Home ఎడిటోరియల్ లింగభావ విస్మరణ, స్మరణ, స్ఫురణ

లింగభావ విస్మరణ, స్మరణ, స్ఫురణ

womens

కార్యసాధన, దృఢసంకల్పం, పోటీతత్వం, తెగింపు మగజాతి లక్షణాలని, ఆడువారు జన్మతః అబలలేనని పురుష ప్రపంచ సిద్ధాంతం. ఆడమగ తేడాలు గుర్తించని స్త్రీలు రాణించారు. మరవని మహిళలు ద్వితీయ శ్రేణి జీవులయ్యారు. భేదాలు తప్పనిసరి జన్మసిద్ధ ఆజన్మ విలక్షణ అధోకరణలని భావించే వనితలు బానిసల్లా బతికారు. ఈ భిన్నత్వంతో పురుషులు పుంగవులయ్యారు. తేడాలను వాడుకొని ఆడువారిని అన్ని విధాలా దోపిడీ చేస్తున్నారు.
మగాధిపత్యం: ఆడమగ తేడాలు శారీరకం. జీవపరిణామంలో సంతానోత్పత్తికి, పోషణకు అణువుగా వచ్చిన మార్పులే. మనుష్య లక్షణాలు స్త్రీపురుషులకు సమానమే. సంప్రదాయ ఛాందసం తేడాలు సృష్టించింది. ఆదిమ సమాజంలో ఆడువారు మగవారితో సమానంగా పనిచేసేవారు. తమకోసమేకాక సంతానం కోసం కూడా ఆహారం సంపాదించేవారు. వ్యవసాయం కనిపెట్టింది మహిళలే. కండబలంలో, సామాజిక యుద్ధవిద్యల్లో, పాండిత్యంలో, స్త్రీలు మగాళ్ళకు దీటుగా కొండొకచో ఆధిక్యంగా ఉండేవారు. అందుకే ఆదిశక్తులయ్యారు. సీత శివధనుస్సును అలవోకగా ఎత్తడం, నరకాసుర సంహారంలో సత్యభామ సహకారం, ద్రౌపది విచక్షణ వంటి విషయాలు కవులు వర్ణించారు.
స్త్రీపురుష శరీర నిర్మాణంలో మార్పు లేదు. శారీరక, మేధో ప్రావీణ్యతలు సాధించిన సాధ్వీమణులు కోకొల్లలు. మారిన సమాజంలో మహిళలు కొన్ని పనులకే పరిమితం చేయబడ్డారు. అలవాటు తప్పి అల్పత్వం పొందారే గాని శరీరతత్వంతో కాదు. నేడు కుటుంబం పురుష నియంత్రితమే. తల్లిదండ్రులు లింగ భేదాలతో పిల్లలను పెంచుతారు. విద్యావిధానం పురుష చట్టనిర్మాతలదే. విద్యాలయాలు లింగ సమానతలు బోధించవు. వనితా వివక్షతను పోషిస్తాయి. మతాలు, మత గ్రంధాలు మగాళ్ళ సృష్టే. వాళ్ళ భావాలు, అహంభావాలు, ఆధిపత్యాలు, అవసరాలను ప్రతిబింబిస్తాయి. సంప్రదాయం ముసుగులో మగ రుగ్మతలు, ఆచార అలవాట్లను సమర్థిస్తాయి. కుటుంబం, మతతాత్వికతలు, విద్యాలయాల విస్తృతరూపమే సమాజం. భిన్నంగా ఉండలేదు? ఈ సమాజ ఉత్పత్తులైన సాహిత్యం, సంస్కృతి, కళారూపాలు, మాధ్యమాలు, తాత్వికత, పాలకులు పురుషానుకూలాలే.
