాజా వార్తలు 26న కొత్తగూడెంలో 4 కేంద్రాల్లో పరీక్షలు : సింగరేణి

26న కొత్తగూడెంలో 4 కేంద్రాల్లో పరీక్షలు : సింగరేణి

SCCL Electrician trainee exams at kothagudem

 

మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కాలరీస్‌లో ఎలక్ట్రిషియన్ ట్రైయినీ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 26వ తేదీ (ఆదివారం) నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు పేర్కొంది. మొత్తం 51 పోస్టులకు 3232 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం కొత్తగూడెంలోని నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు జిఎం(పర్సనల్) అనందరావు తెలిపారు. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కాలేజీ, సింగరేణి హైస్కూల్, అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

మోటర్ మెకానిక్ పోస్టు మినహా అన్ని పరీక్షలు పూర్తిచేశామని వెల్లడించారు. సింగరేణిలో మొత్తం 372 పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇందులో 128 ఫిట్టర్, 51 ఎలక్ట్రిషియన్, 54 వెల్డర్, 22 టర్నర్, మెషినిస్టులు, 14 మోటర్ మెకానిక్, 19 షౌల్డర్, 84 మంది స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయన్నారు. ఇప్పటికే పలు పోస్టులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. త్వరలోనే 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి పేరు చెప్పి మోసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

SCCL Electrician trainee exams at kothagudem