లింగ సారూప్యతల మాన్యత: స్టాన్ ఫోర్డ్ పరిశోధన విశ్వవిద్యాలయ సహాయక ఆచార్యులు ఆష్లీ మార్టిన్, కొలంబియా పరిశోధన విశ్వవిద్యాలయ ఆచార్యులు కాథరిన్ ఫిలిప్స్ ‘లింగభావ విస్మరణ, లింగ విలక్షణత’ అంశంపై పరిశోధనలు జరిపారు. లింగభావాన్ని పట్టించుకోని మహిళలు ప్రయోజనం పొందుతారని నిర్ధారించారు. వనితల విలక్షణతలను విశేషంగా స్వీకరించిన స్త్రీల కంటే స్త్రీపురుష సారూప్యతలపై దృష్టి సారించిన మహిళలు ఎక్కువ సాధికారితను, ఆత్మవిశ్వాసాన్ని అనుభవించారు. లింగ వ్యత్యాసాన్ని పట్టించుకోని మహిళలు తమ కార్యక్షేత్రాలలో సమస్యలను అధిగమించగలిగారు. లింగ లక్షణాలలో ఇతరులతో ఏకీభవించనందువల్ల సమర్థవంతంగా, సౌకర్యంగా ప్రవర్తించ గలిగారు.
కష్టనష్టాల, సమస్యామయ, ప్రమాదకర పనులను ధైర్యంగా చేపట్టారు. కార్యనిర్వహణలో చొరవ చూపారు. చర్చల్లో నిర్భయంగా పాల్గొని విజయవంతంగా సమన్వయం సాధించారు. పురుషాధిక్య వాతావరణంలో మగవారి మధ్య పనిచేసే సందర్భాలలో ఈ ప్రభావాలు మరింత బలంగా పనిచేశాయి. సమానత్వ సాధనలో లింగ సారూప్యత, వివక్షతలు రెండూ వ్యూహాలే. లింగ వివక్షతను గుర్తించి, స్వీకరించి, ప్రచారంచేసే నమ్మకాలు, పద్ధతులే లింగ వైరుధ్యాలు. లింగ సారూప్యతల మాన్యత దీనికి వ్యతిరేకం. దీని ఉద్దేశం భేదాల నిర్లక్ష్యం కాదు. వాటిని ప్రభావ రహితం చేయడం. ఇతర ప్రాతిపదికల కంటే వాటికి తక్కువ ప్రాముఖ్యతనివ్వడం. సారూప్యతలమీద దృష్టి సారించడం. వ్యక్తిత్వాన్ని గుర్తించడం. వ్యక్తిని మహిళగా వేరుచేయడం కాదు. ప్రత్యేక పరిపూర్ణ వ్యక్తిగా తయారుచేయడం. రెండూ మంచి ఉద్దేశాలే అయినా సారూప్యతల ఆమోదం మరింత సానుకూలం. మహిళల లింగ సారూప్యతల మాన్యతా గుణం లింగలక్షణ బంధాన్ని తెంచింది. మానవ లక్షణాలను లింగరహితం చేసింది. మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కఠిన కార్యక్రమాలకు కూడా వారిని సమాయత్తం చేసింది. లింగ వైరుధ్యాన్ని మన్నించమని మహిళలకు బోధిస్తారు. సారూప్యతల మాన్యత సహజ విరుద్ధంగా పరిగణిస్తారు. పురుష వైవిధ్య అంగీకారం సమస్య కాదు.
ఆడువారిని అణగదొక్కే అర్థం పర్థంలేని మగ మహారాజుల స్త్రీవివక్షతలు అసలు సమస్య. వ్యక్తిత్వం, అభిరుచులు, సామర్థ్యాలు మొదలగు సహజ లక్షణాలలో తేడాగా చూడడం బాధాకరం. ఈ ప్రాథమిక లక్షణాలలో స్త్రీపురుషుల మధ్య సహజ విలక్షణతలు ఉండవు. సమాన అవకాశాలు, అనుభవం, ఆచరణలు కలుగజేస్తే స్త్రీలు మగాళ్ళకు ఏమాత్రం తీసిపోరు. అయితే ఈ లక్షణాలు పురుష నాయకత్వ గుణాలుగా భావించబడతాయి. సారూప్యతలను ఆమోదించిన మహిళలు ఈ ఇంద్రియ జ్ఞానాల అవగాహనల్లో దీటుగా నిలిచారు. నాయకత్వ స్థానాల్లో విజయాలు సాధించారు.
మహిళా సామర్ధ్యాలు: వనితలు శారీరక భిన్నత్వాన్ని ఆమోదిస్తున్నారు. విభిన్న బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంటి చాకిరీ ఇల్లాలిదేననడం సరికాదు. ఐరోపా, స్కాండినేవియన్ సమాజాలలో ఇంటి వంట పనులు, పిల్లల పోషణలలో స్త్రీపురుష తేడాలుండవు. సమసమాజ దేశాలలో మహిళాసాధికార చట్టాలు చేశారు. పురుషాధిపత్యం రుద్దిన సామాజిక అసమానతలనే వనితలు విరోధిస్తున్నారు. పురుషాధారిత యోగ్యతల నిర్ణయాలు సరికాదు. వాటి ఆధారంగానే పాలకవిధానాలు రూపొందుతున్నాయి.
ఉపాధుల్లో, ఉద్యోగాల్లో ఈ పద్ధతులే పాటించబడుతున్నాయి. ఫలితంగా మహిళల అవకాశాలు దెబ్బతింటున్నాయి. పని స్థలాలలో స్త్రీల పట్ల పురుష ప్రవర్తన అమానవీయం అయింది. అతివలను అధోగతి పాలుజేసే ఈ ప్రహసనాలు సమాజానికే అపాయకరం. శారీరక తేడాల ఆధారంగా స్త్రీల యోగ్యతలు, సామర్థ్యాలు, ప్రవర్తనలు ఆధారపడి ఉంటాయన్న ఆలోచన అర్థరహితం. లింగవిభేద విస్మరణ మహిళలు మగాళ్ళలాగా ప్రవర్తించాలని కోరుకోదు.
కొన్ని లక్షణాలు, గుణాలు స్త్రీపురుష అనుబంధాలన్న భావన, మానవత్వ స్త్రీత్వీకరణ పోవాలంటుంది. ఆమాటకొస్తే లింగవిభేద స్మరణ, స్ఫురణలు సామాజిక రుగ్మతలను, మానవ లక్షణాలను లింగాధారితంగా ప్రమాణీకరిస్తున్నాయి, సమాజాన్ని విభజిస్తున్నాయి. లింగవిభేద విస్మరణ రుజువులతో, శాస్త్రీయ దృక్పథంలో సమాజాన్ని ధృవీకరిస్తుంది. లింగవిభేదాలు ప్రామాణికతను నిర్వచించరాదు. ఆత్మవిశ్వాసంతో అనేక విజయాలు సాధించిన మహిళలు లింగవిభేదాలను విస్మరించినవారే. ఈ భావన మగాళ్ళను కించపరచడానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి కాదు. పురుషులు ఆత్మన్యూనతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తులనాత్మకంగా స్త్రీలు స్థిరచిత్తులు. భారత్ లో పురుషుల ఆత్మహత్యలు స్త్రీల ఆత్మహత్యలకు రెట్టింపు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని వయసులవారీగా సవరించింది. వీటి ప్రకారం కూడా పురుషుల ఆత్మహత్యల శాతం (లక్షమంది జనాభాలో ఆత్మహత్యలు) 25.8, స్త్రీల శాతం 16.4. మన పుణ్యభూమిలో ఆడువారి హత్యలు కూడా అధికమే. భర్తల ఆత్మహత్యలు, సారామరణాలతో ఒంటరివారైన్ స్త్రీలు కుటుంబాలను పోషిస్తున్నారు. పిల్లలను ప్రయోజకులను చేస్తున్నారు. జీవన ప్రక్రియల్లో మగాళ్ళు అతి విశ్వాసంతో ఉంటారు. అతివలు తమ శక్తిసామర్థ్యాలను కచ్చితంగా అంచనా వేసుకుంటారు. ఏకకాలంలో పలు పనులు చేయగలరు. ఈ విషయాలను పరిశోధనలు నిర్ధారించాయి.
మానవత్వం: లింగవిభేద విస్మరణ లింగవివక్షతను ఎదిరిస్తుంది. మానవ లక్షణాలను ఆడమగ ఊహలపై నిర్ణయించ రాదు. వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగా మనుష్య గుణాలను అంచనాగట్టాలి. స్త్రీలు స్త్రీత్వాన్ని కాదు, వనితావివక్షతను తిరస్కరించాలి. ఆడతనం హక్కు లు, బాధ్యతలపై పరిమితులు విధించరాదు. మానవత్వ వికాసానికి దోహదపడాలి.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి,